గురువారం 04 జూన్ 2020
Realestate - Jan 18, 2020 , 00:49:29

దేశంలో ప్రప్రథమం.. టీఎస్‌-బీపాస్‌

దేశంలో ప్రప్రథమం.. టీఎస్‌-బీపాస్‌

అనుమతులన్నీ ఒకే చోట మంజూరు చేయాలని దాదాపు పది, పదిహేనేళ్ల నుంచి నగర నిర్మాణ రంగం కోరుతున్నది. ఫీజులు కట్టడం కష్టమేం కాదని, కాకపోతే అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నది. మన వద్ద మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని నిర్మాణ సంఘాలు గత కొన్నేండ్ల నుంచి సింగిల్‌ విండో విధానాన్ని ఆయా రాష్ర్టాల్లో అమల్లోకి తేవాలని కోరుతున్నాయి. కానీ, ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సానుకూలంగా స్పందించింది. టీఎస్‌ ఐపాస్‌ తరహాలో నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులిచ్చే ప్రక్రియకు టీఎస్‌-బీపాస్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. దీన్ని కొత్త మున్సిపల్‌ చట్టంలో పొందుపర్చింది. మరి, ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల నిర్మాణ సంస్థలేమంటున్నాయి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో.. వారి మాటల్లోనే..


విప్లవాత్మక నిర్ణయం

2020లో తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగానికి శుభవార్తను అందించింది. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. టీఎస్‌-బీపాస్‌ వల్ల అనుమతుల్లో పారదర్శకత పెరుగుతుంది. సకాలంలో అనుమతి లభిస్తే ప్రాజెక్టులు నిర్థారిత గడువులోపు పూర్తవుతాయి. ప్రాజెక్టు వ్యయం అదుపులో ఉంటుంది. అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది. డెవలపర్లు సైతం ఎక్కువ ప్రాజెక్టులను చేయడానికి వీలు కలుగుతుంది.
* నిబంధనల ప్రకారం, 21 రోజుల్లో అనుమతిని మంజూరు చేయకపోతే, మరుసటి రోజు నుంచి డీమ్డ్‌ అప్రూవల్‌గా భావించాల్సి ఉంటుంది. టీఎస్‌ బీపాస్‌ అనుమతి లభించాక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాల్ని మంజూరు చేయాలి. గతంలో కూడా డీమ్డ్‌ అప్రూవల్‌ విధానం ఉండింది. కాకపోతే, బ్యాంకులు రుణాల్ని మంజూరు చేసేవి కావు. ఇప్పుడలా కాకూడదంటే, టీఎస్‌-బీపాస్‌ కింద డీమ్డ్‌ అనుమతి తీసుకుంటే, బ్యాంకులు విరివిగా రుణాల్ని మంజూరు చేయాలి.

మేకా విజయసాయి, ఉపాధ్యక్షుడు, ట్రెడానిర్మాణ సంస్థలకు ఎంతో ఊరట

నిర్మాణాలకు సకాలంలో అనుమతులు లభించక తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చేది. మున్సిపల్‌ చట్టంలో భాగంగా, టీఎస్‌ బీపాస్‌ కింద 21 రోజుల్లో అనుమతిని మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇది దేశీయ నిర్మాణ రంగంలోనే సంచలనాత్మకమైన నిర్ణయం. దీని వల్ల ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశమే ఉండదు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఎన్వోసీలను తీసుకోవాలంటే వారి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక నుంచి, అలాంటి సమస్యలుండవు. అయితే, మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ఆరంభించినట్లే, హెచ్‌ఎండీఏలోనూ మొదలెడితే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ఎండీఏ పరిసరాల్లోనే రియల్‌ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, వీలైనంత త్వరగా టీఎస్‌ బీపాస్‌ను హెచ్‌ఎండీఏలోనూ అమల్లోకి తేవాలి.
- నరేంద్ర, ఎండీ, ప్రణీత్‌ గ్రూప్‌

ఫ్లాట్‌ ధర తగ్గుతుంది!

టీఎస్‌ బీపాస్‌ అమల్లోకి వచ్చాక వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరుగుతుంది. ప్రధానంగా, నిర్మాణ రంగంతో ముడపడి ఉన్న ప్రభుత్వ శాఖల మధ్య అత్యంత అవసరమైన విషయమిది. అనుమతుల్ని త్వరగా మంజూరు చేస్తే ముందుగా ప్రయోజనం కలిగేది ప్రభుత్వానికే. ఎందుకంటే, స్థానిక సంస్థలకు ఫీజుల రూపంలో ఊహించిన దానికంటే అధిక సొమ్ము వస్తుంది. ఆతర్వాత, నిర్మాణ పనులు జరిగే కొద్దీ భవన సామగ్రి కొంటాం కాబట్టి, జీఎస్టీ తప్పకుండా చెల్లించాల్సిందే. నిర్మాణాలు జరిగేటంత కాలమూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయి. అంతిమంగా, ఫ్లాట్లను కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు కాబట్టి స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సిందే. ఇలాంటి సానుకూల పరిణామాల వల్ల ఫ్లాట్ల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే, అనుమతి త్వరగా లభిస్తే.. వడ్డీ భారాన్ని డెవలపర్లు తప్పించుకోవచ్చు.
ఆదిత్యా గౌరా, ట్రెజరర్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌

ఇతర రాష్ట్రాలు మనల్ని అనుసరిస్తాయ్‌..

దేశంలోనే ప్రప్రథమంగా టీఎస్‌-బీపాస్‌కు రూపకల్పన చేసినందుకు ముఖ్యమంత్రికి, పురపాలక శాఖ మంత్రికి కృతజ్ఞతలు. ఇంతవరకూ ఎవరూ దీనిపై దృష్టి సారించలేదు. ఇప్పుడు, తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌కు శ్రీకారం చుట్టడంతో ఇతర రాష్ట్రాలూ మనల్ని అనుసరిస్తాయి. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు సాయం చేసినట్లే.. ఈ కొత్త విధానం రియల్‌ రంగం వృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ నిర్మాణ రంగానికిదో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఇక నుంచి ఈ రంగంలోకి ప్రొఫెషనలిజం ప్రవేశిస్తుంది. అనుమతులు, అమ్మకాలు, నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సమయమెంత అవుతుందో ప్రతిఒక్కరికీ పక్కాగా తెలుస్తుంది. దీంతో, విదేశీ పెట్టుబడిదారులు మన తెలంగాణలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. నిర్ణీత గడువు తెలిస్తే చాలు.. అధిక శాతం మంది మన రియల్‌ రంగంలో పెట్టుబడుల్ని పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశమున్నది.
- జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌


logo