శుక్రవారం 30 అక్టోబర్ 2020
Realestate - Oct 10, 2020 , 00:11:54

సొంతిల్లే సౌకర్యం

సొంతిల్లే సౌకర్యం

‘సొంతిల్లు’.. ప్రతి ఒక్కరి కల. ఎంత కష్టమైనా సరే సొంతంగా ఓ ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతుంటారు. ఆర్థికంగానూ, సామాజికంగా భద్రత కూడా పెరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో నివసించే ఉద్యోగులు 30 ఏండ్లలోపే సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెబుతున్నారు. 

సొంతిల్లు అనేది కన్న బిడ్డలాంటిది. అందుకోసం అప్పులు చేసైనా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనైనా తమ కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఇంటి కోసం అప్పులు చేయడానికి ఆలోచిస్తారు. ఆ డబ్బులను ఏదో ఒకదాంట్లో పెట్టుబడి పెట్టి, లాభాలు పొందాలని ఆలోచిస్తారు. మరి, అప్పులు చేసి సొంత ఇల్లును కొనుగోలు చేయడం మంచిదా..? అద్దె ఇంట్లోనే ఉంటూ, ఆ డబ్బులను పెట్టుబడిగా మార్చుకోవడం మంచిదా..? అనే ప్రశ్నలు అనేక మందిలో తలెత్తుతాయి. ఈ విషయంలో..  సొంతగా ఇల్లు కొనుగోలు చేయడంలో ఉండే అనుకూలతలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా అద్దె ఇంట్లో ఉండే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు. అంతిమంగా సొంతిల్లు దీర్ఘకాలంలో ఖరీదైన  ఆస్తిగా మంచి విలువను సంపాదించుకోవడం  ఖాయమని అంటున్నారు. 

ఒడుదొడుకులు ఎదురైనా.. 

 ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే సమయంలో అనేక అంశాలను బేరీజువేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సగటు వ్యక్తి తన జీవితంలో అత్యధిక మొత్తం ఖర్చు చేసే సందర్భం ఇదే. అదేవిధంగా ఖరీదైన ఇల్లు కొనుగోలులో అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. సదరు వ్యక్తి ఆదాయం, ఈఎంఐ చెల్లింపు సామర్థ్యం, కొనుగోలు చేసే నగరం/పట్టణం, ఉండేందుకా? అద్దెకు ఇవ్వడానికా?.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకొని, ఇంటిని కోనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సదరు వ్యక్తికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకొని సొంతిల్లు కొనుగోలు చేయాలన్నా మొదటగా ఎంతోకొంత డౌన్‌ పేమెంట్‌ కింద కట్టాల్సిందే. దీంతో అప్పటిదాకా కూడబెట్టిన మొత్తాన్నీ ఒకేసారి కోల్పోయిన భావన కలుగుతుంది. అద్దెతో పోలిస్తే, బ్యాంకు లోన్‌ ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆర్థికంగా కాస్త ఇబ్బంది కలగవచ్చు. అయితే, ఈఎంఐ పూర్తయిన తర్వాత, ఎక్కడలేని ఆర్థిక భరోసా కలుగుతుంది. ఆ పదీ  పదిహేనేండ్లలో ఆ ఇంటి విలువా, ఫ్లాట్‌ విలువా ఎన్నోరెట్లు పెరిగి ఉంటుంది. ‘ఇప్పుడైతే కొనగలమా?’ అనిపిస్తుంది. నిజమే, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల విషయంలో ఒక ఏడాది ఆలస్యం చేసినా... ఎంతోకొంత నష్టపోయినట్టే! 


జాగ్రత్తలు పాటించాలి

కొవిడ్‌ కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అనేక ఒడుదొడుకులకు లోనైంది. లాక్‌డౌన్‌ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు తగ్గినప్పటికీ, హైదరాబాద్‌లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. ఇంకా ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూడటం మంచిదికాదు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్నది కొనాలా..? ‘రెడీ టు మూవ్‌' బెటరా..? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే, నిర్మాణంలో ఉన్న ఇండ్లు తక్కువ ధరకే లభిస్తాయి. కానీ, ఇందులో కొంచెం రిస్క్‌ ఉంటుంది. సమయానికి నిర్మాణం పూర్తికాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి అద్దెను చెల్లించడంతోపాటు కొత్త ఇంటికి ఈఎంఐలు కూడా కట్టాల్సి వస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. కాబట్టి కొనుగోలు సమయంలో బిల్డర్‌ గత చరిత్రను పరిశీలించాలి. అవసరమైతే నిపుణుల సలహా కూడా తీసుకోవాలి. అగ్రిమెంట్‌లో నిబంధనలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.