ఆదివారం 23 ఫిబ్రవరి 2020
భారత్‌ వైపు.. జపాన్‌ చూపు

భారత్‌ వైపు.. జపాన్‌ చూపు

Feb 14, 2020 , 22:48:42
PRINT
భారత్‌ వైపు.. జపాన్‌ చూపు

జపాన్‌ పెట్టుబడిదారులు, డెవలపర్లు భారత నిర్మాణ రంగంలో పెట్టుబడులను పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందడంతో ఇక్కడ పెట్టుబడులను పెట్టేందుకు జపనీస్‌ డెవలపర్లు అధిక ఆసక్తి చూపుతున్నారు. జపాన్‌కు చెందిన మిత్సుయ్‌ ఫడ్సన్‌, మిత్సుబుషి కార్పొరేషన్‌, సుమిటోమో కార్పొరేషన్‌, జెన్కాయ్‌ క్యాపిటల్‌ వంటి సంస్థలు భారత రియల్‌ రంగంపై దృష్టి సారిస్తుండటం విశేషం.

భారతదేశంలో వాణిజ్య, నివాస సముదాయాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అధిక అవకాశాలున్న విషయాన్ని జపాన్‌ సంస్థలు గుర్తించాయి. గత కొంతకాలం నుంచి ఇక్కడ రూపుదిద్దుకుంటున్న వాణిజ్య, ఐటీ, నివాస గృహాల్ని చూస్తే ఎవరికైనా ఇట్టే ముచ్చటేస్తుంది. అందుకే, జపాన్‌ మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నది. ఈ జాబితాలో జపాన్‌ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. 


జపనీస్‌ నైపుణ్యానికి తగినట్టుగానే భారతదేశంలోని వాణిజ్య స్థలాలు వృద్ధి చెందుతున్నాయి. ఈమధ్య జపాన్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ మిత్సుయ్‌ ఫడ్సన్‌, భారతదేశంలో ఆర్‌ఎంజెడ్‌ కార్పొరేషన్‌తో కలిసి ఒక బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్య ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిపా) ద్వారా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికిది దోహదపడింది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు లక్ష్యంగా చేసుకోవడంతో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి.


 వాస్తవానికి, భారత రియల్‌ రంగంలో తొలి పెట్టుబడిని మిత్సుబుషి కార్పొరేషన్‌, 2018లో చెన్నైలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌లో రూ.180 కోట్లను పెట్టింది. భారత రియల్‌ రంగంలో పారదర్శకత వల్ల ఇలాంటి  పెట్టుబడులు మరిన్ని వచ్చే అవకాశముంది. మరో కంపెనీ సుమిటోమో కార్ప్‌ గతేడాది అతిపెద్ద భూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మూడెకరాల స్థలాన్ని రూ. 2,238 కోట్లకు కొనుగోలు చేసింది. భారతీయ డెవలపర్లకు నిధుల్ని అందించడంలో జపనీస్‌ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అంచనా. 2020 సంవత్సరం రియల్‌ రంగానికి కీలకమని భారతీయ డెవలపర్లు చెబుతున్నారు. మొట్టమొదట సింగపూర్‌ సంస్థ నుంచి పెట్టుబడులు ప్రారంభమయ్యాయి. అనంతరం యూఎస్‌, యూరప్‌ నుంచి నిధులు వచ్చాయి. 2005 నుంచి 2008 మధ్య భారత రియల్‌ రంగం రూ.5.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అందుకున్నది.


logo