సోమవారం 25 మే 2020
Realestate - Mar 21, 2020 , 01:02:24

వెయిట్‌ కరోనా..

వెయిట్‌ కరోనా..

ఒకవైపు ఆర్థిక మాంద్యం.. మరోవైపు విజృంభిస్తున్న  కరోనా వైరస్‌.. ఈ రెండింటి వల్ల తాత్కాలికంగా నిర్మాణ రంగం ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నది. హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయాలని భావించేవారంతా వేచి చూసే ధోరణీని మళ్లీ అలవర్చుకున్నారని నిర్మాణ రంగం అంటున్నది. డెవలపర్లు సైతం కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించడానికి కొంతకాలం వేచి చూసేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం.

సాధారణంగా హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో ఉగాది నుంచి కొత్త ప్రాజెక్టులను డెవలపర్లు ప్రకటిస్తుంటారు. కానీ, ఈసారి కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్న నిర్మాణాల్ని పూర్తి చేయడంపై బిల్డర్లు అధిక దృష్టి సారిస్తున్నారు. కరోనా గనక లేకపోతే, మార్చి నెలలో అధిక స్థాయిలో ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి. ఎందుకంటే, మాంద్యంతో సంబంధం లేకుండా మన వద్ద నిర్మాణ రంగానికి గిరాకీ మెరుగ్గా ఉన్నది. భారతదేశమంతటా రియల్‌ రంగం కునారిల్లుతుంటే, హైదరాబాద్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాకపోతే, కరోనా దెబ్బ వల్ల మార్కెట్‌ మీద ప్రతికూల ప్రభావం పడింది. 

ఉగాది నుంచే.. 

పిల్లల పరీక్షలన్నీ పూర్తి కాగానే.. సాధారణంగా బయ్యర్లు ఇంటి వేట మీద దృష్టి పెడుతుంటారు. ఉగాది నుంచే ఎక్కువగా కొనుగోళ్లను ఆరంభిస్తుంటారు. అయితే, ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో చాలామంది ఐటీ ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. దీనికి కరోనా జత కలవడంతో ప్రాజెక్టులను సందర్శించేవారి సంఖ్య తగ్గింది. కాకపోతే, కొందరు డెవలపర్లు కొత్త ప్రయత్నం మొదలెట్టారు. ప్రాజెక్టులను సందర్శించాలని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో టైమ్‌ స్లాట్లను కేటాయిస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద సందర్శకుల రద్దీని తగ్గించాలన్నది వీరి ప్రధాన ఉద్దేశ్యం. అయినప్పటికీ, నిర్మాణాల్ని సందర్శించేవారి సంఖ్య గతంలో పోల్చితే ప్రస్తుతం భారీ స్థాయిలో తగ్గిందని చెప్పొచ్చు.

ఏం చేయాలి?

కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు డెవలపర్లు ముందు జాగ్రత్త చర్యల్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రాజెక్టులను సందర్శించేవారి కోసం ప్రత్యేకంగా శానిటైజర్లను ఏర్పాటు చేయాలి. వీలైతే, చేతులు కడుక్కునే సౌలభ్యాన్ని వారికి కల్పించాలి. ఇదే విధానాన్ని నిర్మాణాల్లో పని చేసే భవన నిర్మాణ కార్మికులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఇతరులకు అవలంబించాలి. నిర్మాణ సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే, దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని నిర్మాణ సంఘాలు తమ సభ్యులకు సూచించాలి. 


logo