గురువారం 28 జనవరి 2021
Realestate - Nov 13, 2020 , 00:21:11

రియల్‌ దూకుడు

రియల్‌ దూకుడు

  • నిర్మాణరంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌

నిర్మాణరంగంలో భాగ్యనగరం దూసుకెళ్తున్నది. కొవిడ్‌ ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకొని, ‘హైదరాబాద్‌ రియల్‌ రంగం’ స్థిరంగా నిలబడింది. కొత్త యూనిట్లు ప్రారంభం కావడంతో పాటు ఫ్లాట్ల అమ్మకాల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నది. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని నిర్మాణ రంగాన్ని పరిశీలిస్తే, ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఆర్‌ఈఐఎస్‌), జేఎల్‌ఎల్‌ నిర్వహించిన సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

ప్రపంచాన్ని గజగజ వణికించిన ‘కొవిడ్‌-19’తో కుదేలవని రంగమంటూ లేదు. కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ వల్ల, అన్ని వ్యవస్థల్లోనూ స్తబ్ధత ఆవహించింది. ఈ క్రమంలో ‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం’ కూడా కకావికలమైపోయింది. గత దశాబ్దంలో చూడని అనిశ్చితిని, స్థిరాస్తి వ్యాపారం చవిచూసినట్లు నిర్మాణరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత సడలింపుల్లో భాగంగా మొదటి దశలోనే నిర్మాణరంగానికి మినహాయింపు లభించింది. దీంతో ఇతర రంగాల కంటే ముందుగానే స్థిరాస్తి రంగం కోలుకున్నది. ఈ నేపథ్యంలో 2020 రెండో, మూడో త్రైమాసికంలో దేశంలోని ముఖ్య నగరాల్లోని ‘రియల్‌ రంగం’పై రియల్‌ ఎస్టేట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఆర్‌ఈఐఎస్‌), జేఎల్‌ఎల్‌ సర్వే నిర్వహించింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతాల్లో నివాస సముదాయాల్లోని ఫ్లాట్ల విక్రయాలు, కొత్త నివాస సముదాయాల యూనిట్ల ప్రారంభం ఎలా ఉందనే దానిపై ఓ నివేదిక తయారు చేసింది. ఈ క్రమంలో యూనిట్ల విక్రయాల్లో హైదరాబాద్‌ చాలా ముందంజలో ఉండగా, కొత్త యూనిట్ల ప్రారంభంలోనూ రెండో త్రైమాసికం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడైంది. 


గణనీయ వృద్ధి

ఈఏడాది రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో నివాస సముదాయాల్లోని ఫ్లాట్లను విక్రయించడం చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిందని బిల్డర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఏడు మెట్రో నగరాల్లో రెండో త్రైమాసికంలో 10,753 యూనిట్ల అమ్మకాలు చేపట్టగా, మూడో త్రైమాసికంలో 34 శాతం వృద్ధితో 14,415 యూనిట్ల విక్రయాలు జరిగాయి. నగరాలవారీగా చూస్తే.. హైదరాబాద్‌లో గణనీయమైన వృద్ధి నమోదైంది. రెండో త్రైమాసికంలో 1,207 యూనిట్లు విక్రయిస్తే, మూడో త్రైమాసికంలో ఏకంగా 2,122 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే 76 శాతం పెరుగుదల నమోదైంది. మణికొండ, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌తోపాటు ఎల్బీనగర్‌, కొంపల్లి ప్రాంతాల్లో యూనిట్ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు ఈ సర్వేల్లో తేలింది. చెన్నైలో 241 శాతం వృద్ధి ఉన్నప్పటికీ, సంఖ్యాపరంగా హైదరాబాద్‌ కంటే వెనుకంజలోనే ఉంది. ఆ తర్వాత పుణెలో 58 శాతం వృద్ధి నమోదు కాగా, బెంగళూరు, కోల్‌కత్తాల్లో వృద్ధి మైనస్‌లోకి వెళ్లిపోయింది. 

43 శాతం ఇక్కడే

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మొదటి దశలోనే మినహాయింపును పొందిన నిర్మాణ రంగం, దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో కోలుకోలేకపోయింది. ముఖ్యంగా కొత్త నివాస సముదాయాల యూనిట్లను ప్రారంభించడంలో రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో తగ్గుదల నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు మెట్రో నగరాల్లో 14,780 కొత్త యూనిట్లు ప్రారంభం కాగా, మూడో త్రైమాసికంలో 12,654 కొత్త యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. అంటే 14 శాతం తగ్గుదల నమోదైంది. అయితే రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌ వాటా 34 శాతం ఉండగా, మూడో త్రైమాసికానికి వచ్చేసరికి 43 శాతానికి పెరగడమనేది గొప్ప విషయం. మూడో త్రైమాసికంలో ఏడు మెట్రోల్లో 12,654 కొత్త యూనిట్లు ప్రారంభమవగా, అందులో హైదరాబాద్‌లోనే 5,396 యూనిట్లు ఉన్నాయి. అంతేకాకుండా రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో ఏడు శాతం వృద్ధి కూడా నమోదైంది. 

ఇతర ఏ నగరాల్లోనూ మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌ స్థాయి కొత్త యూనిట్ల ప్రారంభం నమోదు కాలేదు. బెంగళూరులో రెండో త్రైమాసికం దేశంలోనే గరిష్ఠంగా ఆరు వేల పైచిలుకు కొత్త యూనిట్లు ప్రారంభమైతే, మూడో త్రైమాసికానికి వచ్చేసరికి కేవలం వెయ్యి పైచిలుకుతో ఏకంగా 82 శాతం తగ్గుదలను నమోదు చేసుకున్నది. చెన్నై, పుణెల్లో వృద్ధి సాధించినా సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నాయి. ముంబయిలోనూ రెండు శాతం తగ్గుదల నమోదైంది.

ఆ రెండు నగరాల్లో.. 

దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో అమ్ముడుపోని నిర్మాణ సముదాయాల యూనిట్ల జాబితా కూడా భారీగానే ఉన్నది. కాకుంటే, మూడో త్రైమాసికానికి వచ్చే సరికి రెండో త్రైమాసికం కంటే స్వల్ప తగ్గుదల కనిపించింది. రెండో త్రైమాసికంలో 4,59,378 యూనిట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య 4,57,427గా నమోదైంది. అయితే ఇందులో కేవలం ఢిల్లీ, ముంబయిల్లోనే 50శాతం యూనిట్లు ఉన్నట్లుగా వెల్లడైంది. logo