గురువారం 29 అక్టోబర్ 2020
Rangareddy - Sep 24, 2020 , 01:22:46

యాంత్రీకరణతో సాగు ఖర్చు తగ్గించొచ్చు

యాంత్రీకరణతో సాగు ఖర్చు తగ్గించొచ్చు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గోదాం నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి 

 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనితీరుపై సమీక్ష 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వ్యవసాయ యాంత్రీకరణ, గోదాం నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం రైతులకు అవసరమైన రుణాలను సమకూర్చాలని బ్యాంకు అధికారులను మంత్రి ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలపై దృష్టి సారించడం ద్వారా వ్యవసాయ పంట ఉత్పత్తుల్లో వృథాను అరికట్టడం, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలను ఆర్జించడానికి వీలవుతుందని అన్నారు. జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు మరిన్ని గోదాంలు అవసరమవుతాయని మంత్రి పేర్కొన్నారు. గోదాంలను నిర్మించేందుకు ప్రాథమిక సహకార సంఘాలకు అవసరమైన రుణాలను అందించేందుకు నాబార్డ్‌ సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించే వరకు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్లు సత్తయ్య, మధుకర్‌రెడ్డి, సీఈవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo