శుక్రవారం 05 జూన్ 2020
Realestate - Feb 21, 2020 , 23:08:05

పెద్దల గృహాలకు గిరాకీ

పెద్దల గృహాలకు గిరాకీ

నగరంలో పెద్దల గృహాలకు గిరాకీ పెరిగింది. దేశంలో ఎక్కడ పని చేసినా, పదవీవిరమణ తర్వాత హైదరాబాద్‌కు విచ్చేసి ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని భావించేవారి శాతం అధికమైంది. అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికల ప్రకారం.. 2050 నాటికి మనదేశ జనాభా 60 శాతం పెరుగుతుంది. కానీ, 60 ఏండ్లు పైబడిన వారి జనాభా 360 శాతం పెరుగుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో సీనియర్‌ సిటిజన్లు ఎలాంటి చింత లేకుండా పదవీ విరమణ పొందవచ్చు. అయితే వీరికి అనువైన గృహాలను సృష్టించడం అనుకూలమైన మార్కెట్‌ అని డెవలపర్లు గుర్తించారు. ప్రధానంగా సీనియర్‌ సిటిజన్ల గృహాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. పెరుగుతున్న ఆదాయం, అధిక జీవితకాలం ఈ డిమాండ్‌కు దారితీసే కారణాలు. 


 2000 ప్రారంభంలో భారత జనాభాలో ఎక్కువ భాగం విదేశాలకు వలస వెళ్లడంతో సీనియర్‌ సిటిజన్లు అధిక శాతం ఇక్కడే నివసిస్తున్నారు. గతంలో వృద్ధులు ఆర్థికంగా బలహీనంగా, ఇతరులపై ఆధారపడేవారు. కానీ ప్రస్తుతం వారు పదవీ విరమణ తర్వాత ఇబ్బందుల్లేని స్వతంత్ర, గౌరవప్రదమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతున్నారు. ఇప్పుడు భారతదేశంలోని సీనియర్‌ సిటిజన్ల స్థితిని మార్చడంలో రిటైర్మెంట్‌ హోమ్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వృద్ధుల అవసరాలకు అనుగుణంగా బిల్డర్లు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మిస్తున్నారు. కొందరు బిల్డర్లు సాధారణ అపార్డ్‌మెంట్లపై దృష్టి సారిస్తుండగా మరికొందరు గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విల్లాలను చేపడుతున్నారు. 

వైద్య సంరక్షణ, భద్రత వంటి అంశాలకు ఈ గృహాల్లో చాలా మంది ప్రాధాన్యతనిస్తున్నారు. రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, అంబులెన్స్‌ సౌకర్యాలు, జనరేటర్‌ బ్యాకప్‌తో అత్యవసర తరలింపు కోసం స్ట్రెచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధుల ఆహార అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ఆహారం, పోషకాహార నిపుణుల సేవలను అందిస్తున్నారు. వృద్ధులను దృష్టిలో ఉంచుకుని 75 శాతం బహిరంగ ప్రదేశాలు ఆకుపచ్చగా ఉండేలా, చాలా కాంప్లెక్స్‌ల్లో ప్రత్యేక నడక మార్గాలు రూపొందిస్తున్నారు. సమావేశాలు, వేడుకలు, వినోద ఏర్పాట్లను కూడా సులభతరం చేస్తున్నారు. పార్కులు, ఫొటో గ్యాలరీల వంటి వృద్ధుల ఉత్తేజకరమైన జీవితానికి అవకాశాన్నిస్తాయి. ఇలాంటి సౌకర్యాలున్న ఇండ్లలోనే నివసించాలని సీనియర్‌ సిటిజన్లు కోరుకుంటున్నారు. 


logo