మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 01:05:50

కులవృత్తులకు అండగా ఉంటాం

కులవృత్తులకు అండగా ఉంటాం

ప్రతి గ్రామంలో రెండు వేల ఈత మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గౌడ వృత్తిదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి

చేవెళ్లలో ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం.. షాద్‌నగర్‌లో మినీస్టేడియం ప్రారంభం

నందిగామలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

మొయినాబాద్‌ /చేవెళ్ల రూరల్‌: కలుషిత కల్లుకు స్వప్తి చెప్పి.. ప్రజలకు స్వచ్ఛమైన కల్లు అందించాలని.. ఈత మొక్కలు విరివిగా నాటి ప్రజలకు నీరా అందించాలని, నీరా ప్రజలకు ఆరోగ్య సంజీవని అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ గ్రామ రెవెన్యూలో అబ్కారీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈత మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. వారు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం చేవెళ్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మద్యనిషేధం, అబ్కారీశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే  యాదయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ర్టాన్ని గుడుంబారహితంగా మార్చడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులకు పూర్తిగా ఆదరణ కరువైందని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కులవృత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. గౌడ వృత్తిదారులను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ప్రతి గ్రామంలోని ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేట్‌ భూముల్లో ఈత మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన కల్లు (నీరా) అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారని తెలిపారు. నీరా అందించడం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కనీసం 2వేల ఈత మొక్కలు నాటాలని ప్రభుత్వం భావించిందని అన్నారు. నీరా తాగడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్‌వ్యాధికి ఆరోగ్య సంజీవనిగా పని చేయడంతోపాటు షుగర్‌వ్యాధిని అదుపులో ఉంచుతుందని శాస్త్రవేత్తలు నిర్ధ్దారించారని పేర్కొన్నారు. ఆరోగ్యానికి దోహదపడే లక్షణాలు నీరాలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందన్నారు. నీరాలో మంచి పోషక విలువులు ఉంటాయని స్వయంగా మహాత్మాగాంధీ చెప్పడం జరిగిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం ఇచ్చే శాఖలకు కనీసం కార్యాలయాలు నిర్మించాలనే ఆలోచనలు అప్పటి ముఖ్యమంత్రులకు లేదని చెప్పారు. కానీ ఆ శాఖలకు నూతన భవనాలు నిర్మించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావించి లక్షల నిధులు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. 70 ఏండ్లలో నాటి ప్రభుత్వాలు ఒక్క ఈత చెట్టు కూడా నాటలేదని, ఉన్న చెట్లను నరికివేశారని చెప్పారు. గౌడలు ఈత మొక్కలు నాటుకునే విధంగా భూములు కేటాయించే విధంగా కృషి చేస్తామని, మొక్కలు నాటుకోవడానికి భూమి సమస్యలు ఉంటే మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, అందుకు నావంతు కృషి కూడా ఉంటుందని పేర్కొన్నారు. 

జిల్లా అభివృద్దికి చేవెళ్ల  కేంద్ర బిందువు : మంత్రి పి.సబితారెడ్డి

ఉమ్మడి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గంలో కొత్తగా అబ్కారీశాఖకు నూతన భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, జిల్లా అభివృద్ధికి చేవెళ్ల కేంద్ర బిందువు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం గౌడ సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నీరాను ప్రవేశపెట్టిందని చెప్పారు. తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్‌ కృషి చేసి స్వరాష్ట్రంను సాధించి తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చారని అన్నారు. అదేవిధంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండటానికి తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారని చెప్పారు. భూమి ఉన్న ప్రతి పట్టాదారుడు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి భరోసా కల్పించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అన్ని కూలాలను బేరీజు వేసుకుని ఏ కులానికి ఏం కావాలో ప్రవేశపెట్టి ఆ కులాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, కందాడ సర్పంచ్‌ అరుంధతి, చేవెళ్ల సర్పంచ్‌ శైలజరెడ్డి, ఎంపీటీసీలు రవీందర్‌, వసంతం, రాములు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శివనీల, అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషి, ఎస్పీ జనార్దన్‌రెడ్డి, తాసిల్దార్‌ షర్మిల, ఎంపీడీవో హరీశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, కార్యదర్శి పడాల ప్రభాకర్‌, యువజన విభాగం మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మొయినాబాద్‌ సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ యాదగిరి, మాజీ వైస్‌ చైర్మన్‌ నర్సిములు, గౌడ వృత్తిదారులు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు గోపాల్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌, సుధాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.