మంగళవారం 14 జూలై 2020
Realestate - Jun 27, 2020 , 00:17:02

ఈ మొక్కలుంటే

ఈ మొక్కలుంటే

దోమలు పరార్‌!మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు దోమల వల్లే వస్తాయి. వీటి వ్యాప్తిని అరికట్టడానికి రకరకాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటివల్ల అలర్జీ, తలనొప్పి వంటివి వచ్చే ప్రమాదం ఉంది. పైగా దోమల మందుల్లో ఉండే DEET (N,N-DIETHYL-METATOLUAMIDE) అనే పదార్థం గర్భిణులతో పాటు పన్నెండేండ్లలోపు పిల్లలకూ హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, దోమల్ని అరికట్టే ప్రయత్నంలో  ఇబ్బందులు వద్దనుకుంటే.. ప్రకృతిసిద్ధమైన మొక్కల్ని వాడటం ఉత్తమం. 

ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగే మొక్కలైన నిమ్మగడ్డి 

(లెమన్‌ గ్రాస్‌, సైబోపోగాన్‌, నార్దస్‌, సిట్రోనెల్లా వింటేరియానస్‌)ని ఇంటి ముందు పెంచుకుంటే చాలు.. దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇందుకోసం అధిక సంఖ్యలో మొక్కల్ని పెంచక్కర్లేదు. ఒకట్రెండు అయినా చాలు. దోమలు పరారవుతాయి. నిమ్మగడ్డిలో చాలా రకాలు ఉంటాయి. వాటిన్నింటిలోకి సైబోపోగాన్‌, నార్డస్‌, సెట్రోనెల్లా వింటేరియానస్‌ అనే రకాలు దోమల్ని సమర్థంగా అరికడతాయి. దీని మొదళ్లు కొంచెం ఎర్రగా ఉంటాయి. మిగతా మొక్కంతా ఆకుపచ్చగా గడ్డి మాదిరిగా ఉంటుంది. ఇవి పేరొందిన నర్సరీల్లో దొరుకుతాయి.

ఎలా పెంచాలి?

ఇవి బాగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలోనూ, పాక్షిక సూర్యరశ్మి ఉండే ప్రదేశంలోనూ చక్కగా పెరుగుతాయి. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అపార్టుమెంట్ల బాల్కనీల్లోనూ పెంచవచ్చు. రెండు వంతులు ఎర్రమట్టి, ఒక వంతు పశువుల ఎరువు, కొంత వేపపిండి కలిపిన మిశ్రమాల్ని కుండీల్లో నింపాలి. కుండీలకు మురుగునీటి సౌకర్యం కల్పించాలి. అంటే, ఎక్కువైన నీటిని బయటికి పంపే సదుపాయం ఉండాలన్నమాట. ఈ మొక్కల్ని తెచ్చుకుని పాలిథిన్‌ కవర్లను తీసి, మట్టిగడ్డితో సహా కుండీలోనో, నేలలోనో నాటి నీళ్లు పోస్తే సరిపోతుంది. logo