ఆదివారం 23 ఫిబ్రవరి 2020
‘యూడీఎస్‌' వద్దు..‘రెరా’ ముద్దు

‘యూడీఎస్‌' వద్దు..‘రెరా’ ముద్దు

Feb 14, 2020 , 22:53:16
PRINT
‘యూడీఎస్‌' వద్దు..‘రెరా’ ముద్దు

అటు నిర్మాణ సంస్థలకు ఇటు కొనుగోలు దారులకు మేలు చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెరా చట్టాన్ని 2017 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆతర్వాత నమోదు అయిన ప్రాజెక్టుల్ని మాత్రమే రెరా పరిధిలోకి తెచ్చేలా వెసులుబాటును కల్పించింది. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కొందరు డెవలపర్లు అక్రమ పద్ధతుల్ని వదలిపెట్టడం లేదు. రెరా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా.. తక్కువ రేటంటూ.. అమాయకులైన కొనుగోలుదారులకు దొడ్డిదారిన ఫ్లాట్లను అంటగడుతున్నారు. యూడీఎస్‌ విధానంలో అక్రమంగా విక్రయిస్తున్నారు.


యూడీఎస్‌ అంటే ఏమిటనే సందేహం మనలో చాలామందికి కలగొచ్చు. దీన్ని ‘అన్‌డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ ల్యాండ్‌' విధానం అని కూడా అంటారు. అంటే, ఒక ప్రాజెక్టులో రెరా అనుమతి తీసుకున్న తర్వాత ఫ్లాట్‌ కొనడం బదులు.. రెరా అనుమతి రాక ముందే.. అసలు దాన్ని జోలికి వెళ్లకుండానే ఆయా ప్రాజెక్టులో స్థలాన్ని విక్రయించడం అన్నమాట. ఉదాహరణకు ఎకరం స్థలంలో ఒక బిల్డర్‌ 100 ఫ్లాట్లను కడుతున్నాడని అనుకుందాం. అందులో ఒక్కొక్కరికీ 48.40 గజాలు వస్తుంది. పెట్టుబడి పెట్టే వారికి నమ్మకం కలిగించడానికి ఈ స్థలాన్ని  రిజిస్ట్రేషన్‌ చేసిస్తున్నారు. ఇలా ఎందుకు అంటే? అపార్టుమెంట్‌ పూర్తయ్యాక డబుల్‌ బెడ్‌రూం ఫ్లాటు విలువ రూ.50 లక్షలుంటే, ఒకేసారి సొమ్ము చెల్లిస్తే.. ముప్పయ్‌కో, ముప్పయ్‌ ఐదు లక్షలకో ఫ్లాట్లను కొందరు బిల్డర్లు కేటాయిస్తున్నారు. కాకపోతే, ఆయా అపార్టుమెంట్‌ పూర్తి అవ్వడానికి మూడు నుంచి నాలుగేండ్లు పడుతుంది. ఇంకా, ఎక్కువే పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి చెల్లించే సొమ్ము మీద వడ్డీని లెక్కగట్టినా, మూడు లేదా నాలుగేండ్ల తర్వాత అంతే లెక్క తేలుతుంది. ఈ లాజిక్‌ను చాలామంది మర్చిపోయి.. వెనకా ముందు చూడకుండా.. తక్కువలో వస్తుంది కదా అని యూడీఎస్‌ విధానంలో స్థలాన్ని కొనుగోలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. 


రెండు సమస్యలు..

యూడీఎస్‌ విధానంలో ఫ్లాట్లను కొనేవారికి పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. తక్కువకు వస్తుందని స్థలం కొంటే.. ఆయా నిర్మాణంలో తక్షణమే భాగస్వామిగా మారిపోతారు. పొరపాటున డెవలపర్‌ సకాలంలో అపార్టుమెంటును పూర్తి చేయకపోతే, అందులో స్థలం కొన్నవారి మెడకు సమస్య చుట్టుకుంటుంది. ఉన్న సొమ్ము పోయి, ఫ్లాటు చేతికి రాక.. పక్కవాళ్లకూ ఫ్లాటు సకాలంలో చేతికి రాకపోతే, దానికీ బాధ్యత వహించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి, ఇలాంటి అక్రమ విధానంలో ఫ్లాట్లను కొనుగోలు చేసేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉత్తమం. పైగా, ఇలాంటి నిర్మాణాల్లో ఫ్లాట్లు కొనాలనుకుంటే, బ్యాంకులూ రుణాల్ని మంజూరు చేయవు. 


రెరా డెవలపర్లకు తలనొప్పి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని అధిక శాతం మంది బిల్డర్లు.. స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకుని, రెరా వద్ద రిజిస్టర్‌ చేసుకుని ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. రెరా అథారిటీ నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తున్నారు. అయితే, కొందరు యూడీఎస్‌ పద్ధతుల్లో ఫ్లాట్లను విక్రయిస్తూ రెరాకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా, రెరా బిల్డర్లకు పోటీగా నిలుస్తున్నారు. కొందరు కొనుగోలుదారులు ధర తక్కువ అని యూడీఎస్‌ విధానంలో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారే తప్ప.. అసలు ఫ్లాటు చేతికి వస్తుందా? లేదా? అనే అంశాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని రియల్‌ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా ప్రాజెక్టుల  భూములకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురైతే, లేనిపోని సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని అంటున్నారు. అందుకే, రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయడమే శ్రేయస్కరమని, యూడీఎస్‌ విధానం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. 


హైదరాబాద్‌లో కొందరు బిల్డర్లు సాగిస్తున్న ఈ అక్రమ తంతు వల్ల బడా డెవలపర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. కేవలం నివాస గృహాల్లోనే కాదు.. వాణిజ్య సముదాయాల్లో సైతం యూడీఎస్‌ విధానంలో అమాయక కొనుగోలుదారులకు స్థలాన్ని అంటగట్టేస్తున్నారు. తక్కువ రేటుకు మూడేండ్లలోపు ఫ్లాట్లను అందజేస్తామని నమ్మ బలుకుతూ బయ్యర్లను బుట్టలో వేసుకుంటున్నారు. అంతంత సొమ్ము పెట్టి, ఒకవేళ అందులో వాణిజ్య స్థలానికి గిరాకీ రాకపోయినా, లేక అద్దెలు తగ్గిపోయినా, అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, కొనుగోలుదారులు తమ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలంటే, రెరా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను ఎంచుకోవడం ఉత్తమం. 


logo