శనివారం 29 ఫిబ్రవరి 2020
క్రెడాయ్‌ ప్రాపర్టీ షో గ్రాండ్‌ సక్సెస్‌

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో గ్రాండ్‌ సక్సెస్‌

Feb 07, 2020 , 23:16:31
PRINT
క్రెడాయ్‌ ప్రాపర్టీ షో గ్రాండ్‌ సక్సెస్‌


జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు సంఘ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో ఐటీ, ఐటీఈఎస్‌, ఫార్మా వంటి రంగాలకు చెందిన సందర్శకులు అధిక సంఖ్య లో విచ్చేశారని క్రెడాయ్‌ ప్రతినిధులు అంటున్నారు. అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలను కొనడంపై అధిక ఆసక్తి చూపెట్టారని చెబుతున్నారు. దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్లలోపు బడ్జెట్‌లో విల్లాలు, ఫ్లాట్లను కొనాలనుకున్న వారే ఎక్కువగా ప్రాపర్టీ షోలకు విచ్చేస్తుంటారని క్రెడాయ్‌ అంచనా వేసింది. ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునేవారి శాతమూ ఎక్కువే ఉన్నది.

కొందరు కొనుగోలుదారులేం చేస్తుంటారంటే.. అప్పటికే బయట తాము కొనాలనుకున్న ఫ్లాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసినప్పటికీ, ఏదో ఒక రాయితీని ప్రకటించకపోతారా? అనే ఆలోచనతో ప్రాపర్టీ షోలకు విచ్చేసేవారూ ఎక్కువగా ఉంటారని క్రెడాయ్‌ అంచనా వేస్తున్నది. ధర విషయంలో భేరమాడటానికి అవకాశం ఉంటుందా? ఇంకాస్త మంచి లొకేషన్‌లో ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? మంచి సదుపాయాలు, మెరుగైన వసతులు వంటివి ఉపయోగంలో ఉన్నాయా? వంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఈ ప్రాపర్టీ షో చాలా ఉపయోగపడిందని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షోలో మూడు రోజుల కలిపి యాభై వేలకు పైగా సందర్శకులు విచ్చేశారు. ఒక్కో స్టాల్‌లో దాదాపు 1500 నుంచి 2000 మంది సందర్శకులు రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిసింది.

క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షోలో ఈసారి సందర్శకులకు ట్యాగ్‌ విధానాన్ని అమలు చేశారు. వచ్చేసారి మరో అడుగు ముందుకేసి ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని వాడుకోవాలన్న ఆలోచనలున్నాయని సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. దీని వల్ల సందర్శకుల విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నదని తెలిపారు.


logo