బుధవారం 05 ఆగస్టు 2020
Realestate - Jul 31, 2020 , 23:56:21

బీమ్‌లతోనే బ్యాలెన్సింగ్‌..

బీమ్‌లతోనే బ్యాలెన్సింగ్‌..

ఏదైనా అందమైన భవనాన్ని చూడగానే దాని ఆకృతి, నిర్మాణ శైలి గురించే ఆలోచిస్తాం. కానీ, ఆ కట్టడం అలా నిలబడటానికి కారణమైన బీమ్‌లు, పిల్లర్ల ప్రస్తావనే రానివ్వం. భవన నిర్మాణంలో బీమ్‌లు, పిల్లర్ల పాత్ర ఎంతో కీలకం. ఇంటి పునాది మొదలు చివరి అంతస్థు దాకా ఇవి అనుసంధానమై ఉంటాయి. వీటివల్లే భవనం బ్యాలెన్సింగ్‌.. సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణాలు సాధ్యమవుతాయి. స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ సూచనలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసినప్పుడే, భవనాలు పది కాలాలపాటు పదిలంగా ఉంటాయి.

పిల్లర్లు.. బీమ్‌లే భవనాలకు అస్థిపంజరం. మానవ శరీరంలో అనేక రకాల ఎముకలు ఉన్నట్లే, భవన నిర్మాణాల్లోనూ పలు రకాల బీమ్‌లను  నిర్మించాల్సి ఉంటుంది. బేస్‌మెంట్‌ మొదలుకొని శ్లాబ్‌ వరకూ .. ఈ బీమ్‌లు, ఇంటి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తాయి. 

ఇంటి నిర్మాణంలో కీలకం

ఒక మనిషి బలంగా నిలబడాలంటే, అస్థిపంజరమే ఆధారం. ఇందులోని అనేక ఎముకలు, మనిషిని దృఢంగా ఉండేలా చేస్తాయి. భవనాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక నిర్మాణం అన్ని రకాల ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడాలంటే, దాని అస్థిపంజరం కూడా దృఢంగా ఉండాల్సిందే. పిల్లర్లు.. బీమ్‌లే భవనాలకు అస్థిపంజరం. మానవ శరీరంలో వివిధ రకాల ఎముకలు ఉన్నట్లే, భవన నిర్మాణాల్లోనూ పలు రకాల బీమ్‌లను నిర్మించాల్సి ఉంటుంది. బేస్‌మెంట్‌ మొదలుకొని శ్లాబ్‌ వరకూ వేసే ఈ బీమ్‌లు, ఇంటి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తాయి. 

బేస్‌మెంట్‌..

ఇంటికి ఫౌండేషన్‌ వేసిన తర్వాత ఒక కాలమ్‌కు మరో కాలమ్‌కు మధ్య ఉన్న ప్రాంతాన్ని బేస్‌మెంట్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పునాది లెవెల్‌లో కాలమ్స్‌ మధ్య తవ్వి, ఆరు అంగుళాల నుంచి ఒక అడుగు దాకా ఇసుకను పోయాలి. అక్కడి నుంచి గ్రానైట్‌ రాళ్లతో 1:6 నిష్పత్తి (ఒక తట్ట సిమెంట్‌కు ఆరు తట్టల ఇసుక)ను కలిపి, మధ్యలో 40 ఎంఎం కంకరను జోడిస్తూ గ్రౌండ్‌ లెవెల్‌ వరకూ నిర్మించే రాతి కట్టడమే బేస్‌మెంట్‌. భూమిని తోడుకుంటూ వచ్చే పందికొక్కులు, ఎలుకలు ఇతరత్రా జంతువులు నిర్మాణం లోపలికి రాకుండా ఈ బేస్‌మెంట్‌ కాపాడుతుంది. 

ప్లింత్‌ బీమ్స్‌..

నిర్మాణానికి సంబంధించిన కాలమ్స్‌ అన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ నిర్మించే బీమ్స్‌నే ప్లింత్‌ బీమ్స్‌ అంటాం. నిర్మాణ విస్తీర్ణం, ఎత్తును బట్టి ఈ బీమ్స్‌ సైజును నిర్ధారించాల్సి ఉంటుంది. గదుల విస్తీర్ణాన్ని బట్టి బీమ్‌ పరిమాణం, స్టిరప్స్‌ (రింగ్స్‌) సంఖ్య పెరుగుతుంది. ప్లింత్‌ బీమ్‌ల నిర్మాణం కోసం ఒక తట్ట సిమెంట్‌కు రెండు తట్టల ఇసుక, నాలుగు తట్టల 20 ఎంఎం కంకర ఉపయోగించాల్సి ఉంటుంది. నిర్మాణ పరిధిలో ఎక్కడైనా లూజు మట్టి ఉన్నట్లయితే.. యూనిఫామ్‌ సెటిల్‌మెంట్‌ కోసం ప్లింత్‌ బీమ్‌లు అద్భుతంగా పనిచేస్తాయి.

పిల్లర్లు (కాలమ్స్‌)..

భవన విస్తీర్ణం, నిర్ధారించుకున్న ఎత్తు, మోసే బరువునుబట్టి కాలమ్స్‌ (పిల్లర్‌) పరిమాణం, అందులో ఉపయోగించే స్టీల్‌ సామర్థ్యాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. మామూలుగా 10 అడుగుల ఎత్తు వరకు పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. నిర్మాణ శైలినిబట్టి వీటి ఎత్తు కూడా పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. గాలి, వెలుతురు కోసం.. కొన్ని సందర్భాల్లో భవనం రిచ్‌గా కనిపించేందుకు వీలుగా.. కొందరు నిర్మాణం ఎత్తును పెంచుకుంటారు. ఆయా అంశాల్ని పరిగణనలోకి తీసుకుని పిల్లర్లను ఏర్పాటు చేసుకోవాలి. 

రూఫ్‌ బీమ్స్‌..

పిల్లర్లకు శ్లాబ్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసుకునేవే రూఫ్‌ బీమ్స్‌. స్లాబ్‌ బరువు, పై అంతస్థులో వచ్చే నిర్మాణాల అంతర్గత బరువును పరిగణలోకి తీసుకుని రూఫ్‌ బీమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. గదుల మధ్య దూరాన్నిబట్టి రూఫ్‌ బీమ్‌ పరిమాణం కూడా మారుతుంటుంది. దూరం పెరిగిన కొద్దీ స్టీల్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇక్కడ కూడా 1:2:4 నిష్పత్తిలో సిమెంట్‌, ఇసుక, కంకర (20 ఎంఎం)ను ఉపయోగిస్తారు.

లింటల్‌ బీమ్స్‌..

గోడల మధ్యలో ఏర్పాటు చేసే బీమ్స్‌ని లింటల్‌ బీమ్స్‌ అంటారు. తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు.. ఇతరత్రా ఖాళీ స్థలాల పైన మళ్లీ గోడ మొదలు పెట్టేందుకు వీలుగా లింటల్‌ బీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. గోడ పరిమాణాన్ని బట్టి లింటల్స్‌ ఏర్పాటు చేయాలి. వీటిని ఆధారం చేసుకునే ఇంటి బయటివైపు, లోపలి వైపు సజ్జలు (అటకలు) ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది. బాత్‌రూమ్‌ల పైన వేసుకునే లోరూఫ్‌ కోసం, బయట ఏర్పాటు చేసుకునే మెట్ల కోసం కూడా లింటల్‌ బీమ్స్‌ ఉపయోగపడుతాయి. 

కన్‌సీల్డ్‌ బీమ్స్‌..

భవన నిర్మాణాల్లో కీలక ఘట్టం శ్లాబ్‌ వేయడం. సాధారణంగా రూఫ్‌ బీమ్స్‌ పైన నాలుగున్నర అంగుళాల పరిమాణం మొదలుకొని ఎనిమిది అంగుళాల మందంతో శ్లాబ్‌ వేస్తుంటారు. భారీ నిర్మాణాలలో స్లాబ్‌ మందం ఎక్కువగా ఉంటుంది. శ్లాబ్‌ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పుడు శ్లాబ్‌లోనే బీమ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. వాటిని కన్‌సీల్డ్‌ బీమ్స్‌ అంటారు. 4 ఇంచుల సైజ్‌తో నిర్మాణ స్థితిని బట్టి.. అక్కడక్కడా కన్‌సీల్డ్‌ బీమ్‌లు ఏర్పాటు చేస్తుంటారు. ఆడిటోరియం లాంటి నిర్మాణాలు, శ్లాబ్‌ విస్తీర్ణం అధికంగా ఉండేచోట కన్‌సీల్డ్‌ బీమ్‌లు కీలకంగా పనిచేస్తాయి.


logo