సోమవారం 06 జూలై 2020
Realestate - Jun 27, 2020 , 00:17:08

అందానికి కిటుకులు.. కిటికీలు!

అందానికి కిటుకులు.. కిటికీలు!

తెలంగాణలో గృహనిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. అందులోనూ హైదరాబాద్‌ దేశంలోనే  తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇంట్లోని అణువణువూ ఆకర్షణీయంగా ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. కొత్తదనం కోసం యూపీవీసీ విండోలను వాడటం తాజా ట్రెండ్‌! 

సాధారణ కలపతో తయారయ్యే కిటికీల కంటే యూపీవీసీ విండోలు కొంత ఖర్చుతో కూడుకున్నవే. కాకపోతే ఇంటి అందం, నిర్వహణ, భవిష్యత్తులో విద్యుత్తు ఆదా, మన్నిక వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటే యూపీవీసీ కిటికీలే చక్కటి ఎంపిక అని చెప్పొచ్చు. అందుకే, వీటికి మార్కెట్లో  ఆదరణ పెరుగుతున్నది. ఇందులో వుడ్‌ ఫినిష్‌, ఓక్‌ వుడ్‌, రోజ్‌వుడ్‌, బ్యాంబూ వుడ్‌ తదితర రకాల యూపీవీసీ కిటికీలూ దొరుకుతున్నాయి. 

ఇంటి నిర్మాణంలో కిటికీలు కీలకమైనవి. గతంలో కలప కిటికీలనే ఉపయోగించినా.. కాలానుగుణంగా కిటికీల్లోనూ ఆధునిక పోకడలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ క్రమంలో యూపీవీసీ (అన్‌ ప్లాస్టిసైజ్డ్‌ పాలీవినైల్‌ క్లోరైడ్‌) రకం కిటికీలు, ఆధునిక గృహ యజమానుల ఆదరణ పొందుతున్నాయి. తెలంగాణలో అధిక శాతం డెవలపర్లు అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులకు యూపీవీసీ విండోలనే అమర్చుతున్నారు. దీర్ఘకాల మన్నికను దృష్టిలో పెట్టుకుని.. కాస్త ఖరీదు అయినప్పటికీ వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగతంగా ఇండ్లను కట్టుకునేవారు కూడా యూపీవీసీ విండోలకే ఓటేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో విపరీతమైన గాలిని తట్టుకోవడం కలపతో తయారు చేసే కిటికీల వల్ల సాధ్యం కాకపోవచ్చు. ఈ అంశాన్ని గుర్తించిన అనేక సంస్థలు తమ నిర్మాణాల్లోని కిటికీలకు యూపీవీసీ రకాల్ని వాడుతున్నాయి. 35 అంతస్తులు దాటిన తర్వాత అంత ఎత్తులో కట్టే అపార్టుమెంట్లకు తక్కువ బరువు గల అల్యూమినియం కిటికీలనే వాడాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అపర్ణా, ఫెనెస్టా, ఎల్‌జీ, రెహావు, టీఎన్‌ఆర్‌ వ్యూస్‌, పెన్నార్‌ వంటి సంస్థలు యూపీవీసీ కిటికీలను విక్రయిస్తున్నాయి. 

ప్రయోజనాలెన్నో..

అటవీ విస్తీర్ణం తగ్గడంతో కలప దొరకడం కూడా కష్టమవుతున్నది. ఒకవేళ దొరికినా.. కిటికీలు తయారు చేయడానికి కార్మికులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికుల కొరతతో పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. పైగా, కలపకు చెదలు పట్టే ప్రమాదముంది. వాటిని ఒకసారి తయారు చేశాక.. ఒక్కోసారి బిగించడంలోనూ సమస్యలు ఏర్పడుతుంటాయి. తుమ్మ, జామ వంటి కలపతో తయారు చేసే బాత్‌రూమ్‌, బాల్కనీ తలుపులకు నీళ్లు తగిలితే ఉబ్బిపోతుంటాయి. ఇలాంటి ప్రతికూలతలన్నీ యూపీవీసీ రకాలతో అధిగమించవచ్చు. పైగా, ఇది హరిత సూత్రాలకు అనుగుణంగా తయారు చేసే రకం కాబట్టి, మళ్లీ వాడుకోవచ్చు. 

ఒక్క ఇంటికెంత?


చైనా, జర్మనీ వంటి దేశాల్లో తయారైన యూపీవీసీ విండోలు తెలుగు రాష్ర్టాల్లోనూ లభిస్తున్నాయి. రేటు విషయానికొస్తే.. చైనా రకాల రేటు చదరపు అడుక్కీ రూ.320 నుంచి రూ.360 దాకా పలుకుతున్నది. అదే జర్మనీ రకమైతే రూ.500 నుంచి లభిస్తుంది. అంటే, 4/4 అడుగుల సైజున్న కిటికీ కోసం ఎంతలేదన్నా రూ.5,000 నుంచి రూ.8,000 దాకా ఖర్చు అవుతుంది. అద్దం, కిటికీ, రవాణా, బిగించడం.. వంటివన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. కిటికీ సైజు, డిజైన్‌, సంస్థను బట్టి రేటు మారుతుంది. ఇంతకంటే తక్కువ రకాలూ మార్కెట్లో లభిస్తున్నాయి. రెండు పడక గదుల ఇంటికి వివిధ సైజుల్లో ఎంతలేదన్నా ఎనిమిది నుంచి పది కిటికీలు అవసరం అవుతాయి. ఇందుకోసం కనీసం రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా ఖర్చు అవుతుంది. అదే మూడు పడక గదుల ఫ్లాట్‌ అయితే రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల దాకా ఖర్చు వస్తుంది. బ్రాండ్‌లను బట్టి ధరలు మారిపోతాయని గుర్తుంచుకోండి. స్థానికంగానూ అనేక సంస్థలు యూపీవీసీ విండోలను తయారు చేస్తున్నాయి. వారిని సంప్రదిస్తే కాస్త చౌకగానే దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే, వాటి నాణ్యత గురించి ముందే తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోవాలి. నకిలీల విషయంలో నూ జాగ్రత్త.

నాలుగేండ్ల దాకా ఢోకా లేదు..


ఇల్లు అయినా అపార్టుమెంట్‌ అయినా రంగులు చివరి కోటింగ్‌ వేసే ముందే యూపీవీసీ కిటికీల పని మొదలు పెట్టాలి. గృహ యజమానులతోపాటు డెవలపర్లు మా దగ్గర నాణ్యమైన కిటికీలను తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికుల మీద ఎక్కువగా ఆధారపడలేని వారంతా యూపీవీసీ కిటికీలనే కొంటున్నారు. కొంతకాలం నుంచి సాధారణ కలప బదులు యూపీవీసీ కిటికీల్ని వాడేవారు ఏటా ఎనిమిది శాతం చొప్పున పెరుగుతున్నారు. హైదరాబాద్‌లో సుమారు 25 శాతం మంది ఈ రకాలను తమ ఇండ్ల కోసం వాడుతున్నారు. వచ్చే నాలుగేండ్లలో యూపీవీసీ కిటికీలకు ఎక్కడలేని ఆదరణ పెరుగుతుంది. ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. నాసిరకం కిటికీల వైపు మొగ్గు చూపితే క్యాన్సర్‌ వంటి రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, వీటిని ఎంచుకునేముందు, ధర కంటే నాణ్యతను గమనించాలి.

- విక్రమ్‌ కుమార్‌, ఎండీ, టీఎన్‌ఆర్‌ వ్యూస్‌ 

లాభాలు.. అన్నీయిన్నీ కావు..

  • ఇంట్లోకి గాలి కూడా దూరడానికి వీల్లేకుండా 
  • వీటిని బిగించొచ్చు. 
  • శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. 
  • ఏసీ బిల్లు ముప్పై శాతం దాకా తగ్గుతుంది. 
  • అగ్ని వ్యాప్తిని నిరోధిస్తుంది.
  • గాలిని తట్టుకుని సమర్థంగా నిలబడుతుంది.
  • నిర్వహణలోనూ ఇబ్బంది పడనక్కర్లేదు.
  • దీర్ఘకాలం మన్నికగా నిలుస్తుంది.
  • పర్యావరణానికి అనుకూలమైన వస్తువు. 
  • కోరుకున్న సైజులు, ఆకారాల్లో లభిస్తుంది.


logo