రియల్ జోరు

స్థిరాస్తిరంగం మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. కరోనా, లాక్‌డౌన్‌తో కమ్ముకున్న కారుమబ్బు.. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో దూది పింజలా తొలగిపోయింది. సంక్షోభాలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని, ‘హైదరాబాద్ రియల్ ఎస్టేట్' మరోసారి రుజువు చేసుకున్నది.
కరోనా మహమ్మారి స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కొవిడ్-19, లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన ఆరు నెలల్లో గిరాకీ భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో, స్థిరాస్తి అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్, ఫిక్కీ-నారెడ్కో సంస్థలతో కలిసి సర్వే చేపట్టింది. పడిలేచిన కెరటంలా రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకోబోతున్నదని ఈ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ3 సర్వే’ రిపోర్టులో పలు విషయాలను వెల్లడించింది.
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం, నిర్మాణరంగ సరుకుల రవాణా నిలిచిపోవడంతో స్థిరాస్తి వ్యాపారంలో కొంత స్తబ్థత నెలకొన్నది. అయితే, సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్యలతో కొద్ది రోజుల్లోనే రియల్ ఎస్టేట్‌రంగం తిరిగి పుంజుకున్నది. ఆపత్కాలంలో సరైన ప్రోత్సాహాన్ని అందించడం, పెరిగిన ఇసుక, సిమెంట్ ధరలను అదుపులోకి తీసుకురావడం, ప్రాజెక్టుల అనుమతి గడువును ఏడాదికి పెంచడం.. ఇలా అనేక సమస్యలను సర్కారు పరిష్కరించడంతో నిర్మాణరంగం తిరిగి నిలబడ్డది. దీంతోపాటు భవిష్యత్‌లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యంగా అప్రోచ్ రోడ్డు ‘వంద’ అడుగులు ఉండాలన్న నిబంధన కూడా తీసుకువచ్చింది. తెలంగాణ సర్కారు చేపట్టిన పలు సంస్కరణలతోపాటు కరోనా విభృంభణ కూడా తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ఇతర రాష్ర్టాలకు తిరిగి వెళ్లిన వలస కూలీలు నగరానికి వచ్చేశారు. ఫలితంగా మళ్లీ ఫిబ్రవరి నాటి పరిస్థితులను మరిపించేలా, నగర నలువైపులా నిర్మాణాల జోరు కనబడుతున్నది. అంతేకాకుండా కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ అద్భుత ప్రగతిని కనబర్చిందని, ఆఫీస్ స్పేస్ విషయంలోనూ అగ్రగామిగా నిలిచిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్-సీసీఐ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించింది.
భారీగా పెట్టుబడులు
కరోనా విజృంభించిన సమయంలోనూ హైదరాబాద్ నగరం తన పట్టును కోల్పోలేదు. అన్ని రంగాల్లోనూ పోటీతత్వాన్ని ప్రదర్శించింది. ఈ క్రమంలో పారిశ్రామికరంగంలో పలు బహుళ జాతి, దేశీయ సంస్థలు రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు, వ్యాపారాల విస్తరణకు ముందుకు వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ దేశంలో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) హైదరాబాద్‌లోని నార్సింగిలో రూ.500 కోట్లతో అంతర్జాతీయ అధునాతన డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మేధా ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆదిభట్లలో విమానాల విడి విభాగాల తయారీతోపాటు షాబాద్‌లో 3,600 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు కూడా ఏర్పాటైంది.
రాయితీలతో ప్రోత్సాహం..
భాగ్యనగరాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. నగరం ఉత్తర, దక్షిణ ప్రాంతాలతోపాటు పశ్చిమాన కూడా ఇప్పటికే గణనీయమైన డెవలప్ సాధించింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ‘లుక్ ఈస్ట్' పేరుతో నగర తూర్పు ప్రాంతంలోనూ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇండస్ట్రియల్ కారిడార్, వరంగల్ జాతీయ రహదారి, యాదాద్రి దేవాలయం.. ఇలా ఈస్ట్ హైదరాబాద్‌కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడులలో ప్రోత్సాహాకాలు అందిస్తూ, ఐటీ సంస్థలు, డెవలపర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. తూర్పు దిక్కున ప్రాజెక్టులు చేపట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీ కూడా కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే పారిశ్రామి పార్కుల్లో ఉన్న 35 ఎకరాల్లో ఐటీ పార్కులు, కార్యాలయాల ఏర్పాటుకు ఇప్పటికే ఐదు సంస్థలు అనుమతులు కూడా పొందాయి. ఇందులో హైదరాబాద్ డిస్ట్రిలరీస్, వైనరీస్ (12.40 ఎకరాలు/ఉప్పల్), మినాక్టో కెమ్ (2.66 ఎకరాలు/ఉప్పల్), గోకుల్దాస్ ఎక్స్పోర్ట్, మినీ టెక్స్టైల్ హైలం (నాచారం 8.93 ఎకరాలు) బేక్లైట్ హైలం (8 ఎకరాలు/నాచారం), స్వామి సోప్స్ అండ్ ఆయిల్స్(2 ఎకరాలు/ఉప్పల్)కు ప్రభుత్వం అనుమతించింది. ఇటు జీనోమ్ వ్యాలీలోనూ లైఫ్‌సైన్సెస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సంస్థ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
ముందంతా మంచికాలమే!
- కొవిడ్ నేపథ్యంలో మొదటి త్రైమాసికం పూర్తి నిరాశాజనకంగా మారింది. ఇక్కడ కరెంట్ సెంటిమెంట్ స్కోర్ 31గా నమోదైంది. ఆ తర్వాత లాక్డౌన్, కార్మికుల వలసల నేపథ్యంలో రెండో త్రైమాసికంలో అత్యంత కనిష్ఠ స్థాయి (22 పాయింట్లు)కి చేరింది.
- మూడో త్రైమాసికానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది. అనేక సంస్థలు వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించడంతోపాటు నివాస గృహాలు, ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో క్యూ3లో కరెంట్ సెంటిమెంట్ స్కోర్ 40 పాయింట్లకు చేరింది.
- ఇక ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 41 పాయింట్ల నుంచి 52 పాయింట్లకు చేరి, నిరాశలో ఉన్న ఇన్వెస్టర్లకు ఎంతో ఊరట కలిగించింది.
కలిసొచ్చిన అంశాలివే..
- ఆర్బీఐ ఇచ్చిన లిక్విడిటీ సపోర్ట్‌తోపాటు లోన్ మారటోరియం కూడా రియల్ రంగానికి కలిసొచ్చింది.
- స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి నగరాలకు చేరుకోవడంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి.
- ఇండ్ల ధరలు దిగిరావడంతోపాటు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది.
- పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గృహ నిర్మాణరంగం మెరుగైన వృద్ధి సాధించడంతోపాటు ఇండ్ల అమ్మకాలు కూడా రెట్టింపయ్యాయి.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రియల్ రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మంత్రి కేటీఆర్ క్రెడాయ్, ట్రెడాయ్, టీడీఏ లాంటి సంస్థల ప్రతినిధులతో చర్చించి, నిర్మాణరంగాన్ని ప్రోత్సహించేందుకు పలు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు.
- అరవింద్‌కుమార్,
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్
అమ్మకాలు పెరిగాయి
హైదరాబాద్‌లో మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు వ్యాపారవర్గాలకు కలిసివస్తున్నాయి. ఐటీ రంగంతోపాటు పారిశ్రామిక వృద్ధిపై సర్కారు దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్మాణరంగ అభివృద్ధికి ఎప్పటికప్పుడు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నది. లాక్డౌన్ సడలింపులు వచ్చాక, ఇండ్ల కొనుగోళ్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ గణనీయంగా అభివృద్ధి సాధించనుంది.
- వీ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, క్రెడాయ్
సాధారణ స్థితికి రియల్‌రంగం..
రియల్ ఎస్టేట్‌రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. గత ఫిబ్రవరి ప్రాజెక్టులతో పోలిస్తే, ప్రస్తుతం 70 శాతం మేర నిర్మాణాలు ఊపందుకున్నాయి. వలస వెళ్లిన కార్మికులు పూర్తి స్థాయిలో తిరిగి వస్తే, నిర్మాణాల జోరు మరింత పెరుగుతుంది. కమర్షియల్ స్పేస్ అమ్మకాలు కూడా మున్ముందు పుంజుకోనున్నాయి.
- జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్
ఎక్కడా లేనివిధంగా ప్రోత్సాహం..
తెలంగాణ ప్రభుత్వం రియల్ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అండగా నిలబడింది. ప్రభుత్వ అనుకూల నిర్ణయాలు, కొత్త ప్రాజెక్టులకు కలిసొచ్చాయి. హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచుతూ, సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు భారీగా తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి.
- జైపాల్‌రెడ్డి, ఫాల్గుణ ఆర్కిటెక్ట్
తాజావార్తలు
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
- రూ.15 వేల కోసం ప్రాణం తీశారు
- వెలుగులు పంచుతున్న గుట్టలు