గురువారం 03 డిసెంబర్ 2020
Realestate - Nov 13, 2020 , 00:21:08

హరితమే ఆనందం

హరితమే ఆనందం

  • పచ్చదనాన్ని కోరుకుంటున్న నగరవాసులు  
  • అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలు

తమ కలల సౌధం.. ఆధునిక జీవనానికి సరికొత్త చిరునామాగా నిలవాలి. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా ఉండాలి. శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేయాలి. ఇదీ.. ప్రస్తుత గ్రేటర్‌వాసులు కోరుకుంటున్న జీవనశైలి. వారి అభిరుచికి తగ్గట్లే నగరంలో ‘హరిత భవనాలు’ నిర్మితమవుతున్నాయి. అనేక స్థిరాస్తి సంస్థలు, ఈవైపుగా అడుగులు వేస్తున్నాయి. 

కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో, నగరవాసులు హరిత భవనాల వైపు చూస్తున్నారు. ఆహ్లాదం.. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, పచ్చదనం తొణికిసలాడే ప్రదేశాల్లోనే, తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. తమ అభిరుచుల మేరకు డెవలపర్లు చేపడుతున్న ‘వర్టికల్‌ గార్డెన్‌' కాన్సెప్ట్‌లకు ఓటేస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ పద్మారావు నగర్‌, రాజేంద్రనగర్‌ కిస్మత్‌పుర, తెల్లాపూర్‌, కోకాపేట తదితర ప్రాంతాల్లో వర్టికల్‌ గార్డెన్‌ నిర్మాణాలకు రియల్టర్లు శ్రీకారం చుట్టారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌లోనూ దాదాపు 200లకు పైగా ప్రాజెక్టులను నమోదు చేశారు. పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడం, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం, గ్లోబల్‌ వార్మింగ్‌ను నియంత్రించడం సవాల్‌గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, ఇలాంటి కాన్సెప్ట్‌లు రావడం శుభపరిణామమని పర్యావరణ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని తలపించేలా అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు రావడం హర్షనీయమని అంటున్నారు. అయితే, స్వచ్ఛమైన గాలి, జీవన ప్రమాణాల పెంపులాంటి అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలున్న వర్టికల్‌ గార్డెన్‌ నిర్మాణాలకు రాబోయే రోజుల్లో మరింత ఆదరణ లభిస్తుందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. 

అనేక లాభాలు

నగర కాలుష్యానికి చెక్‌ పెడుతూ, పర్యావరణానికి హాని కలుగకుండా నిర్మాణాలు చేపట్టేందుకు పలు స్థిరాస్తి సంస్థలు కృషి చేస్తున్నాయి. వర్షపు నీరు ఇంకేలా రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, తక్కువ విద్యుత్‌ వినియోగం, వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా హరితభవనాలను నిర్మిస్తున్నాయి. విండ్‌ ఎనర్జీ, సోలార్‌ పవర్‌తో40 శాతం విద్యుత్‌ ఆదా, సూర్యకాంతికి వీలుగా నిర్మాణాలు.. ఇలా అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండటంతో నగరవాసులు కూడా మొగ్గు చూపుతున్నారు. సొంతిల్లు కొనుక్కునే వారితోపాటు కార్పొరేట్‌ కంపెనీలు కూడా హరిత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

భవిష్యత్తు హరిత భవనాలదే 

విశ్వనగరానికి తగ్గట్టుగా గృహనిర్మాణం విస్తరిస్తున్నది. ప్రస్తుతం వర్టికల్‌ గార్డెన్‌ నిర్మాణాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నది. దీంతో ఈ నిర్మాణాల వైపు డెవలపర్లు మొగ్గు చూపుతున్నారు. జనాభా పెరుగుదల, పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచం గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులవంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యరహిత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. 

- జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ఆదరణ బాగున్నది..

ప్రస్తుతం వర్టికల్‌ గార్డెన్‌ నిర్మాణాలకు ఆదరణ బాగున్నది. ఈ భవనాలలో బహు ప్రయోజనాలున్నాయి. బయటి గోడలు, ఇంటి లోపల ప్రదేశాల్లో వేడి ప్రవాహాన్ని తగిస్తాయి. అన్ని అంతస్తుల్లోనూ ప్రతి అపార్ట్‌మెంట్‌కూ ప్రత్యేకమైన మొక్కలను పెంచే అవకాశం ఉంటుంది. ఫలితంగా గాలిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ను అరికట్టవచ్చు. పచ్చదనంతో మానసిక, శారీరక ఒత్తిడి కూడా దరిచేరదు. మొక్కలు వాయు కాలుష్యాన్ని తగ్గించి, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. 

- ఏఆర్‌ జైపాల్‌ రెడ్డి, ఫాల్గుణా ఆర్కిటెక్ట్స్‌