శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Jun 25, 2020 , 01:04:45

మొక్కలు నాటి సంరక్షించుకుందాం

మొక్కలు నాటి సంరక్షించుకుందాం

నేడు హరితహారం ప్రారంభం

పలు చోట్ల పాల్గొననున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి 

అందరూ భాగస్వాములు అయ్యేలా పక్కాగా ప్లాన్‌

నాటడానికి గుంతలు ఏర్పాటు  

మొక్కలను కాపాడేందుకు ట్రీ గార్డులు సిద్ధం

 మణికొండ/కందుకూరు/పహాడీషరీఫ్‌/బడంగ్‌పేట: మహేశ్వరం, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల పరిధిలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల పరిధిలో గురువారం హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుం ది. బడంగ్‌పేట మున్సిపల్‌ పరిధిలోని బాలాపూర్‌, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆర్‌సీఐ రోడ్డులో, కందుకూరు మండల పరిధిలోని లేమూరు ఫారెస్టు, తుక్కుగూడలో  విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు.నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ  తదితరులు పాల్గొంటారు. అలాగే  మహేశ్వరం మండలంలో  హరితహారాన్ని విజయవంతం చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో జానకీరెడ్డి బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ హరితహారంలో పాల్గొనే వారు తప్పని సరిగా భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. హరితహారం విజయవంతానికి అందరూ సహకరించాలని వారు కోరారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆరు లక్షల మొక్కలు నాటాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 60వేల మొక్కలు నాటడమే కాకుండా  నాటిన మొక్కలను కాపాడడానికి రూ.12.5లక్షలతో 3వేల  ట్రీ గార్డులను తయారు చేయించారు. హరితహారాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం, యువజన సంఘాల సభ్యులతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి గురువారం జరిగే హరిత యజ్ఞంలో వారంతా పాల్గొనే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పక్కాగా ప్లాన్‌ చేశారు.రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, శ్మశాన వాటికలు, ఆలయాలు, మహిళా భవనాల ఆవరణలు, ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలకు ఇరువైపులా,  ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటనున్నారు.