సోమవారం 25 మే 2020
Realestate - Mar 21, 2020 , 00:56:49

అపార్టుమెంట్లలో అప్రమత్తంగా..

అపార్టుమెంట్లలో అప్రమత్తంగా..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన  అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్‌ సూచించారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వైరస్‌ నియంత్రించేందుకు వీలుంటుంది. వ్యక్తిగత శుభ్రత, ముందస్తు జాగ్రత్తలే శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి సూచించిన మేరకు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకోవాలి. వీలైనంత వరకు గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసించే వారు బయటి ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. ఇంకా,  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాంటే.. 
  • పని సిబ్బంది, సందర్శకులు, అతిథులు, డెలివరీ సిబ్బందికి తప్పకుండా ఉష్ణోగ్రత పరీక్ష చేయాలి. లేకపోతే, వారి ద్వారా కరోనా ప్రవేశించొచ్చు.
  • గేటెడ్‌ కమ్యూనిటీలోకి వచ్చే వారంతా ప్రవేశ మార్గం వద్ద చేతులు శుభ్రంగా కడుక్కునే ఏర్పాట్లు విధిగా చేయాలి. 
  • అపార్టుమెంట్లలో లిఫ్టులు, వాటి హ్యాండ్‌రెయిలింగ్‌ వంటి వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో తుడిచి వేయాలి.
  • ఫ్లాట్లలో పని చేసేవారు, సెక్యూరిటీ సిబ్బంది ఇండ్లలోనూ ఉపయోగించేందుకు శానిటైజర్లను నివాసితుల సంఘం సరఫరా చేయాలి.
  • ప్రవేశ మార్గం వద్ద భద్రతా సిబ్బందికి మాస్క్‌లు ఇవ్వాలి.  అవసరమైతే సిబ్బందిని తగ్గించాలి. హౌస్‌కీపింగ్‌ సిబ్బందికి హ్యాండ్‌ గ్లోవ్స్‌ ఇవ్వాలి. హౌస్‌ కీపింగ్‌, భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించాలి
  • తమ కమ్యూనిటీ గేట్‌ వద్ద సెక్యూరిటీ యాప్‌ను వినియోగిస్తుంటే, దానిని సందర్శకులు తాకకుండా చూసుకోవాలి. ప్రతి 2 గంటలకోసారి శానిటైజర్‌తో తుడవాలి
  • అపార్టుమెంట్‌ కాంప్లెక్స్‌ లోపల పిల్లలు, తల్లిదండ్రుల కోసం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్ని తగ్గించాలి
  • నివాసితులు, చిన్నారులు, పని సిబ్బంది గార్డెన్లు, లేదా కామన్‌ ఏరియాల్లో ప్రవేశించడాన్ని నిషేధించాలి. 
  • నివాసితుల్లో ఎవరికైనా జలుబు ఉన్నా, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు వంటివి ఉన్నా భయాందోళనకు గురికావొద్దని నివాసితుల సంఘం సూచించాలి. కుటుంబ సభ్యులతో కలవకండా విడిగా ఉండాలని, సాయం కావాలంటే తమను సంప్రదించాలని నివాసితుల సంఘం భరోసానివ్వాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్ప ఆస్పత్రిని సందర్శించాల్సిన అవసరం లేదని నివాసితులకు వివరించాలి. ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నా, ఆంబులెన్స్‌ కావాలన్నా విధిగా అపార్టుమెంట్‌ సంఘం సాయం అందించాలి. 
  • వాకింగ్‌ చేయాలనుకుంటే ఒంటరిగా వెళ్లాలే తప్ప ఇతరులతో కలిసి నడవకూడదు, ముచ్చటించకూడదు.తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలి. ఎవరైనా ఈమధ్య కాలంలో విదేశాల్నుంచి వచ్చి ఉంటే, ఇంట్లోనే ఉండటం అన్నివిధాల శ్రేయస్కరం. 


logo