గురువారం 13 ఆగస్టు 2020
Realestate - Jul 31, 2020 , 23:56:20

పుష్పించే రాళ్లు..

పుష్పించే రాళ్లు..

  • హంపీ విఠలేశ్వరాలయంలోని కొన్ని రాళ్లు, సప్త స్వరాలను పలికిస్తాయని విన్నాం. మరి అలాంటి కరుకు రాళ్లు.. పుష్పించడం ఎప్పుడైనా చూశారా?
  • ‘లిథాప్స్‌' మొక్కలను చూస్తే, అది నిజమని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే, రాళ్లలా కనిపించే ఈ మొక్కలు, అందమైన పూలను పూయిస్తాయి. ఇంటి అలంకరణలో ప్రత్యేకతను చాటుతాయి. 

ఒకప్పుడు ఇంటి అలంకరణ కోసం పూలజాతికి చెందిన గులాబీ.. చామంతిలాంటి మొక్కలను పెంచుకునేవారు. ఆ తర్వాత ముళ్లజాతికి చెందిన కాక్టస్‌ మొక్కలు వచ్చాయి. ఇప్పుడు రాళ్లజాతి మొక్కల హవా నడుస్తున్నది. వీటిలో ముఖ్యమైనవి ‘లిథాప్స్‌'. వీటిని సజీవరాళ్లు అని పిలుస్తారు.

లిథ్‌

(రాయి), ఆప్స్‌ (ముఖం) అనే రెండు గ్రీకు పదాల నుంచి ‘లిథాప్స్‌' ఉద్భవించింది. ఆఫ్రికా ఎడారిలో కనిపించే ఈ మొక్కలు, ఐజోసియే అనే ఐస్‌ ప్లాంట్‌ జాతికి చెందినవి. రాళ్లను పోలిన ఆకారంలో ఉండి.. అన్నింటికన్నా భిన్నంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంటి అలంకరణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి కేవలం రెండు (లేదా మూడు) మందపాటి ఆకులు మాత్రమే ఉంటాయి. అవి చూసేందుకు రాయిలా కనిపిస్తాయి. వీటి మధ్యలో రంగురంగుల పూలు పూస్తాయి. వీటిల్లోనూ ఆకులు, పూల రంగులనుబట్టి అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి లిథాప్స్‌ ఆకాంప్‌, లిథాప్స్‌ లెస్లీ, గ్రాస్టిలీడెలినీటా, లిథాప్స్‌ మిక్స్‌. 

అందంగా.. ఆకర్షణీయంగా..

మార్బుల్‌ లేదా సిరామిక్‌ కుండీల్లో రంగురంగుల గులకరాళ్ల మధ్య ‘లిథాప్స్‌' మొక్కల్ని పెంచితే, చూసేందుకు రెండు కండ్లూ చాలవు. ఇవి ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. ఎడారి జాతికి చెందిన ఈ మొక్కలు, చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే. ఇవి ఎడారి జాతి మొక్కలు కాబట్టి, నీరు ఎక్కువగా పోయాల్సిన అవసరం ఉండదు. వేసవిలో మాత్రం ఆకులు కొద్దిగా పొడిబారినట్లు అనిపిస్తే రోజుకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. నీళ్లు ఎక్కువగా పోస్తే, మొదళ్లు కుళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. 


logo