మంగళవారం 20 అక్టోబర్ 2020
Rangareddy - Sep 29, 2020 , 00:41:44

ప్రజలకు ఆస్తులపై హక్కులు కల్పిస్తాం..

ప్రజలకు ఆస్తులపై హక్కులు కల్పిస్తాం..

ప్రగతి భవన్‌లో మున్సిపాలిటీల వారీగా మంత్రి  కేటీఆర్‌ సమావేశం

రంగారెడ్డి/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పట్టణాల్లో  ప్రజలు తమ నివాసిత ఇండ్ల హక్కులపై దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా సర్కార్‌ నడుం బిగించింది. వివిధ కారణాలతో ప్రజలకు ఆస్తులపైన హక్కులు దక్కలేదని బాధ పడుతున్న వారికి సర్వహక్కులు కల్పించి భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ప్రజలు తమ నివాసిత ఇండ్ల హక్కులపైన ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పేరుకుపోయిన ఆపరిష్కృత సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇస్తామని, ప్రజల ఆస్తులపైన వారికి హక్కులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆనాదిగా ఉన్న పేదల ఇండ్ల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టడం శుభపరిణమమన్నారు. తరతరాలుగా పేద,మధ్య తరగతి ప్రజలు చాలా ప్రాంతాల్లో గూడు కోసం..కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌ నగర్‌, సిక్క్‌ శావని, మహేశ్వరం, జల్‌పల్లి తదితర ప్రాంతాల్లో ప్రజల సమస్యలను ఆమె వివరించగా, వీటిపై వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపడం వల్ల వేలాది మంది కుటుంబాల్లో వెలుగు నింపినట్లు అవుతుందని మంత్రి సబితారెడ్డి అభిప్రాయపడ్డారు. 


logo