శుక్రవారం 04 డిసెంబర్ 2020
Realestate - Oct 31, 2020 , 00:13:02

స్మార్ట్‌గా బతికేద్దాం

స్మార్ట్‌గా బతికేద్దాం

మారుతున్న కాలంతోపాటు మనం ఉపయోగించే వస్తువులు కూడా ‘స్మార్ట్‌'గా మారిపోతున్నాయి. మనిషికి ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా, అనేక ఆధునిక ఉత్పత్తులు మార్కెట్లలోకి వస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ఇతర వస్తువులు మానవుల సేవలో తరిస్తుండగా, మరికొన్ని కూడా మన ఇండ్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రస్తుతం మనమందరం జీవిస్తున్నది ‘స్మార్ట్‌ ప్రపంచం’లోనే. మన జీవితాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నవి కూడా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లే. అందుకే చేతిలో సెల్‌ఫోన్‌ మొదలు.. ఇల్లు, ఆఫీస్‌, కారు ఇలా ప్రతీది ‘స్మార్ట్‌'గా తయారవుతున్నాయి. ఇలాంటి తరుణంలో అందమైన ఇంటికంటే, ఆధునికతను జోడిస్తూ కట్టుకునే ఇల్లే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని గృహ యజమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి కట్టుకున్న తర్వాత మళ్లీమళ్లీ రిపేర్లు.. మాడిఫికేషన్‌ చేయించాలంటే కష్టంతో కూడుకున్నది. అందుకోసమే ఇంటి నిర్మాణ సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటికి నాడీ వ్యవస్థగా చెప్పుకునే ఎలక్ట్రిక్‌ వైరింగ్‌, స్విచ్‌ బోర్డులు కూడా ‘స్మార్ట్‌'గా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకోసమే వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా సరికొత్త ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ విరివిగా లభిస్తున్నాయి. ఇప్పడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ వస్తువులు, మున్ముందు ప్రతి ఇంట్లోకి రాబోతున్నాయి. 

రిమోట్‌ కంట్రోల్‌ ఫ్యాన్లు

ఫ్యాన్లు లేనిదే పూట గడవదు. చిన్న, మధ్యతరహా ప్రజల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఇంట్లో ఫ్యాన్‌ తప్పనిసరి వస్తువైపోయింది. వాతావరణం తరచూ మారుతుండటంతో ఫ్యాన్‌ స్పీడ్‌ను ఎక్కువ/తక్కువ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇదివరకు రెగ్యులేటర్లు ఉండేవి. కానీ, ఇప్పుడు రిమోట్‌ కంట్రోల్‌ ఫ్యాన్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. రిమోట్‌ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. కూర్చున్న చోటు నుంచే ఏ నంబర్‌లో కావాలంటే ఆ నంబర్‌లో.. ఎంత స్పీడ్‌లో కావాలంటే అంత స్పీడ్‌లో ఫ్యాన్‌ను తిప్పుకోవచ్చు.

రిమోట్‌ కంట్రోల్డ్‌ ఎలక్ట్రికల్‌ స్విచ్‌బోర్డు

ఇంట్లో తీరికలేకుండా పనిచేసి, ఓ చోట కూర్చున్న తర్వాత లైట్‌/ఫ్యాన్‌ వేసుకోవాలనుకుంటాం. కానీ, అప్పటికే కుర్చీ మీదో, మంచం మీదో వాలిపోయి ఉంటాం. అలాంటి సమయంలో కూర్చున్న చోటు నుంచే విద్యుత్‌ లైట్లను ఆన్‌/ఆఫ్‌ చేసే వెలుసుబాటు ఉంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కదూ.. అలాగే మాటిమాటికీ స్విచ్‌లను ఆన్‌/ఆఫ్‌ చేయడం ప్రమాదకరం కూడా. ఎందుకంటే, ఇండ్లలో విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువగా జరిగేది పాతతరం ఎలక్ట్రిక్‌ బోర్డుల వద్దే. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు వచ్చిందే.. రిమోట్‌ కంట్రోల్డ్‌ ఎలక్ట్రికల్‌ స్విచ్‌బోర్డు. టీవీ, ఏసీ, మ్యూజిక్‌ సిస్టమ్‌ తరహాలోనే రిమోట్‌ ఆధారంగా ఈ స్మార్ట్‌ స్విచ్‌బోర్డులు పనిచేస్తాయి. ఎలాంటి శ్రమ పడకుండా, కూర్చున్న చోటు నుంచే ఒకే ఒక్క క్లిక్‌తో స్విచ్‌లను ఆన్‌/ఆఫ్‌ చేసుకోవచ్చు. 

 వైర్‌లెస్‌ స్మార్ట్‌ స్విచ్‌

ఇంట్లో వైరింగ్‌ చేయించాలంటే పెద్ద తతంగం. స్విచ్‌ బోర్డులు ఎక్కడ అమర్చాలి? ఎన్ని ప్లగ్‌ పాయింట్లు బిగించాలి? ఎలాంటి వైర్లను వాడాలి? అని తెగ హైరానా పడిపోతుంటారు. దీంతోపాటు అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంటికి కొత్తగా ప్లగ్‌ పాయింట్లను బిగించాలంటే భారీగా ఖర్చు చేయడంతోపాటు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. కట్టుకున్న గోడలను బద్దలు కొట్టి, పైపులువేసి, వైర్లులాగితే కానీ పనిపూర్తికాదు. ఇక లీకేజీలు, షార్ట్‌సర్క్యూట్‌లు, ప్రమాదాలు అదనం. కానీ, ఇప్పుడు వైర్లు, పైపుల అవసరం లేకుండానే ఇంట్లోని ఎలక్ట్రిక్‌ వస్తువులను వినియోగించుకునేలా ‘క్రిస్టల్‌ గ్లాస్‌ వైర్‌లెస్‌ స్మార్ట్‌ టచ్‌ స్విచ్‌'లు వచ్చేశాయి. మొబైల్‌ యాప్‌, గూగుల్‌ సహకారంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఆపరేట్‌ చేయడం ఈ పరికరం ప్రత్యేకత.

స్విచ్‌బోర్డులోనే రూటర్‌

ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులుంటే అందరికీ ఇంటర్నెట్‌ వాడకం అవసరమైపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లో వైఫైని వాడుతున్నారు. ఇందుకోసం వైఫై రూటర్‌ ఏర్పాటు చేసుకోవడం, దానికి ప్రత్యేకంగా ప్లగ్గులు, స్విచ్‌లు.. ఇలా ఎంతో తతంగం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమస్యలు లేకుండా, ఇప్పుడు స్విచ్‌ బోర్డులోనే వైఫై రూటర్‌ను అమర్చిన ‘స్మార్టిఫై మాడ్యులర్‌ వైఫై స్మార్ట్‌ స్విచ్‌ బోర్డులు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరం ద్వారా వైఫై రూటర్‌ను గోడల్లోని స్విచ్‌ బోర్డులోనే అమర్చుకోవచ్చు. ఎలాంటి అదనపు వైరింగ్‌ అవసరం లేకుండా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పొందవచ్చు.

వాటర్‌ ప్రూఫ్‌ స్విచ్‌లు

కొన్ని సందర్భాల్లో తడి చేతులతోనే ఎలక్ట్రిక్‌ వస్తువులను ఆపరేట్‌ చేయాల్సి వస్తుంది. అయితే, అలా స్విచ్‌లు వేయడం ఎంతో ప్రమాదకరం. అంతేకాకుండా వర్షంపడితే గోడలతోపాటు వాటిలో వేసిన వైరింగ్‌ కూడా తడిసిపోవడం సహజం. ఇక ఆ లీకేజీల్లోకి విద్యుత్‌ ప్రసరించి, గోడలు ముట్టుకుంటే షాక్‌లు కొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఆరు బయట ఉండే కాలింగ్‌ బెల్‌ స్విచ్‌ల వద్ద ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇప్పుడు వాటర్‌ ప్రూఫ్‌ స్విచ్‌లు వచ్చేశాయి. ఇవి తడిని తమలోకి రానివ్వకుండా ప్రమాదాలను నివారిస్తాయి.