మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 01, 2020 , 00:25:55

సెగ్రిగేషన్‌తో.. సేంద్రియ ఎరువులు

సెగ్రిగేషన్‌తో.. సేంద్రియ ఎరువులు

డంపింగ్‌యార్డుల వద్ద షెడ్ల ఏర్పాటు

గండిపేట, ఖానాపూర్‌లో కొనసాగుతున్న పనులు

మణికొండ:   పట్టణాలు, గ్రామాలను  పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్కార్‌ ముందుకు సాగుతుంది. దానిలో భాగంగా సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తడి, పొడి చెత్తను  వేరు చేసేందుకు అధికారులు ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు.  డంపింగ్‌ యార్డులతో పాటు సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి  నిధులు కేటాయించారు.  మణికొండ, నార్సింగి,వట్టినాగులపల్లిలో పనులు ఊపందుకున్నాయి. 

సెగ్రిగేషన్‌ షెడ్డులో రెండు నాడెపు కంపోస్టులు, ఆరు వాల్స్‌ ఉంటాయి.  ఇందుకోసం 2 నుంచి 10 గుంటల  స్థలం కేటాయిస్తారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట, ఖానాపూర్‌లో  ఏర్పాటు చేశారు. ఎనిమిది వాల్స్‌, నాలుగు నాడెపు కంపోస్టు, చెత్తను వేరు చేసే స్థలాన్ని గుర్తించారు. చెత్తను  వేరుచేసి వర్మీ కంపోస్టును తయారు చేస్తారు. తడి,పొడి చెత్తలను ఆరబెట్టడానికి డ్రైయింగ్‌ ప్లాంట్స్‌ను, స్టోర్‌ రూంలను కూడా ఏర్పాటు చేశారు.

డంపింగ్‌యార్డు వద్దే  షెడ్డు

డంపింగ్‌యార్డులతో పాటు తడి, పొడి చెత్తను వేరు చేసి  ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. గండిపేట, ఖానాపూర్‌లో  డంపింగ్‌యార్డు వద్దే సెగ్రిగేషన్‌ షెడ్డులను ఏర్పాటు చేసి ఎరువులను తయారు చేస్తున్నారు.  రైతులకు ఇక్కడి నుంచే పంటలకు అవసరమైన సేంద్రియ ఎరువులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటాం.       -శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, నార్సింగి

సేంద్రియ ఎరువు తయారీ విధానం

పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు మొదలైన వాటిని తడి చెత్త డబ్బాల్లో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్‌ తదితర వాటిని పొడిచెత్త డబ్బాల్లో వేయాలి. పొడి చెత్తను రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలిస్తారు. తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌లో మూడు నెలల పాటు నిల్వ ఉంచి ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తారు.