బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 31, 2020 , 01:17:00

పండించిన చోటే.. కూరగాయలు విక్రయం

పండించిన చోటే.. కూరగాయలు  విక్రయం

నేరుగా రైతుల నుంచే కూరగాయలు కొనుగోలు

తప్పిన దళారుల బెడద

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, కొనుగోలుదారులు

కరోనా వేళ..తప్పిన దళారుల బెడద.. మిగిలిన రవాణా ఖర్చులు..

 ఇటు అటు కొంచెం అన్నదాతలకు ఇబ్బందులు ఉన్నా..కొనుగోలు దారులు నేరుగా పొలాల దగ్గరికి వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో అటు రైతులకు కూడా మంచి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా..కొనుగోలు దారులు నేరుగా పొలం వద్దకే వచ్చి అందుబాటులో ఉన్న ధరలతో పాటు తాజా కూరగాయలు కొనుకున్నామన్న సంతృప్తి వారిలో ఉంది.

తుక్కుగూడ :  కరోనా నేపథ్యంలో మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి.  గతంలో కూరగాయలు కొనేందుకు  ఏ మార్కెట్‌కో వెళ్లాల్సి వచ్చేది.  కానీ నేడు పొలాల వద్దే విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ప్రధాన రహదారులు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పొలాల వద్దే కూరగాయల విక్రయాలు ప్రారంభించారు. టమాట, వంకాయ, కాకర, బీర ,బెండ, దోస, గోకరికాయతోపాటు ఆకు కూరలు పాలకూర, తోట కూర, కొత్తిమీర, పుదీనా తదితర కూరగాయలు  మార్కెట్లో కన్నా తక్కువ ధరకే అమ్ముతున్నారు. దీంతో  తాజా కూరగాయలు దొరుకుతున్నాయన్నారు. సమీప గ్రామాల వారే కాకుండా , ద్విచక్ర, కార్లపై వెళ్లేవారు కూడా కొనుగోలు చేస్తున్నారు. తుక్కుగూడ ప్రధాన రహదారి శ్రీశైలం హైవేకిరువైపులా ఆర్సీఐ గేటు నుంచి కందుకూర్‌ వరకు , పెద్ద అంబర్‌ పేట్‌ గేటు నుంచి వండర్‌లా వరకు మంఖాల్‌, రావిరాల రైతులు  తమ పొలాలకు సమీపంలోనే కూరగాయలను  విక్రయిస్తున్నారు. గిరాకీ బాగా అవుతుందని విక్రయదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో  వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత పెరిగిందని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. 

గిరాకీ బాగా అవుతుంది

 గతంలో కూరగాయలు సాగు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని మార్కెట్‌కు తరలించి దళారులు అడిగిన ధరలకే విక్రయించే వాళ్లం. తీవ్రంగా నష్టాలు వచ్చేవి.   కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పొలం వద్దేనే వ్యవసాయ పనులు చేసుకుంటూ, కూరగాయలను విక్రయిస్తున్నాం. గిరాకీ కూడా బాగా ఉంటుంది

                - బొందిలయ్య, రైతు, మంఖాల్‌