గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:46:12

అన్ని సదుపాయాలతో..

అన్ని  సదుపాయాలతో..

అధునాతనంగా షీ టాయిలెట్ల నిర్మాణం

లింగోజిగూడ డివిజన్‌ శాతవాహననగర్‌లో తొలి షీ టాయిలెట్‌ ప్రారంభం

దుస్తులు మార్చుకునేందుకు, బేబీ ఫీడింగ్‌కు గదులు ఏర్పాటు

దివ్యాంగులకు ర్యాంప్‌ సౌకర్యం 

టాయిలెట్స్‌ చుట్టూరా మొక్కల ఏర్పాటు

నిర్వాహకులు చిన్నపాటి వ్యాపారం చేసుకునేలా అవకాశం

ఎల్బీనగర్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రాంతాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దిన అధికారులు, పాలకవర్గం ప్రజలకు అధునాతన టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యారు. వారికోసం ప్రతి డివిజన్‌లో రెండేసి టాయిలెట్లను అధునాతన హంగులతో నిర్మించే పనిలో పడ్డారు. బేబీ ఫీడింగ్‌సెంటర్‌ ఏర్పాటుతోపాటు దివ్యాంగులకు అనుగుణంగా నిర్మించబోతున్నారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలోనే తొలి షీ టాయిలెట్‌ను ఎల్బీనగర్‌ సర్కిల్‌ లింగోజిగూడ శాతవాహననగర్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసి ఇటీవలే ప్రారంభించారు. మరో షీ టాయిలెట్‌ సాగర్‌ రింగ్‌రోడ్డులోని శ్రీనిలయం బస్‌స్టాప్‌ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సుమారు రూ. 9 లక్షల వ్యయంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో షీ టాయిలెట్‌ కంటైనర్లను ఏర్పాటు చేస్తున్నారు. షీ టాయిలెట్ల వద్ద పోకిరీలు, ఇతరుల ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 

మహిళా పొదుపు సంఘం వారిదే నిర్వహణ..

జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఏర్పాటు చేయాల్సిన షీ టాయిలెట్లు దాదాపుగా లూ కెఫేల మాదిరి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీనగర్‌ సర్కిల్‌ లింగోజిగూడ శాతవాహన నగర్‌ ఆర్చి వద్ద ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన తొలి షీ టాయిలెట్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఎల్బీనగర్‌ సర్కిల్‌కు చెందిన ఓ మహిళా పొదుపు సంఘం వీటి నిర్వహణను చూసుకోనున్నది. అయితే సదరు మహిళా గ్రూపు అందులోనే చిన్నపాటి వ్యాపారం చేసుకునేలా షెట్టర్‌ సౌకర్యం కల్పించారు. మహిళల మెటీరియల్స్‌, టీ, స్నాక్స్‌ అమ్మేందుకు అవకాశం కల్పించారు. నాప్‌కిన్స్‌, సబ్బులు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేపట్టారు. 

బేబీ ఫీడింగ్‌ సెంటర్‌తో పాటు

దివ్యాంగులకు అనుగుణంగా ఏర్పాటు

షీ టాయిలెట్స్‌లో బేబీ ఫీడింగ్‌ కోసం ఓ గదిని కేటాయిస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. టాయిలెట్‌ సౌకర్యం ఉచితంగానే అందిస్తున్నారు. 

దివ్యాంగ మహిళలకనుగుణంగా షీ టాయిలెట్లను నిర్మించారు. వారు లోనికి వెళ్లేందుకు ర్యాంప్‌ సౌకర్యం కల్పించారు. టాయిలెట్స్‌ చుట్టూరా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా మొక్కలు పెంచారు. 

అన్ని హంగులతో షీ టాయిలెట్లు  

జీహెచ్‌ఎంసీలో మహిళల కోసం షీ టాయిలెట్లు నిర్మిస్తున్నాం. జీహెచ్‌ఎంసీలోనే తొలిగా లింగోజిగూడ డివిజన్‌లోని శాతవాహననగర్‌ కమాన్‌ వద్ద ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేశాం. స్థానిక పొదుపు గ్రూపు మహిళలతోనే నిర్వహణ, ఉపాధి కింద అప్పగించాం. త్వరలోనే మరో షీ టాయిలెట్‌ నాగార్జునాసాగర్‌ రోడ్డులో శ్రీనిలయం వద్ద ఏర్పాటు చేస్తున్నాం. టాయిలెట్‌ సౌకర్యంతోపాటుగా బేబీ ఫీడింగ్‌ కోసం ఓ గది అందుబాటులో ఉంటుంది. 

- కొండూరి విజయకృష్ణ, ఉప కమిషనర్‌, 

ఎల్బీనగర్‌ సర్కిల్‌ 

తొలి షీ టాయిలెట్‌ మా డివిజన్‌లోనే..

జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా మహిళల కోసం అధునాతన టాయిలెట్లు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రతి డివిజన్‌లో రెండేసి షీ టాయిలెట్లు నిర్మించాలని నిర్ణయించాం. తొలి షీ టాయిలెట్‌ మా డివిజన్‌లో ప్రారంభమైంది. ఈ షీ టాయిలెట్లు మహిళల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 

- ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్‌, లింగోజిగూడ

చాలా సంతోషంగా ఉంది 

నగరంలో నిత్యం ప్రయాణించే మహిళలకు టాయిలెట్ల సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. మహిళల కోసమే ప్రత్యేకంగా అధునాతన హంగులతో షీ టాయిలెట్లు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. బేబీ ఫీడింగ్‌ సెంటర్‌తోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. దివ్యాంగులకు మరింత సౌకర్యంగా ఉంది. కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహకారంతో డివిజన్‌లో మరింత అభివృద్ధి జరుగుతున్నది. 

- పార్వతి (వార్డు మెంటర్‌, లింగోజిగూడ డివిజన్‌)