ఆదివారం 17 జనవరి 2021
Realestate - Nov 28, 2020 , 01:22:01

ఆకాశమే హద్దుగా..

ఆకాశమే హద్దుగా..

  • దూసుకెళ్తున్న‘హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌'రంగం

‘ఆకాశమే హద్దు’.. అన్నట్లుగా ‘హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌' దూసుకెళ్తున్నది. ఆర్థిక మాంద్యం, కరోనాలాంటి విపత్కర పరిస్థితులతో దేశవ్యాప్తంగా స్థిరాస్తి వ్యాపారం మందగించగా.. భాగ్యనగరంలో మాత్రం పరుగులు పెడుతున్నది. దేశంలోని మిగతా మెట్రోనగరాలతో పోలిస్తే.. నివాస గృహాల అమ్మకాలు, ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో అధిక వృద్ధిని సాధిస్తున్నది. అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ‘హైదరాబాద్‌ రియల్‌' రంగాన్ని అగ్రభాగాన నిలిపింది. 

లాక్‌డౌన్‌ తర్వాతా హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తన జోరును కొనసాగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన పలు విప్లవాత్మక సంస్కరణలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తీసుకొచ్చిన ‘టీఎస్‌-ఐపాస్‌' విధానం రాష్ర్టానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకొచ్చింది. ఆరేండ్లలోనే రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల విస్తరణ జరగడంతో, కొత్తగా నివాస ప్రాంతాలూ పెరగడంతో ఆకాశమే హద్దుగా రియల్‌ రంగం ఎదుగుతున్నది. 

సమైక్య రాష్ట్రంలో అస్థిర పాలన, తెలంగాణ ఉద్యమం.. ఆ తర్వాతి పరిణామాలతో భాగ్యనగరంలో స్థిరాస్తి వ్యాపారం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొన్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత, రియల్‌ ఎస్టేట్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారు. నిపుణులతో చర్చించి, పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి ఫలితంగానే హైదరాబాద్‌ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటున్నదని స్థిరాస్తి నిపుణులు, బిల్డర్లు, ఇంజినీర్లు, కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ వ్యాఖ్యలతో ప్రమాదం.. 

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పలు పార్టీల నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనీ, నగరంలో ప్రశాంత జీవనానికి భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని రియల్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగరవాసుల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు, నగరంలో అశాంతికి కారణమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నదనీ, ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నదంటున్నారు. గత ఆరేండ్లుగా మన రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండటంతోనే ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఏవియేషన్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. ఆయా కంపెనీలు మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న సమయంలో, కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రియల్‌ ఎస్టేట్‌తోపాటు ఇతర రంగాలపైనా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

పారదర్శకంగానే..

తెలంగాణ ప్రభుత్వ పారదర్శక పాలనతో హైదరాబాద్‌ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నది. నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చింది. నిర్ణీత వ్యవధిలో పారదర్శక అనుమతులతో నగరంలో పెట్టుబడులకు మరింత విశ్వాసం పెరిగింది. టీఎస్‌ ఐపాస్‌, డీపీఎంఎస్‌, టీఎస్‌ బీపాస్‌, ధరణిలాంటి విధానాలను ప్రవేశపెట్టి, దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచింది. వర్క్‌సెంటర్లకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో ‘వాక్‌ టు వర్క్‌' లక్ష్యంగా ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020ని తీసుకొచ్చింది. ప్రభుత్వ సంస్కరణలతో బిల్డర్‌ కమ్యూనిటీతోపాటు కొనుగోలుదారులకూ ప్రయోజనం చేకూరుతున్నది. 

- కేవీ రామారావు వైస్‌-చైర్మన్‌, సుమధుర గ్రూప్‌ 

ముఖ్యమంత్రి అద్భుత స్పందన 

తెలంగాణ ఏర్పాటు తర్వాత ‘రియల్‌' రంగం అభివృద్ధి కోసం బిల్డర్లు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతంగా స్పందించారు. ఏకంగా ఐదున్నర గంటల సమయాన్ని కేటాయించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి స్థిరాస్తి వ్యాపారవృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర ఇబ్బందులు, వాటి పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత దశల వారీగా పలు సంస్కరణలు తీసుకువచ్చారు. రియల్‌ రంగానికి ప్రయోజనం చేకూరేలా ఆరేండ్లలో ఎనిమిది జీవోలను జారీ చేశారు. సుస్థిరమైన ప్రభుత్వానికి తోడు మెరుగైన సంస్కరణలతో రియల్‌ ఎస్టేట్‌ స్థిరంగా వృద్ధిని సాధిస్తున్నది.

- జీ రాంరెడ్డి, చైర్మన్‌, క్రెడాయ్‌ (తెలంగాణ)

అధిక ప్రాధాన్యం 

హైదరాబాద్‌లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా ఐటీ రంగం బాగా వృద్ధి చెందింది. ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో ‘రియల్‌'రంగం అంతకు ముందుకంటే మరింత వృద్ధిని నమోదు చేస్తున్నది. మౌలిక వసతుల కల్పనతోనే నగరం నివాసయోగ్యంగా మారింది. ఫలితంగా స్థిరాస్తి రంగం వృద్ధి చెందుతున్నది. 

- ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా

‘ధరణి’ ఒక సంచలనం

సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ‘ధరణి పోర్టల్‌'.. నిర్మాణరంగంలో ఓ సంచలనం. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఈ పాస్‌బుక్‌ ప్రక్రియ మొత్తం అరగంటలోపే పూర్తవడం శుభపరిణామం. భవిష్యత్తులోనూ భూ క్రయవిక్రయాల్లో లిటిగేషన్లకు ఆస్కారం ఉండదు. ‘ధరణి’ వల్ల ప్రజలతోపాటు రియల్టర్లకూ భరోసా దక్కుతున్నది. 

- ప్రేమ్‌సాగర్‌, ఎండీ, జయభారతి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

టీఆర్‌ఎస్‌తోనే ఊపిరి

గతంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త ఊపిరులూదింది. ప్రభుత్వం ప్రకటిస్తున్న భారీ ప్రాజెక్టులవల్ల నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దినదినాభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ఫార్మాసిటీలాంటి ప్రాజెక్టులతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకున్నది. ప్రభుత్వ విధానాలతోపాటు భౌగోళికంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకత కూడా నగరంలో రియల్‌ఎస్టేట్‌ వృద్ధి చెందడానికి దోహదం చేస్తున్నది. 

- రవివర్మ, బిల్డర్‌, నిజాంపేట

సమయం కలిసి వస్తుంది

నిర్మాణరంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్‌-బీపాస్‌ దేశంలోనే విప్లవాత్మకమైన సంస్కరణ. ఇంతకుముందైతే ఒక ఇల్లు, అపార్టుమెంటు నిర్మాణం కోసం అనుమతి కావాలంటే, నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. దీంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేక డెవలపర్లు ఇబ్బంది పడేవారు. టీఎస్‌-బీపాస్‌తో రోజుల వ్యవధిలోనే అనుమతులు వచ్చేస్తాయి. ఒక భవన నిర్మాణ అనుమతి కోసం పలు ప్రభుత్వ శాఖలను వేర్వేరుగా సంప్రదించాల్సి రాకుండానే, సింగిల్‌ విండో విధానం అమల్లోకి రావడం ప్రయోజనకరం. స్వీయ ధృవీకరణ ద్వారానే 500 గజాల లోపు భవన నిర్మాణాలకు సత్వరమే  అనుమతి రావడం వల్ల లక్షలాది మందికి మేలు కలుగుతుంది. 

- ఉపేందర్‌, సభ్యుడు, క్రెడాయ్‌ 

సానుకూల నిర్ణయాలు

రియల్‌ ఎస్టేట్‌ కోసం ప్రభుత్వం అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నది. దాని ఫలితంగానే నోట్ల రద్దు, కరోనాలాంటి విపత్తులను కూడా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం తట్టుకొని నిలబడింది. తాజాగా తీసుకొచ్చిన టీఎస్‌-బీపాస్‌ దేశం మొత్తానికీ ఆదర్శంగా నిలిచింది. బిల్డర్లకు, భవన యజమానులకు ఎంతో మేలు చేస్తుంది. భవన నిర్మాణం విషయంలో ఉన్న అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాల వారూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తితో ఉన్నారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో భరోసానిస్తున్నది. 

- ప్రవీణ్‌ చారి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, హైదరాబాద్‌