మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Realestate - Sep 12, 2020 , 00:34:17

క్రమబద్ధీకరణకు వేళాయె!

క్రమబద్ధీకరణకు వేళాయె!

 • వరంలా ‘ఎల్‌ఆర్‌ఎస్‌' పథకం
 •  ప్లాట్ల యజమానుల్లో హర్షం

అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కారు సదవకాశం కల్పించింది. జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రకటించింది. ఈ యేడాది ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ అయిన అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం జీవో నెంబర్‌ 151 విడుదల చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 15ను ఆఖరు తేదీగా నిర్ణయించింది. దీంతో అనుమతి లేని లేఅవుట్ల నిర్వాహకులు, అందులో ప్లాట్లు కొన్న వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్‌) సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ముందుకొస్తున్నారు. అయితే వినియోగదారులను పలు సందేహాలు వెంటాడుతున్నాయి. తాము కొనుగోలు చేసిన ప్లాటు క్రమబద్ధీకరణకు అర్హత సాధిస్తుందా? ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా చేయాలి? ఏయే డాక్యుమెంట్లను సమర్పించాలి? ఫీజు ఎంత? క్రెడిట్‌ కార్డులు లేకుంటే ఏం చేయాలి? ఫీజు కట్టాక ఎన్ని రోజుల్లోగా రెగ్యులరైజ్‌ చేస్తారు? గతంలో ఈ పథకం కింద కట్టిన ఫీజు సంగతేంటీ? క్రమబద్ధీకరణ గడువు ఇంకా పెంచుతారా? తమ స్థలాలు, ఇండ్లను క్రమబద్ధీకరించుకోకపోతే ఏమవుతుంది? ఇలా పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన సందేహాలతోపాటు సలహాలు.. మీకోసం!

ఇదో మంచి అవకాశం

అనధికారిక లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవడం వల్ల అధికారుల నుంచి భవన నిర్మాణాలకు అనుమతి పొందవచ్చు. ప్లాట్ల యజమానులందరూ అవసరమైన రుసుము చెల్లించడం ద్వారా రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలలాంటి పౌర సౌకర్యాలను సమకూర్చుకోవచ్చు. అనధికారిక లే అవుట్‌ ప్రదేశాలు కూడా ప్రణాళికాబద్ధమైన పట్టణ/నగరాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయి. ఒకవేళ అనధికార ప్లాట్లను క్రమబద్ధీకరించుకోకుంటే భవన నిర్మాణాల కోసం అధికారులు అనుమతులు ఇవ్వరు. చట్టప్రకారం అసాధారణ జరిమానాలు విధించే అవకాశమున్నది. నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సౌకర్యాలు రావు. సదరు ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర లావాదేవీలు ఆగిపోతాయి. 

ఇవి నిషేధం 

చెరువులు, కుంటలు, నది/నాలా, ఎఫ్‌టీఎల్‌ చెరువులు, శిఖం భూములు, 111జీవో పరిధిలోని భూములు, మాస్టర్‌ప్లాన్‌లో పరిశ్రమలకు కేటాయించిన భూములు, రీక్రియేషనల్‌ జోన్‌లో ఉండే చెరువులు, కుంటలు, ఓపెన్‌స్పేస్‌ వంటి భూములను క్రమబద్ధీకరించరు. వీటితో పాటు విమానాశ్రయాలు, రక్షణశాఖ భూములకు 500 మీటర్ల లోపు ప్రాంతాలు. వివాదాస్పదంలో ఉన్న భూములు, కోర్టు పరిధిలో ఉన్న స్థలాలు. ప్రభుత్వ భూములు, సీలింగ్‌ భూములు, అసైన్డ్‌, వక్ఫ్‌/దేవాదాయ శిఖం భూములకు ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం వర్తించదు. 

ఛార్జీలు ఇలా 

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు భూమి విలువ ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తారు. 26.8.2020 నాటికి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకారం చదరపు గజానికి గల విలువను బట్టి ఛార్జీలు ఉంటాయి. ఆదే విధంగా స్థల విస్తీర్ణం ఆధారంగానూ ఛార్జీలు విధిస్తారు. నిర్ణయించిన ఛార్జీలను మూడు నెలల్లోగా లేదా 31 జనవరి 2021 నాటికి కట్టాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు ఇలా

వ్యక్తిగత ప్లాటు క్రమబద్ధీకరణ కోసం రూ.వెయ్యి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. 

డెవలపర్లు అయితే లేఅవుట్‌ క్రమబద్ధీకరణ కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.10వేలు చెల్లించాలి. 

ఆన్‌లైన్‌లో సులభతరంగా

ఆన్‌లైన్‌లోగానీ మీ సేవా కేంద్రాల్లోగానీ ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్‌లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ రూపొందించారు. ప్లేస్టోర్‌ నుంచిగానీ క్రోమ్‌ నుంచిగానీ ‘ఎల్‌ఆర్‌ఎస్‌-2020’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా

 • పురపాలకశాఖ వెబ్‌సైట్‌ http://lrs.telangana. gov.in ను సంప్రదించాలి.
 • వెబ్‌సైట్‌లో పైభాగాన కుడివైపున (సీఎం కేసీఆర్‌ ఫొటో కింద) Apply for LRS 2020  అని ఉన్న చోట క్లిక్‌ చేయాలి. 
 • స్క్రీన్‌పై ‘మొబైల్‌ నెంబర్‌' అని వస్తుంది. అందులో దరఖాస్తుదారుడి ఫోన్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. 
 • సంబంధిత ఫోన్‌కు ఐదు అంకెలు గల ‘ఓటీపీ’ నెంబరు వస్తుంది. దానిని ‘ఓటీపీ’ ఉన్న బాక్సులో ఎంటర్‌ చేసి, దిగువన ఉన్న ‘వాలిడేట్‌ ఓటీపీ’పై క్లిక్‌ చేయాలి. వెంటనే దరఖాస్తు నమూనా వస్తుంది.
 • ఒకవేళ ‘ఓటీపీ’ రానట్లయితే ‘రీసెండ్‌ ఓటీపీ’పై క్లిక్‌ చేయాలి. 
 • ఆ తర్వాత ‘బ్యాక్‌' బటన్‌పై క్లిక్‌ చేస్తే ఎంట్రీ ఫారం వస్తుంది. 
 • ఫారంలో ముందుగా క్రమబద్ధీకరణ అనేది ‘వ్యక్తిగత ప్లాటు లేదా లేఅవుట్‌' అని అడుగుతుంది. ఏదైతే దానిపై టిక్‌ చేయాలి.
 • ప్లాటుగానీ లేఅవుట్‌గానీ దేని పరిధిలోకి వస్తుంది? అని ఉన్న చోట ‘సెలక్ట్‌'పై క్లిక్‌ చేయాలి. అక్కడ ‘కార్పొరేషన్‌/మున్సిపాలిటీ/గ్రామపంచాయతీ’ అని ఉంటాయి. మీ ప్లాటు/లే అవుట్‌ దేని పరిధిలోకి వస్తే దానిని ఎంచుకోవాలి. 
 • వెంటనే దిగువన మరో బాక్సు వస్తుంది. కార్పొరేషన్‌ ఎంచుకుంటే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల పేర్లు ఉంటాయి. వాటిలో మీకు సంబంధించిన కార్పొరేషన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత జోన్‌, సర్కిల్‌, వార్డును సెలక్ట్‌ చేయాలి. 
 • మున్సిపాలిటీ అయితే దిగువన బాక్సులో అన్ని మున్సిపాలిటీల పేర్లు వస్తాయి. మున్సిపాలిటీని ఎంచుకున్న వెంటనే దిగువన ‘వార్డు’ అని వస్తుంది. దానిని కూడా ఎంపిక చేసుకోవాలి. 
 • ఇక గ్రామపంచాయతీ అయితే మొదటగా జిల్లా, తర్వాత మండలాన్ని ఎంపిక చేయాలి. ఆ తర్వాత గ్రామపంచాయతీని సెలెక్ట్‌ చేసుకోవాలి. 
 • దీని తర్వాత ప్లాటు వివరాలను సమర్పించాలి. ప్లాటు ఎక్కడ (లొకాలిటీ) ఉందో దాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ప్లాటు నెంబరు, సర్వే నెంబరు, ప్లాటు విస్తీర్ణం (చదరపు గజాల్లో) ఎంటర్‌ చేయాలి. ప్రస్తుతం ప్లాటు ముందు ఎన్ని ఫీట్ల రోడ్డు ఉందనేది కూడా నమోదు చేయాలి. ప్లాటుకు సంబంధించిన సేల్‌ డీడ్‌ (విక్రయ దస్తావేజు) నెంబరు, సంవత్సరం తెలియజేయాలి. దిగువన ఏ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించారో దాన్ని ఎంపిక చేసుకోవాలి. 
 • స్కానింగ్‌ కాపీలు అప్‌లోడ్‌ చేయాలి. ముందుగానే సేల్‌ డీడ్‌ (విక్రయ దస్తావేజు) ముందు పేజీ, లేఅవుట్‌ కాపీ, ఒక లింకు డాక్యుమెంట్‌ ముందు పేజీని స్కానింగ్‌ చేసి పీడీఎఫ్‌ రూపంలో సిద్ధంగా ఉంచుకోవాలి. వివరాలు నింపిన తర్వాత దిగువన సేల్‌ డీడ్‌ ముందు పేజీ, లేఅవుట్‌, అదర్‌ డాక్యుమెంట్‌ టైప్‌ అనే కాలమ్‌ల ముందు ఉన్న ‘అప్‌లోడ్‌' బటన్‌పై క్లిక్‌ చేసి, సిద్ధంగా ఉంచుకున్న పీడీఎఫ్‌ ఫైల్‌ను అటాచ్‌ చేయాలి. 
 • దరఖాస్తుదారుడి వివరాలు పూరించాలి. పేరు, తండ్రి, భర్త పేరు, ఆధార్‌ కార్డు నెంబరు, జెండర్‌, ఇంటి నెంబరు, కాలనీ, గ్రామము, జిల్లా, పిన్‌కోడ్‌ నెంబరు, ఈ-మెయిల్‌ ఐడీతోపాటు ముందుగా నమోదు చేసిన ఫోన్‌ నెంబరు కాకుండా మరో ఫోన్‌నెంబరును సూచించాలి. ఆతర్వాత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 

క్రమబద్ధీకరణ ఛార్జీలు

క్రమబద్ధీకరణ ఛార్జీలను ఎలా లెక్కిస్తారనేదానిపై ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొన్నది. ఇందుకుగాను ప్రభుత్వం జారీ చేసిన జీవో 131లో క్రమబద్ధీకరణ, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలను ప్లాటు విస్తీర్ణం, మార్కెట్‌ విలువ ఆధారంగా ఎలా లెక్కించాలనే విషయంపై పలు మార్గదర్శకాలు ఇచ్చింది.

 • అక్రమ లేఅవుట్‌లోని పూర్తి విస్తీర్ణంలో పది శాతం మేర ఖాళీ ప్రదేశం (ఓపెన్‌ స్పేస్‌) లేనట్లయితే ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీల కింద 26.8.2020 నాటికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ రికార్డుల్లో ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగా ప్లాటు విలువలో 14 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 
 • ఉదాహరణకు 200 చదరపు గజాలున్న ప్లాటు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ రికార్డుల ప్రకారం చదరపు గజానికి రూ.3వేల మార్కెట్‌ విలువ ఉన్నట్లయితే, ఛార్జీలను ఇలా లెక్కిస్తారు. 
 • ప్లాటు విస్తీర్ణం 200 చదరపు గజాలు అంటే 167 చదరపు మీటర్లు. 
 • జీవో ప్రకారం, 100-300 చదరపు మీటర్ల వరకు రూ.400 చొప్పున ఛార్జీలను లెక్కిస్తారు. 167x400= రూ.66,800
 • మార్కెట్‌ విలువ రూ.3వేలుగా ఉన్నందున, జీవో ప్రకారం రూ.3వేల వరకు 25 శాతం స్లాబులోకి వస్తుంది. 
 • ఈ క్రమంలో రూ.66,800 మొత్తంలో 25 శాతం అంటే రూ.16,700 క్రమబద్ధీకరణ ఛార్జీగా నిర్ధారిస్తారు. 
 • దీంతోపాటు లేఅవుట్‌ మొత్తం విస్తీర్ణంలో పది శాతం ఓపెన్‌ స్పేస్‌ లేనట్లయితే ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ప్లాటు విలువ ఆధారంగా లెక్కిస్తారు.
 • 200 చదరపు గజాల ప్లాటు, మార్కెట్‌ విలువ చదరపు గజానికి రూ.3వేలు అయినందున ప్లాటు విలువ రూ.6,00,000. 
 • ప్లాటు విలువలో 14శాతం అంటే రూ.84,000 ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలుగా నిర్ధారిస్తారు. 
 • ఇలా క్రమబద్ధీకరణ, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు కలిపితే (16,700+84,000) రూ.1,00,700 చెల్లించాల్సి ఉంటుంది. 
 • ఒకవేళ లేఅవుట్‌లో పది శాతం ఖాళీ స్థలం (పార్కులు) ఉన్నట్లయితే, 14శాతం ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.16,700 క్రమబద్ధీకరణ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. 
 • ప్లాటు విస్తీర్ణం 300-500 చదరపు మీటర్లకు మించి ఉంటే క్రమబద్ధీకరణ ఛార్జీలను రూ.600గా లెక్కిస్తారు. 500 చదరపు మీటర్లు (597 చదరపు గజాలు)కు మించి ఉన్నట్లయితే రూ.750 చొప్పున లెక్కిస్తారు. 
 • మార్కెట్‌ విలువ రూ.3వేల వరకు క్రమబద్ధీకరణ ఛార్జీల్లో 25 శాతాన్ని తీసుకుంటారు. చదరపు గజం ధర రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటే 50 శాతం, రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఉంటే 75 శాతం, రూ.పదివేలకు మించి ఉంటే వంద శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
 • అదేవిధంగా 150 గజాల ప్లాటు, మార్కెట్‌ విలువ రూ.6వేలు ఉందనుకుంటే..
 • 150 చదరపు గజాలంటే,125 చదరపు మీటర్లు. 125x400=రూ.50,000
 • మార్కెట్‌ విలువ రూ.6వేలు ఉన్నందున, 75 శాతాన్ని ప్రామాణికంగా తీసుకొని క్రమబద్ధీకరణ ఛార్జీలను రూ.37,500గా నిర్ధారిస్తారు. 
 • ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు.. 150 చదరపు గజాలు, రూ.6వేల మార్కెట్‌ విలువ అయినందున, ప్లాటు విలువ (150x6000) రూ.9,00,000.
 • ప్లాటు విలువలో 14శాతం అంటే రూ.1,26,000 ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలుగా నిర్ధారిస్తారు.
 • రెండూ కలిపితే.. రూ.1,63,500. ఒకవేళ పది శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉన్నట్లయితే రూ.37,500 చెల్లిస్తే సరిపోతుంది. 

మూడు నెలల గడువు

దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రమబద్ధీకరణ, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలను లెక్కించి సంబంధిత అధికారులే దరఖాస్తుదారుడికి లిఖితపూర్వకంగా సమాచారం ఇస్తారు. ఈ మొత్తాన్ని 31.01.2021లోపు చెల్లించాల్సి ఉంటుంది. 

క్రమబద్ధీకరించేవి ఇవే..

 • రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 26.8.2020 కంటే ముందు రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతిస్తారు. అదేవిధంగా అక్రమ లేఅవుట్లలో కనీసంగా పది శాతం ప్లాట్లు 26.8.2020 కంటే ముందుగానే విక్రయించి ఉన్నట్లయితే ఆ లేఅవుట్‌ మొత్తాన్నీ క్రమబద్ధీకరిస్తారు. 
 • 10 హెక్టార్లకు మించిన లేఅవుట్లు అయితే, నదులు, సరస్సులు, కుంటల సరిహద్దులకు 30 మీటర్ల దూరంలో ఉండాలి. 
 • 10 హెక్టార్లలోపు ఉన్న లేఅవుట్లు అయితే, నదులు, సరస్సులు, కుంటల సరిహద్దులకు 9 మీటర్ల దూరంలో ఉండాలి. 

క్రమబద్ధీకరణకు కావాల్సిన పత్రాలు..

 • రిజిస్టర్‌ దస్తావేజు, తేదీ 26 ఆగస్టు 2020  కంటే ముందుగా జరిగిన సేల్‌ డీడ్‌ (విక్రయ దస్తావేజు) ముందు పేజీ. 
 • ప్లాటు ఉన్న లేఅవుట్‌ కాపీ.
 • పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద జారీ అయిన ధ్రువీకరణ పత్రం (యూఎల్‌సీ)(అర్హుదారు సర్వే నెంబరు యూఎల్‌సీ పరిధిలో ఉన్నట్లయితేనే)
 • ఒకవేళ సదరు ప్లాటు రక్షణ శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎయిర్‌పేనల్‌ జోన్‌కు 500 మీటర్ల దూరంలోపే ఉన్నట్లయితే, ఆయా శాఖల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం. 
 • 26 ఆగస్టు 2020 నాటి మార్కెట్‌ విలువకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం. (సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి పొందినది). వీటిని స్కాన్‌ చేసి, 1 ఎంబీలోపు సామర్థ్యం ఉండేలా పీడీఎఫ్‌ ఫైల్‌గా రూపొందించాలి. 

క్రమబద్ధీకరణ ఛార్జీలు (భూమి విలువ ప్రాతిపదికన)

26.8.2020నాటి మార్కెట్‌ విలువ క్రమబద్ధీకరణ ఛార్జీలు

(సబ్‌ రిజిస్ట్రార్‌ రికార్డులో (ఛార్జీల శాతం) చదరపు గజానికి ఉన్న రేటును బట్టి)

0-రూ.3000 - 25 శాతం

రూ.3001-రూ.5000 - 50 శాతం

రూ.5001-రూ.10,000 -  75 శాతం

రూ.పదివేలకు మించినట్లయితే  - 100 శాతం

ప్రాథమిక క్రమబద్ధీకరణ ఛార్జీలు ఇలా..

 ప్లాటు విస్తీర్ణం ఛార్జీలు

 (చదరపు మీటర్లు) (చ.మీ.)

0-100  -  రూ.200

101-300   -  రూ.400

301-500 - రూ.600

500కు మంచినట్లయితే రూ.750

మురికి వాడలు అయితే రూ.5 


logo