బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 14, 2020 , 00:44:50

నినదిస్తాం.. నిలదీస్తాం

నినదిస్తాం.. నిలదీస్తాం

రాష్ర్టానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్నిసభలో ఎండగడుతాం

111 జీవోపై త్వరలో సీఎంను కలుస్తా

చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్‌లో నినదిస్తామని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తించడాన్ని సభలో నిలదీస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌-కర్ణాటక (అప్పా వయా చేవెళ్ల-మొయినాబాద్‌) నేషనల్‌ హైవేను పూర్తి చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. సోమవారం  నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.

ఈ లోక్‌సభ సమావేశాల్లో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది ?

తెలంగాణకు నిధుల విడుదల, పథకాల అమలు, ఆర్థిక పరమైన ఆంక్షలపై కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిని నిలదీస్తాం. కొవిడ్‌ సంక్షోభ సమయంలో కూడా కేంద్రం ప్రదర్శిస్తున్న పక్షపాత వైఖరిని ఎండగడుతాం.

ఏఏ అంశాలు ప్రస్తావించనున్నారు?

దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చాం. అయినా ఎన్డీయే సర్కారు మాత్రం రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాకు గండి కొడుతున్నది. సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ   తదితర రూపాల్లో రాష్ట్రం నుంచి కేంద్రానికి అత్యధికంగా రూ.50 వేల కోట్లకు పైగా చేరుతున్నాయి. కానీ ప్రతిగా కేంద్రం నుంచి సగం నిధులు కూడా రాష్ట్ర ఖజానాకు చేరడం లేదు. రాష్ర్టానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను కూడా దారి మళ్లించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు ప్రత్యేక నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ చేసిన సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. గతంలో ఆర్థిక క్రమశిక్షణకు 7.5 శాతం వెయిటేజీ ఇచ్చి దానిని ఎకాఎకిన 2.5కు తగ్గించడం వల్ల రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగింది. ఈ అంశాలన్నింటిపైనా నిలదీస్తాం.

స్థానిక అంశాలపై ఒత్తిడి తెస్తారా?

మన్నెగూడ నుంచి వయా చేవెళ్ల, మొయినాబాద్‌ నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించాల్సిన నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై ఎన్నిసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సాకు చూపి నిర్మాణాన్ని ఆపివేయడంపై ప్రస్తావిస్తా.

111 జీవోపై ఆంక్షలు సడలించే అవకాశమున్నదా?

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 111 జీవో విషయంలో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తాను. ఆంక్షల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. ఇక్కడి రైతులు, స్థానికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది.