బుధవారం 30 సెప్టెంబర్ 2020
Realestate - Sep 05, 2020 , 03:44:27

పొందికైన పూజగది

పొందికైన పూజగది

మన దేశంలో దాదాపు ప్రతి ఇంటిలోనూ పూజా మందిరం తప్పక ఉంటుంది. కులమేదైనా, మతమేదైనా సరే ప్రతి ఒక్కరూ ఈ పూజా ప్రాంగణంలో ప్రశాంతత పొందుతారు. చిన్నదైనా, పెద్దదైనా పూజా మందిరం అలంకరణ కూడా ప్రధానమే. మరి ఆ గదిని ఎలా డిజైన్‌ చేసుకోవాలో చూడండి.. 

  • పూజగదిని గజిబిజిగా ఉంచొద్దు. అంటే.. ఎక్కువ ఫొటోలతో నింపేయొద్దు. కొన్ని పూజ గదిలో ఉంచుకొని, ఇంట్లోనే అక్కడక్కడా మిగతా దేవుడి ఫొటోలను ఉంచాలి. ఇంకో విషయం.. పూజకి సంబంధించిన ఐటమ్స్‌ మాత్రమే ఆ గదిలో ఉంచాలి. 
  • పూజగదిలో మెటల్‌ యాక్సెసెరీస్‌ ఉంచొచ్చు. అదేనండీ.. గంటలు, అలంకరణకు వాడే దీపాలు, ఇతర లోహ ఉపకరణాలు ఉంచొచ్చు. అలా అని ఆ గదిని మొత్తం వాటితోనే నింపేయొద్దు. చిన్న చిన్న మెటాలిక్‌ పెయింట్స్‌ వేస్తే పూజగది మరింత అందంగా కనిపిస్తుంది. 
  • పాలరాయి పూజగదిని విలాసవంతంగా చూపిస్తుంది. తెల్లని పాలరాయి పూజగదికి అనువైనది. చిన్న గది ఉన్నప్పుడు పాలరాయితోనే షెల్ఫ్‌ల మాదిరిగా పూజా మందిరాన్ని డిజైన్‌ చేసుకోవచ్చు. 
  • కర్రతో కూడా పూజగదులను నిర్మించుకోవచ్చు. చిన్నపాటి గది నిర్మాణం చేసి, దానికి పెట్టే తలుపులకు పాత దేవాలయాల మాదిరి డోర్‌లను బిగించాలి. చిన్న చిన్న క్యాబినెట్‌లతో ఉన్న పూజా మందిరాలు చూడచక్కగా ఉంటాయి. అంతేకాదు.. రెడీమేడ్‌గా కూడా ఈ చెక్క మందిరాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. డిజైన్‌ సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. 
  • ఈ మధ్య పూజగది మొత్తం గాజుతో నిర్మించడం ఫ్యాషన్‌ అయిపోయింది. ఈ గాజు మీద దేవుడి బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. లోపల వైపు మాత్రం పాలరాయిని వాడుతున్నారు. కేవలం ట్రాన్స్‌పరెంట్‌ అద్దాలనేకాకుండా రంగురంగుల అద్దాలతో కూడా పూజామందిరాన్ని డిజైన్‌ చేయొచ్చు. 
  • కొరియన్‌ బ్యాక్‌లిట్‌ ప్యానెల్స్‌ని పూజ గదిలో పెట్టవచ్చు. పవిత్ర చిహ్నాలు, శ్లోకాలు, దేవతల బొమ్మలను గోడల మీద చిత్రించడం బాగుంటుంది. అలాగే పూజగదిలో లైటింగ్‌ కూడా ముఖ్యమే. కానీ, ఫోకస్‌ లైట్లు, స్పాట్‌లైట్లను పెట్టకూడదు. 
  • లైటింగ్‌ విషయానికి వస్తే విగ్రహాలు.. దేవుడి పటాల మీద వెలుతురు పడేలా ఉండాలి. అప్పుడే ప్రశాంత వాతావరణం ఉంటుంది. 
  • అన్నింటికంటే ముఖ్యం.. పూజగది గది వైశాల్యాన్ని బట్టే అందులో దేవుళ్ల ప్రతిమలు ఉంచాలి. అవి కూడా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. 


logo