గురువారం 13 ఆగస్టు 2020
Realestate - Jul 31, 2020 , 23:56:18

నలుపు తెలుపు

నలుపు తెలుపు

ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టా.. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఏది చూసినా.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ట్రెండ్‌ నడుస్తున్నది.. ఇదే ట్రెండ్‌ని ఇంటికి కూడా వర్తింపజేస్తే.. అదిరిపోతుందంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్స్‌.. కాకపోతే దీనికి సరైన పద్ధతి అవలంబించాలని చెబుతున్నారు..

అదుర్స్‌!

ఇల్లు అందంగా కట్టుకోవాలని అందరూ అనుకుంటారు. దాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దుకున్నప్పుడే అందమైన పొదరిల్లుగా మారుతుంది. రంగులతో ఇంటికళనే మార్చవచ్చు. ఎన్నో రంగులు ఉన్నా.. నలుపు, తెలుపు కాంబినేషన్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ రెండింటి కాంబినేషన్‌తో ఇంటి అలంకరణ అద్భుతంగా ఉంటుంది. దానికి కొంత సృజనాత్మకతను జోడిస్తే సరిపోతుంది. 

క్లాసీ టచ్‌ 

బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌లో ఫర్నీచర్‌ చాలా బాగా సూటవుతుంది. పైగా క్లాసీగా కూడా ఉంటుంది. లెదర్‌ కోచ్‌ కొనాలనుకుంటే, అవి ఈ మధ్య నల్లని రంగులో లభ్యమవుతున్నాయి. ఐరన్‌ ఫర్నీచర్‌ అయితే, ఏకరీతిలో నల్లగా ఉంటాయి. పైగా పాడుకావు. ఇలాంటి ఫర్నీచర్‌కి ప్రాధాన్యమిస్తే ఇంటి అందం రెట్టింపు కావడమే కాకుండా, చాలా కాలం మన్నికగా ఉంటాయి. ఇక ఇంట్లో పెట్టే ఆర్ట్‌ల్లోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ థీమ్‌ ఉండేలా చూసుకోండి. ప్రస్తుత రోజుల్లో స్ట్రక్చర్‌ వాల్‌ పెయింట్స్‌ చాలా బాగుంటాయి. గోడలపై కళాత్మకత జోడిస్తే ఇంటి అందం రెట్టింపు అవుతుంది.

ఇలా ఓకే.. 

గోడలకు తెలుపు రంగు ఉండేలా చూసుకోండి. ఇతర అలంకరణలో నలుపు రంగును ఉపయోగించవచ్చు. ఒకవేళ నలుపు మరీ ఎక్కువ ఇష్టం అనుకుంటే.. తెల్లని గోడమీద చిన్నచిన్న వాల్‌ స్టిక్కర్స్‌ దొరుకుతాయి. వాటిని గది మొత్తం పరిచేయకుండా, ఒకే వాల్‌పై వచ్చేలా అతికించుకోండి. లేదా గోడ గడియారాల్లో పెద్ద పెద్దవి వస్తున్నాయి. తెల్లని గోడపైన ఆ నల్లని క్లాక్‌ పెట్టేయండి. లేకపోతే మీ ఫొటోలతో అందమైన ఫ్రేములను గోడలపై చేర్చండి. ఇలా మనసు ఉంటే చాలా మార్గాలు దొరుకుతాయి. 

శిల్పకళతో.. 

ఐరన్‌ లేదా రాతితో చేసిన శిల్పాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటికి నల్లని పెయింట్స్‌ వేసి గదిలో అక్కడక్కడా ఉంచొచ్చు. ఈ విగ్రహాలు గది అందాన్ని పెంచుతాయి. ఫర్నీచర్‌ని బ్లాక్‌ కలర్‌లో తీసుకోవచ్చు. చెస్‌బోర్డ్‌ పద్ధతిలో కూడా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే అన్ని గోడలకు కాకుండా.. టైల్స్‌ని ఇలాంటి పద్ధతిలో పేర్చుకోవచ్చు. బాత్‌రూమ్‌లో కూడా ఇలాంటి టైల్స్‌ ముచ్చటగా ఉంటాయి. బాత్‌ టబ్‌లను కూడా నలుపు రంగులో తీసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది.


logo