బుధవారం 30 సెప్టెంబర్ 2020
Realestate - Sep 05, 2020 , 03:44:27

పూలతో పునరుత్తేజం!

పూలతో పునరుత్తేజం!

పూలతోటలో కాసేపు గడిపితే చాలు.. టెన్షన్లన్నీ ఇట్టే మాయమవుతాయి. అవే పూలు నట్టింట్లో విరబూస్తే.. చూసేందుకు అందంగా కనిపించడంతోపాటు మనసుకు ఆనందాన్ని, నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి.ఇంట్లో తాజా పుష్పాలను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు నిరాశ, ఆందోళన తగ్గుతుందనీ, స్నేహితులు, కుటుంబసభ్యులతో భావోద్వేగ సంబంధం పెరుగుతుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇంట్లోనూ ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయనీ, శ్రద్ధగా పని చేసేందుకు ఎక్కువ శక్తిని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని వెల్లడైంది.

అందమైన వికసించిన పూల మధ్యలో ఉన్నవారికి చాలా గొప్ప భావన కలుగుతుంది. చిన్నతనంలో గడిపిన సంతోషకరమైన రోజులను గుర్తు చేస్తుంది. గులాబీ పూలు.. మీ పెళ్లి రోజుకు తిరిగి మిమ్మల్ని తీసుకెళ్తాయి. ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే పూలు.. మీలోని శక్తిని రెట్టింపు చేస్తాయి. తెలుపు రంగులో ఉండేవి కంటికి మాత్రమే కాదు, ఇంద్రియాలకు కూడా ఓదార్పునిస్తాయి. పడకగదిలోని నైట్‌స్టాండ్‌లో తాజా పువ్వులను ఉంచడం వల్ల.. ఉదయం లేవగానే సరికొత్త అనుభూతి కలుగుతుంది.కిచెన్‌ టేబుల్‌ మీద రంగురంగుల పుష్పాలను ఉంచండి. అవి వంటగదిని ప్రకాశవంతం చేయడమే కాకుండా, గది మొత్తం పరిశుభ్రంగా కనిపించేలా చేస్తాయి. ఇంట్లో అక్కడక్కడా తాజా పువ్వులు ఉంచండి. అవి మీ ఇంటి అలంకరణలో భాగమవుతాయి. అందంగా కనిపించడంతోపాటు గదిలోని వాతావరణాన్ని తాజాగా, శక్తిమంతంగా మారుస్తాయి. 


logo