సోమవారం 25 మే 2020
Realestate - Mar 13, 2020 , 23:51:04

నాలుగు హాట్‌ లొకేషన్లు

నాలుగు హాట్‌ లొకేషన్లు

దేశవ్యాప్తంగా రియల్‌ రంగం ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటుంటే.. హైదరాబాద్‌లో మాత్రం సుస్థిరంగా ఉన్నది. ఐటీ, ఐటీఈఎస్‌, ఫార్మా వంటి రంగాల్లో ఉద్యోవకాశాలు పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతమున్న కంపెనీలతో బాటు కొత్త సంస్థలూ భాగ్యనగరంలో కార్యకలాపాల్ని నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కీలకమైన ప్రాంతాలు స్థిరంగా ఉండటంతో పాటు మిగతా ఏరియాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌, కొంపల్లి వంటివి  ముందు వరుసలో నిలుస్తాయి. 

మాదాపూర్‌లో ఐటీ కారిడార్‌ రియల్‌ రంగం రూపురేఖల్ని మార్చేసింది. ఈ ప్రాంతమే ప్రధాన కేంద్రంగా గత కొన్నేండ్ల నుంచి నిర్మాణ రంగం అభివృద్ధి చెందింది. హైటెక్‌ సిటీకి చేరువగా ఉండాలన్న ఆలోచనతో చాలామంది ఇక్కడే ప్లాట్లు, ఫ్లాట్లు కొనడం అలవాటు చేసుకున్నారు. ప్రస్తుతం మాదాపూర్‌లో చదరపు అడుక్కీ ఏడు వేలకు అటుఇటుగా విక్రయిస్తున్నారు. అద్దె గృహాలకు ఎక్కడ్లేని ఆదరణ పెరుగుతున్నది. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఇక్కడే నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

అందుబాటులో కొంపల్లి..

నార్త్‌ హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్‌, పారిశ్రామిక హబ్‌గా విరాజిల్లుతున్న కొంపల్లికి ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరువగా ఉండటమే కాకుండా ఇక్కడ్నుంచి బేగంపేట్‌, సికింద్రాబాద్‌కు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ప్రస్తుతం శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి ఇక్కడ ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, లగ్జరీ విల్లాలకు కొదవే లేదు. రెండు పడక గదుల ఫ్లాట్లు సుమారు రూ.40 లక్షలకు అటుఇటుగా కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం దొరుకుతున్నాయి. 


కొండాపూర్‌ ఓకే..

మాదాపూర్‌ తర్వాత అటు హైటెక్‌ సిటీతో బాటు ఇటు గచ్చిబౌలికి కొండాపూర్‌ నుంచి సులువుగా రాకపోకలను సాగించొచ్చు. అందుకే, ఇక్కడ ఫ్లాట్లను తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపెడుతున్నారు. ఇక్కడి అద్దె గృహాలకు మంచి ఆదరణ ఉన్నది. ఫ్లాట్లను కొనేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈమధ్య కొండాపూర్‌లోనే ‘మై హోమ్‌' సంస్థ మంగళ అనే ప్రాజెక్టును ప్రకటించి రికార్డు స్థాయిలో అమ్మకాల్ని పూర్తి చేసింది. స్టాండ్‌ఎలోన్‌ అపార్టుమెంట్లకు ఇక్కడ కొదవే లేదు. 


మెట్రో రాకతో మియాపూర్‌..

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో మియాపూర్‌ రూపురేఖలు మారిపోయాయి. మెట్రో రైలు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్‌ వరకూ రావడంతో భారతదేశం దృష్టి మొత్తం ఈ ప్రాంతం మీద పడింది. ఎడ్యుకేషన్‌, ఇండస్ట్రీయల్‌ హబ్‌గా స్థిరపడిన మియాపూర్‌ నుంచి హైటెక్‌ సిటీ, గచ్చిబౌలికి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ఇక్కడ ఫ్లాట్లు చదరపు అడుక్కీ రూ.5,000 అటుఇటుగా చెబుతున్నారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో రేటు కొంచెం ఎక్కువ చెబుతున్నారు. స్టాండ్‌ ఎలోన్‌ అపార్టుమెంట్లలో తక్కువే ఉంటుంది.


logo