సోమవారం 25 మే 2020
Realestate - Mar 13, 2020 , 23:54:51

రియల్‌ భరోసా

రియల్‌ భరోసా

ఒకే ఒక్క నెలలో.. స్టాక్‌ మార్కెట్‌ దాదాపు పది వేల పాయింట్ల దాకా కోల్పోయింది. 1.5 ట్రిలియన్‌ డాలర్ల మేరకు మదుపరుల సంపద ఆవిరైంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్‌.. ఇలా కారణాలేమైతేనేం.. సామాన్యుల నుంచి అపర కుబేరుల దాకా దారుణంగా నష్టపోయారు. సెన్సెక్స్‌ అంటేనే భయపడే స్థాయికి చేరుకున్నారు. మరి, పెట్టుబడి పెట్టాలని ఆలోచించే మధ్యతరగతి వేతనజీవులు స్టాక్‌ మార్కెట్‌ వద్దే వద్దంటున్నారు. ఇతర పెట్టుబడి మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వారందరికీ రియల్‌ రంగమో ప్రత్యామ్నాయంగా మారింది. అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనడం అలవర్చుకుంటున్నారు. 

రియల్‌ రంగంలో పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితమైనదిగా చెప్పొచ్చు. అలా అని, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. తెలంగాణలో ప్లాట్లు, ఫ్లాట్ల మీద పెట్టుబడి పెట్టాలని భావించేవారు.. జీహెచ్‌ఎంసీ వంటి కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ వంటి పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, డీటీసీపీల నుంచి అనుమతి తీసుకున్న వెంచర్లు, అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల్ని మాత్రమే ఎంచుకోవాలి. అది కూడా తెలంగాణ రెరా అథారిటీ నుంచి తుది అనుమతి తీసుకున్నవాటిలో కొనుగోలు చేయడమే ఉత్తమం. వీటి అనుమతి లేకుండా, సగం ధరకే ఫ్లాట్లు అమ్ముతామంటే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే, మీ పెట్టుబడికి పూర్తి స్థాయి భరోసా ఉంటుందనే గ్యారెంటీ లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. చివరికీ, తెలంగాణ రెరా అథారిటీ కూడా మీకు సాయం చేయలేదనే విషయాన్ని మర్చిపోవద్దు. 


2008లోనే మనం నిలబడ్డాం..

ప్రపంచవ్యాప్త మార్కెట్‌ను క్షుణ్నంగా గమనిస్తే.. స్టాక్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బతింటున్నది. ఆకాశాన్నంటిన బంగారాన్ని కొనుగోలు చేయడం సరైన నిర్ణయం కాదని నిపుణులు సైతం ఏకీభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రియల్‌ రంగంలో పెట్టుబడి పెట్టడమే సరైన నిర్ణయమని చెబుతున్నారు. స్టాక్‌ మార్కెట్‌ తరహాలో రియల్‌ రంగం ఒకేసారి కుప్పకూలడమంటూ ఉండనే ఉండదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడుతుంది. ఈ విషయం మనకు 2008-09 సమయంలోనే నిరూపితమైంది. అమెరికాలో సబ్‌ప్రైమ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ కకావికలైనప్పటికీ, మన రియల్‌ రంగానికి అప్పట్లో పెద్దగా నష్టమేం వాటిల్లలేదు. పైగా, అప్పటి హైదరాబాద్‌ నిర్మాణ రంగం సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ప్లాట్లు, ఫ్లాట్ల ధరలూ పెద్దగా తగ్గలేదు. కాకపోతే ఆ తర్వాత బయటికొచ్చిన సత్యం స్కామ్‌, తెల్లాపూర్‌లో ఏలియెన్స్‌ నిర్మాణ సంస్థ చేతులెత్తేయడం వల్ల ఫ్లాట్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడింది. కొంతకాలం తర్వాత మళ్లీ మార్కెట్‌ తేరుకున్నది. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, గతంలో కంటే అధిక స్థాయిలో నిర్మాణ రంగానికి గిరాకీ పెరగడం గమనార్హం. 


సురక్షితమే

  • పెద్ద నోట్ల రద్దు తర్వాత అధిక శాతం ప్రజల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కన్పిస్తున్నది. బ్యాంకుల్లో దాచుకోవడం అభద్రతగా భావించడం మొదలెట్టారు. అందుకే, మధ్యతరగతి ప్రజానీకంతో సహా అపర కుబేరులు సైతం భూములు, ప్లాట్లు, ఫ్లాట్లలో పెట్టుబడుల్ని పెట్టడం ఆరంభించారు. తాజాగా, యస్‌ బ్యాంకు పతనం తర్వాత ప్రజల ఆలోచనల్లో మరింత మార్పు వచ్చేసింది. ఎందుకంటే, ఒకసారి స్థలం అంటూ కొనుగోలు చేస్తే.. దాన్ని ధర హఠాత్తుగా పడిపోవడమంటూ ఉండదు. ఆతర్వాత, ఆయా స్థలంలోకి ప్రవేశించకూడదని అనేవారూ ఎవరూ ఉండరు. ప్లాటు కొనేసి రిజిస్టర్‌ చేసుకుంటే చాలు.. శాశ్వతంగా మన పేరిటే భద్రంగా ఉంటుంది. 
  • ఒక రేటు పెట్టి ప్లాటు కానీ ఫ్లాటు కానీ కొన్న తర్వాత.. రాత్రికి రాత్రే ధర పడిపోవడం జరగదు. విలువ కూడా తగ్గిపోదు. ఈ తరహా ప్రమాదం స్టాక్‌ మార్కెట్లో ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, 2008లో మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతకాలం దాకా ధర తగ్గిపోవడం కనిపించింది తప్ప, ఆతర్వాత సాధారణ స్థితికి చేరుకున్నది. 
  • ఫ్లాటు లేదా ఫ్లాటు కొన్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించవచ్చు. ఇందుకోసం కొంత సమయం పట్టొచ్చు. కాకపోతే, ఒకేసారి సొమ్మంతా చేతికొచ్చేస్తుంది. అందుకే, అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో, ప్రభుత్వ అనుమతులన్నీ పక్కాగా ఉన్న వాటిలో ప్లాటు కొనుగోలు చేసి, కొంతకాలం వేచి చూస్తే మంచి లాభాల్ని అందుకోవచ్చు.
  • ప్లాటు లేదా ఫ్లాటు కొనేటప్పుడు ఆర్‌బీఐతో సంబంధం ఉండదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. ఆర్థికమంత్రి మీ సొమ్ముకేం భయంలేదని ప్రకటనలతో ధైర్యం చెప్పనక్కర్లేదు. అసలు వారి పాత్రే ఉండదు. ఫ్లాటు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక మహా అయితే అపార్టుమెంట్‌ నిర్వహణ చూసే ఫెసిలిటీ మేనేజర్‌తో సంప్రదింపులు జరుపుతారంతే. 
  • గృహరుణ సాయంతో ఫ్లాటు కొంటే.. పన్ను రాయితీ లభిస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా సొంతంగా కంపెనీ ఉన్నట్లయితే, ఆ సంస్థ పేరు మీద వాణిజ్య సముదాయంలో స్థలం కొన్నా పన్ను ప్రయోజనం పొందవచ్చు. పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని కోరుకునేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లాట్లు లేదా ఫ్లాట్లను కొనడం ఉత్తమం. 

సరైన సమయమిదే

ప్లాటు అయినా ఫ్లాటు అయినా కొనుగోలు చేయడానికి ఇంతకు మించిన తరుణం లేదు. జీఎస్టీ రేటు తగ్గింది. గృహరుణాలపై వడ్డీ రేటు తగ్గుముఖం పట్టింది. కాకపోతే, స్థానిక సంస్థలు, రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టుల్లో మాత్రమే ప్లాటు, ఫ్లాటు, విల్లా, వ్యక్తిగత గృహాన్ని కొనుగోలు చేయాలి. ఒకవేళ, ప్లాటు కొనడానికి మీ వద్ద అధిక సొమ్ము లేకపోతే, కనీసం వాయిదా పద్ధతిలోనైనా కొనడానికి ప్రయత్నించాలి.కాస్త పేరున్న రియల్టర్‌ను ఎంచుకుని, ఓపిక చేసుకుని అయినా, భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ఏరియాల్లో ప్లాట్లను ఎంచుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం. 


కరోనాతో నష్టమేనా?

కరోనా వైరస్‌ వల్ల మనకు జరిగే నష్టం ఏమిటంటే.. మహా అయితే నిర్మాణాలు కొంత ఆలస్యం అవ్వొచ్చు. అదెలాగంటే, ప్రస్తుతం నిర్మాణ సంస్థలు చేపట్టే ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల్లో వినియోగించే బాత్‌ టబ్బులు, సింకులు, కమోడ్‌లు, టైళ్లు, ఫర్నీచర్‌ వంటివన్నీ అధిక శాతం చైనా నుంచి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల అక్కడి మార్కెట్‌ తెరుచుకోవడం లేదు. దీంతో అవి మనవద్దకు చేరుకోవడానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. దీంతో, ఈ పనులు చేపట్టే భవన నిర్మాణ కార్మికులకు పనులు లభించకపోవచ్చు. ఈ సమస్య కూడా తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేతప్ప, కరోనా వైరస్‌ వల్ల తెలంగాణ రియల్‌ రంగానికి వాటిల్లే నష్టమేం లేదని చెప్పొచ్చు.
-కింగ్‌ జాన్సన్‌ కొయ్యడ 


logo