శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jun 29, 2020 , 00:18:14

మేమున్నాం..

మేమున్నాం..

మానవీయ కథనానికి కదిలిన మనుసున్న మహరాజులు

పద్మ కుటుంబానికి నీడనిచ్చిన రెవెన్యూ అధికారులు 

ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేసిన మేయర్‌ 

‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన

బడంగ్‌పేట: మానవీయ కథనానికి మనసున్న మహరాజులు స్పందించారు. మానవత్వం బతికే ఉన్నదని నిరూపించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారు’.. అన్న కథనం ఎంతో మందిని కదిలించింది. ఐదురోజులుగా అన్న పానీయాలు లేక రోడ్డున పడ్డ కుటుంబానికి రెవెన్యూ అధికారులు గూడు కల్పించారు. మేమున్నామంటూ.. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ డి. శ్రీనివాస్‌రెడ్డి భరోసా కల్పించారు. ఆదివారం పద్మ కుటుంబ పరిస్థితిని చూసిన మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, రెవెన్యూ అధికారులు శ్రీనివాస్‌, ప్రేమలత, శంకర్‌, స్థానిక నాయకులు రమేశ్‌, మల్లారెడ్డి తదితరులు నిత్యావసర సరుకులు, పండ్లు అందజేశారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలోని ఓ బ్లాక్‌లో వారికి నివాసం ఏర్పాటు చేశారు. ఆ ఇంటికి కరెంటు, నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు సహకరించి వారికి అండగా నిలిచారు. 


భర్త అనారోగ్యంతో..

బాలాపూర్‌ మండలం బాలాజీనగర్‌లో ఉంటున్న వెంకటేశ్‌, పద్మ దంపతులు.  మూడు నెలల కిందట వెంకటేశ్‌ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భార్య ఉస్మానియా దవాఖానలో చేర్పించి, చికిత్స చేయించింది.  భార్యాభర్తలిద్దరూ దవాఖానలో ఉండటంతో.. వారి చిన్న పిల్లలు ముగ్గురూ ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని పద్మ వైద్యుల దృష్టికి తీసుకువెళ్లింది. వైద్యులు స్పందించి ఆర్థిక సహాయం చేశారు. దీంతో భర్తను  తీసుకొని బాలాజీనగర్‌కు వచ్చింది. సొంత కుంటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. అక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయంటూ పద్మ వాపోయింది.

ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు : పద్మ

ఎక్కడికి వెళ్లినా ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. కాయకష్టం చేసి పిల్లలను సాకుతున్నాను. ఇల్లు లేకపోవడంతో కుర్మల్‌గూడలో ఉన్న  బంగారు మైసమ్మ దేవాలయం దగ్గర తలదాచుకున్నాం. చాలా ఇబ్బంది పడ్డాం.  బాధను చూసిన  శ్రీనివాస్‌ రెడ్డి సార్‌ రూ. ఐదువేలు, భాస్కర్‌రెడ్డి రూ. రెండు వేలు ఇచ్చారు.  ఆ డబ్బుతోనే గిన్నెలు, స్టౌ కొనుకున్నాం. సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోము. 

కరోనా వచ్చిందని ఇబ్బంది పెట్టకండి

కరోనా అనుమానంతో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. భయపడి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దు. కరోనా వస్తే వైద్యుల సూచనలు పాటిస్తే చాలు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మానవత్వంతో ఆలోచన చేయం డి. పద్మ కుటుంబానికి అండగా ఉంటాం.  స్వీ య నియంత్రణ పాటిస్తే కరోనా పారిపోతుంది. 

  -చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మేయర్‌ 

వారి పిల్లలకు మంచి విద్యను అందిస్తాం 

కరోనా వచ్చిందన్న అనుమానంతో నిర్దాక్షిణ్యంగా ఎవరినీ వెల్లగొట్టవద్దు. అనుమానం ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలి. వెంకటేశ్‌, పద్మ కుటుంబాన్ని ఆదుకుంటాం. రెండు నెలలకు సరిపడా సరుకులిచ్చాం. వారి పిల్లలను రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చేర్పిస్తాం. ప్రసుత్తం వారిని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో ఉంచాం. వారికి కరెంటు, నీటి సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.           

         - డి. శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌