బుధవారం 05 ఆగస్టు 2020
Realestate - Jul 11, 2020 , 00:03:56

సాహో.. షాండ్లియర్స్‌!

సాహో.. షాండ్లియర్స్‌!

గృహాలంకరణ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఒకప్పుడు స్టార్‌ హోటళ్లు, బడాబడా బంగ్లాలకే పరిమితమైన ‘షాండ్లియర్‌'.. నేడు సామాన్యుల ఇండ్లలోనూ కనువిందు చేస్తున్నది. తళుక్కుమనే రాళ్లతో వయ్యారంగా వేలాడుతూ.. ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నది. హాలు మాత్రమే కాదు.. మాస్టర్‌ బెడ్‌రూమ్‌, కిడ్స్‌ రూమ్‌, గెస్ట్‌ రూమ్‌, కిచెన్‌.. ఇలా ఏ గదిలోనైనా ఈ వెలుగు జిలుగుల షాండ్లియర్లను వేలాడదీయడం ఇప్పుడు ట్రెండీగా మారింది. ఎంత పెద్ద ఇల్లు కట్టినా తగిన వెలుతురు లేకపోతే.. మొత్తం చీకటిమయమే అవుతుంది. వెలుతురు కోసం ఎన్ని లైట్లు వేసినా.. ఇంటికి ఆధునికతను జోడించాలంటే మాత్రం హాలులో షాండ్లియర్లు వేలాడదీయాల్సిందే! ఆధునికత ఉట్టిపడే ఇంటి అలంకరణ వస్తువుల్లో ‘షాండ్లియర్లు’ ప్రత్యేకమైనవి. ఇల్లంతా వెలుగులు వెదజల్లడంతోపాటు ఫ్యాన్సీ పీస్‌లా ఆకట్టుకొనే ఈ షాండ్లియర్లను ఎంపిక చేసుకునేటప్పుడు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.షాండ్లియర్‌ అనగానే పాత సినిమాల్లో కనిపించే ఒక పెద్ద ఊయలలా.. భారీ స్థాయిలో కళ్లముందు కదలాడుతాయి. కానీ, అవన్నీ ఓల్డ్‌ మోడల్‌. అయినా, వాటికి ఆదరణ ఇంకా తగ్గలేదనుకోండి. కాకపోతే, అవి అన్ని గదులకు, అన్ని రకాల ఇండ్లకు పెద్దగా నప్పకపోవచ్చు. షాండ్లియర్‌ పెట్టామంటే.. అది ఆ గది అలంకరణలో భాగమైపోవాలి. ప్రత్యేకంగా కనిపించకూడదు. గదిలోని ఫర్నీచర్‌, ఆ గది వైశాల్యం, ఎత్తులనుబట్టి షాండ్లియర్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో ఛాయిస్‌ ఎక్కువే. మార్కెట్‌లో అనేక డిజైన్లలో లభిస్తున్నాయి. 

లేయర్డ్‌ షాండ్లియర్‌ : మార్కెట్లో ఎక్కువగా కనిపించే డిజైన్లలో ఇదొకటి. పొరలలాంటి అమరికతో ఉండే ఈ రకం షాండ్లియర్లు, రకరకాల సైజుల్లో దొరుకుతాయి. లేయర్లు పెరిగేకొద్దీ సైజు కూడా పెరుగుతుంది. 

ట్రెడిషనల్‌ షాండ్లియర్‌ : గదిలో సంప్రదాయ ఫర్నీచర్‌, ఫిట్టింగ్స్‌ ఉంటే ఆ ప్రదేశానికి సూటయ్యేలా ఈ రకం షాండ్లియర్‌ను ఎంచుకోవాలి. అప్పుడే గది అలంకరణతో చక్కగా కలిసిపోతుంది.

క్రిస్టల్‌ షాండ్లియర్‌ : విలాసవంతంగా కనిపించే క్రిస్టల్‌ షాండ్లియర్ల్ల ఖరీదు కాస్త ఎక్కువే. గదికి గ్లామర్‌ రావాలంటే వీటికి ప్రత్యామ్నాయం లేదు.  

రస్టిక్‌ షాండ్లియర్‌ : హోమ్‌ డెకార్‌కు క్యాజువల్‌ టచ్‌ ఇవ్వాలనుకుంటే రస్టిక్‌ షాండ్లియర్‌ మంచి చాయిస్‌. వీటిలో ఉపయోగించే జంతువుల కొమ్ములు, చెట్ల కొమ్మలు, మొక్కలను తలపించే మోటిఫ్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

మినీ షాండ్లియర్‌ : షాండ్లియర్‌ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు.. ఆకట్టుకునేలా ఉంటే సరిపోతుంది. చిన్నగదుల కోసం మినీ షాండ్లియర్లూ లభిస్తున్నాయి.

కాంటెంపరరీ : మనకు నచ్చిన రీతిలో కూడా ఇప్పుడు షాండ్లియర్లను డిజైన్‌ చేసుకోవచ్చు. అనేక థీమ్‌లతో అమర్చుకోవచ్చు. మనకు నచ్చినట్టు, మనసు మెచ్చినట్టు రూపొందించుకునే అవకాశం ఉన్నది. ఆకాశమే హద్దు! 


కొనేముందు..

  • గది పొడవు, వెడల్పులను బట్టి ఎంచకోవాలి. గోడకు మ్యాచ్‌ అయ్యేలా ఉంటే.. మరింత వెలుగు వస్తుంది.
  • డైనింగ్‌రూమ్‌లో షాండ్లియర్‌ వేలాడదీయాలనుకుంటే డైనింగ్‌ టేబుల్‌ మధ్యకి వచ్చేలా హ్యాంగ్‌ చేయాలి.
  • టేబుల్‌కి, షాండ్లియర్‌కి మధ్య 75 నుంచి 85 సెం.మీ.ల దూరం ఉండేలా జాగ్రత్తపడాలి.
  • షాండ్లియర్‌లో వాడేందుకు ఎక్కువ ఓల్టేజ్‌ ఉన్న బల్బులను ఎంచుకోకూడదు. దీనివల్ల వేడి వచ్చేస్తుంది. మన మూడ్‌ చేంజ్‌ అవుతుంది.
  • రంగురంగుల బల్బులైతే.. షాండ్లియర్‌కి ఉండే క్రిస్టల్స్‌పై పడి గదంతా రంగులమయం అవుతుంది.
  • బెడ్‌రూమ్‌లో అయితే నేరుగా, బెడ్‌ మీదనే కాకుండా కొంచెం ముందువైపు ఉండేలా చూసుకోవాలి. 


logo