ఎదురులేని వెదురు!

డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? లక్షల్లోనే కదా? సిమెంట్, సీకులు, ఇటుక, కంకర ధరలకు తడిసి మోపెడవుతుంది. కాబట్టి, వెదురు వీటికి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. వెదురుతో ఇల్లు కట్టుకోవడమే కాదు.. ఇంటీరియర్ డిజైనింగ్కూ వాడొచ్చు. కలప, ఇనుముకు ప్రత్యామ్నాయంగా వెదురుకు మంచి డిమాండ్ ఉన్నది.
నిర్మాణ రంగంలో వెదురుకు ఉన్న అవకాశాలపై డిసెంబర్లో ‘బ్యాంబూ ఇండియా ఫోరం’ జాతీయ సదస్సు జరిగింది. వెదురు వినియోగం వల్ల వచ్చే ఆధునికత, మన్నిక వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేకంగా చర్చించారు. దేశ, విదేశాల నుంచి హాజరైన ప్రముఖులు నిర్మాణం రంగంలో వెదురు ఉత్పత్తుల వాణిజ్యాన్ని స్థిరమైన పద్ధ్దతిలో ప్రోత్సహించడం గురించి మాట్లాడారు. వెదురు రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘బ్యాంబూ ఇండియా ఫోరం’ పనిచేస్తున్నది.
నిపుణుల సూచన
ఇండ్లు, ఇతర భవనాల నిర్మాణాల్లో వెదురు ఒక పురాతన సామగ్రి. భవన నిర్మాణాలకు వాడే మెటీరియల్‌కు భారీగా డిమాండ్ ఉండటంతో తక్కువ ధరకు లభించే వెదురు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా బహుళ అంతస్థుల నిర్మాణాల్లోనూ ఇనుము (స్టీల్)కు ప్రత్యామ్నాయంగా వెదురును వాడుతున్నారు. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు సైతం వెదురును ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. వెదురుతో ఆకట్టుకునే నిర్మాణాలు, ఆకర్షణీయమైన వస్తువులను తయారుచేసుకోవచ్చు కాబట్టే, ఇంతగా డిమాండ్ పెరుగుతున్నది.
వెదురే ఎందుకు?
వెదురు కలప రకరకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడంతో పాటు, ఇతర ఉత్పత్తులైన నిచ్చెన, బల్లలు, కుర్చీలు, బుట్టలు, తట్టలు.. ఇలా ఎన్నో రకాల గృహోపకరణాల తయారీకి వినియోగిస్తున్నారు. వెదురును ఎందుకు ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారంటే.. భవన నిర్మాణంలో అతి ముఖ్యమైన నిర్మాణ సామాగ్రి స్టీలు. దీనిని రకరకాల రూపంలో మనం వాడుతున్నాం. అయితే దీనిని ఉత్పత్తి చేసేటప్పుడు కాలుష్యం ఏర్పడుతుంది. ఫ్యాక్టరీల్లో భారీగా స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుండటం, ఇది ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల కొనాలంటేనే వినియోగదారులు వెనకాముందు ఆలోచిస్తున్నారు. దీంతో, ప్రత్యామ్నాయంగా ఇంజినీర్లు వెదురు కలపను సూచిస్తున్నారు. స్టీల్‌లో ఉండే అన్ని గుణాలూ వెదురులో ఉన్నాయని చెప్తున్నారు.
కాంట్రాక్టర్లకు సూచన
ప్రభుత్వ పనులను చేపట్టే కాంట్రాక్టర్లు వెదురును వాడవచ్చని ప్రభుత్వమే ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఇందుకోసం, ప్రత్యేకంగా స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)లో 12 ఉత్పత్తులను ఉంచారు. అందులో వెదురు కలప కూడా ఉంది. అంటే, ప్రభుత్వ రంగానికి సంబంధించిన నిర్మాణాల్లో వెదురు కలపను స్టీల్ స్థానంలో వాడవచ్చన్నమాట. ఇటీవల సింగపూర్ ఫ్యూచర్ సిటీస్ ల్యాబొరేటరీలో సైతం వెదురు కలపపై రకరకాల పరీక్షలు నిర్వహించారు. దాని ఆధారంగా, వెదురును స్టీల్‌కు దీటైనదని ప్రకటించారు. భవిష్యత్ నిర్మాణాల్లో వెదురు కలప కీలక పాత్ర పోషించనుంది.
ఆకర్షణీయమైన ఉత్పత్తులు
నిర్మాణ రంగంలో స్టీల్‌కు బదులుగా వెదురు వాడుతున్నట్లే, ఇండ్లలో ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకునే ఇంటీరియర్స్ కోసమూ వెదురు కలపను విరివిగా వాడుతున్నారు. ఇదివరకు ఎక్కువగా హస్తకళా రూపాల తయారీలో మాత్రమే ఉపయోగించేవారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురుతో చాపలు, రకరకాల బుట్టలు, ట్రేలు అల్లడం తెలుసు. కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కోసం వాడటం వల్ల మార్కెట్లో ఆదరణ లభిస్తున్నది. వినియోగదారుల అభిరుచులనుబట్టి ఆకర్షణీయమైన వెదురు ఉత్పత్తులు లభిస్తుండటం కూడా వెదురుపట్ల ఆసక్తి పెరగడానికి కారణమని అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు.
వెదురు..ఇప్పటిది కాదు
వెదురు ఇప్పటిదేం కాదు. చాలా ఏండ్ల క్రితం నుంచీ ఇండ్ల నిర్మాణానికి వెదురే చక్కటి ఎంపిక. ఆశ్రమాలు, గుడిసెలకు ఎక్కువగా వెదురే వాడేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లవద్ద తడకల కోసం వెదురు బొంగులను ఉపయోగించేవారు. మధ్యలో కాంక్రీట్ హవా కొనసాగి, కాస్త వెదురు వినియోగం తగ్గింది. అయితే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెదురును మళ్లీ ఆదరిస్తున్నారు. దీనికి పూర్వ వైభవం వచ్చేలా వినియోగిస్తున్నారు.
ఇదే మా వృత్తి
గత 15 ఏండ్లుగా వెదురు కలపతోనే ప్రత్యేకంగా ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. దీన్నే మా ప్రధాన వృత్తిగా ఎంచుకున్నాం. ఇప్పటి వరకు 150కి పైగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాం. నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనూ వెదురుతో ఇండ్లు నిర్మించాం. ప్రజల అభిరుచులకు అనుగుణంగా గృహోపకరణ ఉత్పత్తులను తయారుచేసి సరఫరా చేస్తుంటాం. వెదురుతో నిర్మించిన ఇండ్లను, ఇతర నిర్మాణాలను చూసి.. అలాంటివి కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచులను బట్టి రకరకాల డిజైన్లతో సిద్ధంచేసి ఇస్తున్నాం.
-అరుణా లింగం, బ్యాంబూ హౌసింగ్ ఇండియా వ్యవస్థాపకులు
తాజావార్తలు
- అన్‌లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- 23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- ఒకే రోజు 8 చిత్రాలు..జనవరి 29న సినీ జాతర..!
- విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైనట్లేనా..?
- బ్లడ్‌లో హై ఒమెగా-3 ఫ్యాట్‌తో నో కొవిడ్ రిస్క్
- ‘సీఎం అయిన మీకు.. అరెస్ట్ వారెంట్ ఎవరిస్తారు..’
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..
- ‘ఓటిటి’ కాలం మొదలైనట్టేనా..?
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..