మంగళవారం 14 జూలై 2020
Realestate - Jun 20, 2020 , 01:16:10

టైల్స్‌.. స్టైల్స్

టైల్స్‌.. స్టైల్స్

ఇంటి అందం ద్విగుణీకృతం కావాలన్నా.. ఇంటికొచ్చే అతిథుల్ని ఆకట్టుకోవాలన్నా.. ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా, ఫ్లోరింగ్‌ విషయంలో ట్రెండీగానే ఆలోచించాలి. ఎందుకంటే ఇంట్లోకి అడుగుపెట్టగానే ముందుగా ఆకర్షించేది ఫ్లోరింగే. హాల్‌లోని టీవీ క్యాబినెట్‌, లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ ఏరియా.. ఇలా ప్రతి ప్రాంతాన్నీ వైవిధ్యంగా, మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దుకోవాలి. ఇందుకోసం విభిన్నమైన ‘టైల్స్‌' విరివిగా లభిస్తున్నాయి. వీటితో ఇంటిని సుందరంగా అలంకరిస్తే చాలు.. ఇంట్లోకి ఎవరు అడుగుపెట్టినా ‘వావ్‌' అనాల్సిందే. 

అప్పట్లో, సొంతిల్లు కట్టుకునే గృహయజమానులకు హైదరాబాద్‌లో కేవలం కొన్ని సైజుల్లోనే టైల్స్‌ లభించేవి. దీంతో, అధిక శాతం మంది ప్రత్యామ్నాయం కోసం ఆలోచించేవారు. కానీ, ప్రస్తుతం మన వద్ద చిన్న సైజుల్లోనే కాదు.. ఇటాలియన్‌ మార్బుల్‌ తరహాలో బడా సైజుల్లోనూ టైల్స్‌ దొరుకుతున్నాయి. ఇంట్లో కాస్త పెద్ద హాల్‌ ఉన్నవారి కోసం 8/4, 10/5 అడుగుల సైజుల్లోనూ లభిస్తున్నాయి. దేశీయ రకాలే కాదు, విదేశీ సంస్థల అత్యాధునిక డిజైన్లూ నగరంలోనే లభిస్తున్నాయి. నెక్సియన్‌, క్యూటన్‌, సింపోలో వంటి సంస్థలను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. కేవలం హాలు, లివింగ్‌ రూముల్లోనే కాదు.. బాత్‌రూముల్లోనూ బడా సైజున్న టైల్స్‌ను వినియోగించేవారి సంఖ్య పెరుగుతున్నది. పొడుగ్గా సింగిల్‌ షీట్‌గా కనిపించే ఈ టైల్స్‌ వేశాక, పైన ఫాల్స్‌ సీలింగ్‌ చేస్తున్నారు. దీంతో బాత్‌రూములన్నీ గ్లామర్‌ గదులుగా మారిపోతున్నాయి. ఈమధ్య  ఎక్కువ మంది ఇండిపెండెంట్‌ ఇండ్లలో బాత్‌రూముల్ని పెద్దగా నిర్మిస్తున్నారు. కిచెన్‌ ప్లాట్‌ఫారానికి కూడా  పెద్ద సైజు టైల్స్‌ను వినియోగిస్తున్నారు. కంపెనీ తయారు చేసే టైల్స్‌, వాడే రా మెటీరియల్‌, ప్రాసెసింగ్‌ వల్ల ధరల్లో మార్పులుంటాయి. నెక్సీయన్‌ రకం టైల్స్‌ను డ్రై గ్య్రానుల్యా ప్రాసెస్‌లో తయారు చేస్తారు. వీటిని ఏ కోణంలో చూసినా ఉపరితలమంతా ఒకే రకంగా.. ఫ్లాట్‌గా కనిపిస్తుంది. 

టూ బెడ్‌రూం ఫ్లాట్‌కు ఖర్చెంత?

సాధారణంగా రెండు పడక గదుల ఇంట్లో హాల్‌, కిచెన్‌, లివింగ్‌/డైనింగ్‌, ఒకట్రెండు బాల్కనీలు, బాత్‌రూములు ఉంటాయి. ఓ పన్నెండు వందల చదరపు అడుగుల ఫ్లాట్‌ను తీసుకుంటే కార్పెట్‌ ఏరియా 900- 1000 చదరపు అడుగులే వస్తుంది. 2/2 అడుగుల ప్రాథమిక డిజైన్‌ టైల్స్‌ను వేసుకునేందుకు సుమారు రూ.80,000 నుంచి రూ.95,000 దాకా ఖర్చు వస్తుంది. హాల్‌లో కాస్త పెద్ద సైజు అంటే 2.5/2.5 సైజు టైల్స్‌ వేసుకుంటే రూ. 5 వేల నుంచి రూ.7 వేల దాకా అదనంగా ఖర్చవుతుంది. డిజైన్‌, రంగులు, ప్యాటర్న్‌ను బట్టి రేట్లలో తేడాలుంటాయి. బాత్‌రూముల్లో.. సాధారణంగా డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లలో బాత్‌

రూములు 5/6 లేదా 5/7 అడుగుల సైజులో ఉంటాయి. ఎవరైనా కేవలం ఏడు అడుగుల ఎత్తు వరకే టైల్స్‌ వినియోగిస్తారు. 200 నుంచి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు గోడలు, కింద ఫ్లోరింగ్‌ ఉంటుంది. ఇందులో 2/1 సైజు గల బ్రాండెండ్‌ టైల్స్‌ను వాడితే ఒక బాత్‌రూముకు రూ.12 వేల నుంచి రూ.13 వేలు ఖర్చవుతుంది. సాధారణంగా మంచి బ్రాండ్‌ టైల్స్‌ను వాడితే ఇంత అవుతుందన్నమాట. ఇంతకంటే కొంచెం తక్కువ రకం టైల్స్‌ కావాలన్నా వేసుకోవచ్చు. ఇందు కోసం.. సుమారు రూ.9,000 ఖర్చొస్తుంది. అదే అన్‌బ్రాండెడ్‌ అయితే, 1/1.5 అడుగుల సైజు గల టైల్స్‌కు దాదాపుగా రూ.7,000 వరకు ఖర్చు వస్తుంది. మూడు పడకగదుల ఫ్లాట్లు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే వారి సంఖ్య పెరుగుతున్నది. డబుల్‌ ఛార్జ్‌డ్‌ విట్రీఫైడ్‌ టైల్స్‌ను ఫ్లోరింగ్‌లో వేయవచ్చు. ఇందులో ఎక్కువగా 2/2 లేదా 2.5/2.5 సైజువి వాడొచ్చు. బాత్‌రూముల విషయానికొస్తే ఎక్కువగా 2/1 సైజువి గోడలకు, 1/1 సైజు టైళ్లను ఫ్లోరింగుకు వాడుకోవచ్చు. 


 రూ.30 నుంచి రూ.3,000 వరకూ

హైదరాబాద్‌లో 2/1 ఫీట్‌ టైల్స్‌ను వినియోగించేవారిలో ఎక్కువగా శాటన్‌, గ్లాసీ, రస్టిక్‌ వంటి రకాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. బాత్‌రూములో షవర్‌ క్యూబికిల్స్‌ వద్ద హైలైటర్స్‌ వాడేవారి సంఖ్య పెరుగుతున్నది. వీటిని తీసుకుంటే ధరలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. హైఎండ్‌ టైల్స్‌ విషయానికి వస్తే.. మ్యాట్‌ ఫినిష్‌, రస్టిక్‌ ఫినిష్‌ ఎక్కువగా వాడుతున్నారు. సాధారణంగా టైల్స్‌ ధర ఫీట్‌కు రూ.30 నుంచి రూ.3,000 దాకా మన వద్ద లభిస్తున్నాయి. ఒక డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లో టైల్స్‌ వేయాలంటే రెండు, మూడు రోజుల్లో పని పూర్తి చేయవచ్చు. ఎవరైనా దిగుమతి రకం టైల్స్‌తో తమ ఇండ్లను డిజైన్‌ చేయాలనుకుంటే, మేం ఆధునిక యంత్ర పరికరాల్ని కూడా అందజేస్తున్నాం. హ్యాండ్‌మేడ్‌, కస్టమైజ్డ్‌ టైల్స్‌ ట్రెండ్‌ నగరంలో అధికమైంది. టీవీ క్యాబినెట్‌, డైనింగ్‌ హాల్‌, లివింగ్‌ రూమ్‌, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌.. ఇలా ఎక్కడైనా ఒక ప్రాంతాన్ని హైలైట్‌ చేయడానికీ టైల్స్‌ చక్కగా పనికొస్తాయి. ఎక్కడైనా ఓ ఇరవై చదరపు అడుగుల స్థలాన్ని హైలైట్‌ చేయాలనుకుంటే, ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ఆర్డర్‌ మీద తయారు చేసే మంచి డిజైనర్‌ టైల్స్‌ చదరపు అడుక్కి రూ.600 నుంచి రూ. 3,000 వరకూ లభిస్తాయి. త్రీడీ, గ్లాస్‌ మొజాయిక్‌, మ్యూరల్స్‌.. ఇలా మూడొందలకు పైగా డిజైన్లు దొరుకుతాయి. - శ్రీనాథ్‌ రాఠీ, ఎండీ, హోమ్‌ 360

తాజావార్తలు


logo