శనివారం 29 ఫిబ్రవరి 2020
అనుమతుల్లో ఆలస్యం ఉండదిక!

అనుమతుల్లో ఆలస్యం ఉండదిక!

Feb 07, 2020 , 23:10:58
PRINT
అనుమతుల్లో ఆలస్యం ఉండదిక!
  • క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ గుమ్మి రాంరెడ్డి

నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకుంటుందని.. కొత్త మున్సిపల్‌ చట్టం నిర్మాణ రంగానికి ప్రయోజనం కలుగుతుందని.. ప్రజలకు ఉపయోగపడుతుందని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ సీఎం కేసీఆర్‌ ఏకకాలంలో పరిష్కారం చూపెట్టారని ఆయన గుర్తు చేశారు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా 21 రోజుల్లో ఇంటి అనుమతిని మంజూరు చేసే విధానం దేశంలోనే ఇప్పటివరకూ లేదన్నారు. ఇది అమల్లోకి వచ్చాక, తెలంగాణ రాష్ట్రం అడుగుజాడల్లో ఇతర రాష్ర్టాలు పయనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, తెలంగాణ రియల్‌ రంగం స్థితిగతుల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. అనుమతులు సులభంగా లభిస్తే.. నిర్మాణ రంగానికి ప్రయోజనం కలగడంతో బాటు కొనుగోలుదారులకు తక్కువ రేటుకే ఫ్లాట్లు లభిస్తాయన్నారు. అవినీతికి పాల్పడితే ఉద్యోగుల్ని విధుల్లో నుంచి సస్పెండ్‌ చేయడం బదులు శాశ్వతంగా తొలగించేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరికలు జారీ చేశారని.. దీంతో అనుమతుల ఆలస్యం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు.

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశపర్చిందని, నిర్మాణ రంగాన్ని నీరుగార్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా నిర్మాణ సంస్థల నిధుల కొరతను పరిష్కరిస్తామోనని ఎదురు చూసినా.. పట్టించుకోలేదన్నారు. ఆలస్యమైన వాణిజ్య సముదాయాల కోసం రూపొందించిన ప్రాజెక్టు రుణాల ప్రారంభ తేదీని రిజర్వు బ్యాంక్‌ మరో ఏడాది దాకా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. మౌలిక సదుపాయలరహిత రంగానికిచ్చే రుణాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, దీని వల్ల కలిగే ప్రయోజనం గురించి తెలియాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు.

ఉపయోగపడని నిర్ణయాలు..

ఆదాయ పన్ను సెక్షన్‌ 43 సీఏ కింద ఎవరైనా ఒక ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే.. సేల్‌ డీడ్‌, ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్‌ విలువ మధ్య వ్యత్యాసం ఐదు శాతం కంటే ఎక్కువుంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ ఐదు శాతాన్ని కాస్త పది శాతానికి పెంచుతూ బడ్జెట్‌లో చిన్న మార్పు చేశారు. ఇదివరకే నమోదు చేసుకుని, అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు మరో ఏడాది వరకూ గడువును పెంచేశారు. అయితే, ఈ రెండు నిర్ణయాల వల్ల నిర్మాణ రంగానికి పెద్దగా ఉపయోగమేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్ప దేశంలోని ఇతర నగరాల్లో ఇండ్ల అమ్మకాలు పెద్దగా జరగడం లేదు. ఆయా నగరాల్లో మార్కెట్‌ సానుకూలంగా లేదు. ఈ క్రమంలో అమ్మకాల్ని పెంచడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు.


logo