గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 19, 2020 , 00:28:10

జంటకు జల కళ

జంటకు జల కళ

వర్షాలతో పెరిగిన వరద ఉధృతి

హిమాయత్‌సాగర్‌ 1748, ఉస్మాన్‌సాగర్‌ 1761 అడుగుల వరకు చేరిక

మణికొండ/ హిమాయత్‌నగర్‌ : చారిత్రాత్మక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు ఎగువ ప్రాంతం నుంచి వరదలు ముంచెత్తుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు వికారాబాద్‌, శంకర్‌పల్లి, మొకిలా, బుల్కాపూర్‌ తదితర ప్రాంతాల మీదుగా వరద కాలువలు నిండుగా పారుతూ ఉస్మాన్‌సాగర్‌ జలాశయంలోకి పయనమయ్యాయి. నెలరోజుల క్రితం వరకు పూర్తిగా ఎండిపోయిన హిమాయత్‌సాగర్‌ జలశయం జలకళను సంతరించుకున్నది. వరుసగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ నిండుకుండలా మారనున్నది. ఈ నేపథ్యంలో హిమాయత్‌సాగర్‌ను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ జలాశయం నీటిమట్టం 1790 అడుగుల ఉండగా.. 29 అడుగుల వరకు వరద  వచ్చి చేరింది. 1761 అడుగుల వద్ద నీటి వరదలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. హిమాయత్‌సాగర్‌ నీటి మట్టం 1764 అడుగులు ఉండగా.. 1748 అడుగుల వరకు వరద చేరింది. జలాశయ నీటి మట్టం వరదల ఉధృతి సాగుతుందని, ఇలాగే వర్షాలు కురిస్తే జలాశయాల్లోకి నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని జలమండలిశాఖ డీజీఎంలు వెంకట్రావు, హరిశంకర్‌ తెలిపారు. వారు శుక్రవారం వరద నీటిని, గేట్లను పరిశీలించారు.