శుక్రవారం 22 జనవరి 2021
Realestate - Dec 26, 2020 , 00:26:27

నిర్మాణ రంగంలో.. హైదరాబాద్‌ దూకుడు!

నిర్మాణ రంగంలో.. హైదరాబాద్‌ దూకుడు!

  • దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో రెండోస్థానం
  • నాలుగో త్రైమాసికంలో 68% వృద్ధి 
  • జేఎల్‌ఎల్‌ తాజా సర్వేలో వెల్లడైన విషయాలు

రెండో స్థానం 

దేశ నిర్మాణ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతున్నది. ఏడు మెట్రో నగరాల్లోని నిర్మాణ రంగాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది ఇతర నగరాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లుగా తేలింది. కొత్త యూనిట్లు ప్రారంభం కావడంతో పాటు ఫ్లాట్ల అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రధానంగా కొవిడ్‌-19తో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకొని హైదరాబాద్‌ నిర్మాణ రంగం నిలబడినట్లుగా జేఎల్‌ఎల్‌ తాజా నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాపంగా మూడవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)తో పోలిస్తే నాలుగవ త్రైమాసికం (అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు)లో 51 శాతం అమ్మకాలు పెరిగినట్లు వెల్లడించింది. ఇందులో 3,323 యూనిట్ల (147శాతం వృద్ధి)తో ఫుణే నగరం మొదటి స్థానంలో నిలువగా, 3,570 యూనిట్ల (68శాతం) వృద్ధితో హైదరాబాద్‌ రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొంది. 

గణనీయ వృద్ధి

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌-19తో నిర్మాణ రంగం గత దశాబ్దంలో చూడని అనిశ్చితిని చవిచూసినట్లు నిర్మాణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత సడలింపుల్లో భాగంగా మొదటి దశలోనే నిర్మాణ రంగానికి మినహాయింపు లభించింది. దీంతో ఇతర రంగాల కంటే కోలుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఫోర్త్‌ క్వార్టర్‌లో 26,785 కొత్త రెసిడెన్షియల్‌ యూనిట్లు ప్రారంభం కాగా, 40 శాతంతో హైదరాబాద్‌ ఇతర నగరాలను అధిగమించింది. 

ఎక్కడెక్కడంటే? 

ప్రధానంగా మణికొండ, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌తో పాటు ఎల్బీనగర్‌, కొంపల్లి ప్రాంతాల్లో యూనిట్ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు జేఎల్‌ఎల్‌ సర్వేల్లో తేలింది. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలలో రెసిడెన్షియల్‌ సెక్టార్‌ భారీగా పుంజుకుందని, 2021లో హౌజింగ్‌ రంగం మరింత పటిష్టం కానుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ శాఖ జనరల్‌ సెక్రెటరీ వి. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. రియల్‌ రంగంలో, ప్రభుత్వం నూతన సంస్కరణలతో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా ప్రభావాన్ని కూడా తట్టుకొని నిర్మాణ రంగం దూసుకెళ్తుండటం మంచి పరిణామమనీ.. మరింత దూకుడుగా ఉండే అవకాశమున్నట్లు వివరించారు. logo