గురువారం 13 ఆగస్టు 2020
Realestate - Jul 25, 2020 , 00:11:16

‘మహా’ వెంచర్లు!

‘మహా’ వెంచర్లు!

 • లాభదాయకం.. భూ సమీకరణ పథకం 
 • ల్యాండ్‌పూలింగ్‌ స్కీంకు అనూహ్య స్పందన, రైతుల ఆసక్తి 
 • 60 శాతం రైతుల వాటా, 40 శాతం హెచ్‌ఎండీఏకు  
 • మూడు చోట్ల భారీ లే అవుట్లకు హెచ్‌ఎండీఏ శ్రీకారం  
 • 678 ఎకరాలకు నోటిఫికేషన్‌ జారీ 

మన మహానగరం నలుదిశలా విస్తరిస్తున్నది. హైదరాబాద్‌ రియాల్టీని మరింత పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సరికొత్త లే అవుట్లకు అంకురార్పణ చేస్తున్నది. నగరానికి తూర్పు వైపున ఉన్న భోగారం, దండు మల్కాపురం, లేమూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ సమీకరణ పథకం -2017లో భాగంగా 678 ఎకరాల్లో భారీ లే అవుట్లను చేసేందుకు తాజాగా హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లే అవుట్లు చేసే స్థలాలపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే, భూ సమీకరణ పథకం-2017 నిబంధనల్లోని భూ వాటాల విషయంలో నెలకొన్న సందిగ్ధతలకు తెరదించింది. ల్యాండ్‌పూలింగ్‌ స్కీం ప్రక్రియ కింద ఇప్పటి వరకు ఉన్న 50:50 శాతాన్ని.. 60:40 శాతంగా ఖరారు చేస్తూ ఇటీవల జీఓ నెంబర్‌ 83ని జారీ చేసింది. అభివృద్ధి చేసిన స్థలంలో 60 శాతం రైతుల వాటాగా, 40 శాతం హెచ్‌ఎండీఏ వాటాగా నిర్ణయించడంతో శివారులోని పలు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి -భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపురంలో, మేడ్చల్‌ -

మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని భోగారంలో, రంగారెడ్డి జిల్లాలోని లేమూరులో హెచ్‌ఎండీఏ భూసమీకరణ పథకంలో భాగంగా భూములిచ్చేందుకు రైతులు అంగీకరించారు. దీంతో అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. హెచ్‌ఎండీఏ ప్రకటించిన ఆయా సర్వే నంబర్లపై ఎలాంటి అభ్యంతరాలున్నా ముప్పై రోజుల్లో అధికారులకు తెలియజేయాలని సూచించారు. దండు మల్కాపురంలో ప్రస్తుతం టీఎస్‌ఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయగా, ఆ పార్కు సమీపంలోనే 355 ఎకరాలను భారీ లే అవుట్‌ చేయడానికి హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకుంటున్నది. డ్రాఫ్ట్‌ లే అవుట్‌ విడుదల చేయడానికి ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టే అవకాశాలున్నాయి.  

ప్రతిష్ఠాత్మకంగా.. 

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు అమల్లోకి వచ్చిన భూ సమీకరణ పథకం అతి త్వరలోనే మూడు చోట్ల కార్యరూపం దాల్చనున్నది. మరో రెండు చోట్ల స్థలాల పరిశీలన జరుగుతున్నది. ల్యాండ్‌పూలింగ్‌ స్కీంను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని, పథకం ఆమలు ప్రక్రియను వేగిరం చేయాలని మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు కీసర మండలం భోగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 54 నుంచి 84 వరకు 219 ఎకరాలు.. కందుకూరు మండలం లేమూరులో సర్వే నెంబర్‌ 482, 483, 485 నుంచి 488 వరకు, 494 నుంచి 496 వరకు సర్వే నెంబర్లలో 104 ఎకరాల 30 గుంటలు.. చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో 618 నుంచి 639 వరకు సర్వేనెంబర్‌లలో 355 ఎకరాల 18 గుంటల స్థలాలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద భూములు ఇచ్చే వారికి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని హెచ్‌ఎండీఏ పర్యవేక్షించనున్నది. ప్రధానంగా నాలా చార్జీలతో పాటు ల్యాండ్‌యూజ్‌ కన్వర్షన్‌ చార్జీలను హెచ్‌ఎండీఏ భరించనున్నది. భూములు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్‌ ఖర్చులను సైతం హెచ్‌ఎండీఏనే చెల్లించనున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్‌ చేయనున్నారు. ఆయా వెంచర్‌లలో ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీనివల్ల అమ్మకందారులకు, కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో భరోసా లభిస్తుంది. స్థిరాస్తుల పెట్టుబడులు శాశ్వత ప్రాతిపదికన భద్రత దక్కనున్నది.  

ఇవీ ప్రయోజనాలు.. 

 • ఈ పథకంలో రైతుల భూములకు.. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన భూములుగా బ్రాండ్‌ వ్యాల్యూ సమకూరుతుంది. ఇతర భూములతో పోలిస్తే అదనపు మార్కెట్‌ విలువ లభిస్తుంది. 
 • మంచినీరు, విద్యుత్‌, పార్కులు, సివరేజ్‌ లాంటి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కలిగిన హౌజింగ్‌ ప్లాట్లను రైతులు పొందుతారు. అవసరాల మేరకు వారు తమ ప్లాట్లను అభివృద్ధి చేసుకోవచ్చు లేదా అమ్ముకునే వీలు ఉంటుంది.
 • హెచ్‌ఎండీఏ నుంచి రైతులు అభివృద్ధి చెందిన భూములను పొందుతారు. వీటి విలువ పెరగడంతో పాటు అమ్ముకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 • నగర ప్రణాళికాబద్ధ  అభివృద్ధికి, విస్తరణకు ఈ పథకం దోహదపడటంతో పాటు, మరిన్ని అభివృద్ధి చేసిన భూములు అందుబాటులోకి వస్తాయి.
 • బిల్డింగ్‌ పర్మిషన్‌లు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా త్వరితగతిన లభిస్తాయి.
 • ఈ పథకం రైతులు, భూయజమానులు, హెచ్‌ఎండీఏ మధ్య పారదర్శకంగా అమలవుతుంది. ఎలాంటి మధ్యవర్తులు ఉండరు.
 • ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో పార్కులు, ఆట స్థలాలు, కమ్యూనిటీ హాల్స్‌ లాంటి సామాజిక మౌలిక సదుపాయాల కోసం భూమిని కేటాయించడం జరుగుతుంది.
 • ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీంలో ప్రాజెక్టు విలువ మేరకు డెవలప్‌మెంట్‌ ఏరియాను హెచ్‌ఎండీఏ, భూ యాజమానుల మధ్య డీఆర్‌పీ పద్ధతిలో కేటాయిస్తారు.
 • ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో అభివృద్ధి చేసే సకల సౌకర్యాలూ కలిగిన ప్లాట్లను రైతులు/ భూ యాజమానులకు కేటాయిస్తారు.భూ యాజమానులు/రైతులు సమష్టిగా ఉంటేనే ఈ విధమైన అభివృద్ధికి అస్కారం ఉంటుంది. 
 • ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలో రైతుల భూములకు.. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన భూములుగా బ్రాండ్‌ వ్యాల్యూ సమకూరుతుంది. ఇతర భూములతో పోలిస్తే అదనపు మార్కెట్‌ విలువ లభిస్తుంది. 
 • మంచినీరు, విద్యుత్‌, పార్కులు, సివరేజ్‌ లాంటి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కలిగిన హౌజింగ్‌ ప్లాట్లను రైతులు పొందుతారు. అవసరాల మేరకు వారు తమ ప్లాట్లను అభివృద్ధి చేసుకోవచ్చు లేదా అమ్ముకునే వీలు ఉంటుంది.


logo