గురువారం 03 డిసెంబర్ 2020
Realestate - Nov 07, 2020 , 02:29:44

ఔటర్‌కు దగ్గర్లో టౌన్‌షిప్స్‌

ఔటర్‌కు దగ్గర్లో టౌన్‌షిప్స్‌

 • 5 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు
 • వాక్‌ టు వర్క్‌ పద్ధతికి ప్రాధాన్యం
 • కార్యాలయాలు, నివాసాలు, వసతులు అన్నీ ఒకే చోట
 • హైదరాబాద్‌పై భారం తగ్గించడమే లక్ష్యం
 • తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020 ఖరారు
 • రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు భారీగా రాయితీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరం ఇక ఔటర్‌ అవతలా విస్తరించనుంది. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆవలివైపు టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020ని శుక్రవారం ఖరారు చేసింది. ఓఆర్‌ఆర్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో మౌలిక వసతులతో కూడిన టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తారు. అక్కడే నివాసాలు, కార్యాలయాలు ఏర్పాటవుతాయి. టౌన్‌షిప్‌లలో మౌలిక వసతులు సైతం కల్పిస్తారు. పాఠశాలలు, ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తారు. వర్క్‌టు వాక్‌ అనే కాన్సెప్ట్‌తో ఈ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. వ్యాపార సముదాయాలు, ఐటీ, సాధారణ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారు. టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, కంపెనీలు, వ్యాపారులకు ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించింది. ఇదే సమయంలో నిబంధనలూ విధించింది. ఆసక్తి గల సంస్థలు హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధిశాఖలకు ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాల్సి ఉంటుంది.     

భాగ్యనగరంపై భారం తగ్గించేందుకే నిర్ణయం

దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌పై భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్ర నలుమూలల నుంచేగాక పొరుగు రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలసలు ఎక్కువ. ఏటా నగరానికి వలసొచ్చే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటున్నది. దీంతో భాగ్యనగరంపై ఎక్కువ భారం పడుతున్నది. దానిని తగ్గించేందుకు ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అవతలి వైపు టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలన్న ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు చొరవతో ఇంటిగ్రేటెడ్‌టౌన్‌షిప్‌-2020 పాలసీ రూపుదిద్దుకున్నది. 

టౌన్‌షిప్‌ స్వరూపం 

 • 60 రోజుల్లోనే దరఖాస్తుల పరిష్కారం
 • టౌన్‌షిప్‌ కోసం ఓఆర్‌ఆర్‌ అవతల 5 కిలోమీటర్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో కనీసం 100 ఎకరాల స్థలం ఉండాలి.
 • టౌన్‌షిప్‌లోని మొత్తం భూమిలో పావు నుంచి సగభాగం వరకు వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ఐటీ, సాధారణ పరిశ్రమలు, సేవా కేంద్రాలకు కేటాయించాలి.
 • టౌన్‌షిప్‌లోని భూమిలో సగానికి తక్కువ కాకుండా నివాస సముదాయాలకు కేటాయించాలి.
 • 10శాతం భూమిని పార్క్‌లకు, క్రీడా మైదానాలకు కేటాయించాలి. 
 • 100 నుంచి 300 ఎకరాల విస్తీర్ణంలోని టౌన్‌షిప్‌లో ప్రధాన రహదారిని 30మీటర్ల వెడల్పుతో నిర్మించాలి.
 • 300 ఎకరాలకు పైనున్న టౌన్‌షిప్‌లో 36 మీటర్ల వెడల్పుతో ప్రధాన రహదారి ఉండాలి.

ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు 

 • భూ అభివృద్ధి చార్జీల్లో 90% మినహాయింపు
 • అవసరాల మేరకు 10% ప్రభుత్వం భూమిని బదలాయించుకునే అవకాశం
 • భూ అభివృద్ధి పన్నుల్లో 50% నుంచి 100% వరకు రాయితీ
 • ప్రజావసరాల కోసం కల్పించే వసతులపై 100% పన్ను తగ్గింపు
 • మిగతా నిర్మాణాలపై ఐదేండ్ల వరకు 50% పన్ను తగ్గింపు

నిబంధనలు ఇవి :

 • పర్యావరణ పరంగా సున్నితమైన  ప్రాంతం కాకూడదు.
 • జాతీయ, రాష్ట్ర, ఇతర జిల్లా రహదారులను మూసివేసేవిధంగా టౌన్‌షిప్‌ ఉండకూడదు. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని భావించే సంస్థలు సంబంధించిన రహదారులను ప్రజారవాణాకు అనుమతించాలి. 
 • టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలనుకునే కంపెనీలు, సంస్థలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కచ్చితంగా రెరాలో (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) రిజస్టర్‌ అయి ఉండాలి. 
 • టౌన్‌షిప్‌కు సంబంధించి తొలుత టీస్‌బీపాస్‌ అనుమతులను పొందాలి. తరువాత డీపీఆర్‌లను ఆమోదింపచేసుకోవాలి. 
 • టౌన్‌షిప్‌ను ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఈసీబీసీ), ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) నియమనింబంధనలు పాటించాలి.
 • టౌన్‌షిప్‌ నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ నివాసం ఉండేవారు. వ్యాపారాలు నిర్వహించేవారితో ప్రత్యేకంగా ఒక అసోసియేషన్‌ ఉండాలి. అది టౌన్‌షిప్‌లోని పారిశుధ్యం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, ఇతర మౌలికవసతులను పర్యవేక్షిస్తుండాలి.