గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 11, 2020 , 01:33:58

గ్రామాలు పచ్చగా ఉండాలి

గ్రామాలు పచ్చగా ఉండాలి

కందుకూరు పర్యటనలో రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌

మొక్క నాటిన జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి 

కందుకూరు  : గ్రామాలు పచ్చగా ఉండాలని, హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలను నాటి వాటిని  రక్షించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ కోరారు. బుధవారం  సరస్వతిగూడ, అగర్‌మియగూడ, గపూర్‌నగర్‌ గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి  నర్సరీలు, శ్మశాన, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను పరిశీలించారు. సరస్వతిగూడలో శ్మశాన వాటిక నిర్మాణాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డులో తడి,పొడి చెత్తను వేర్వేరుగా వేసి కంపోస్టు ఎరువులను తయారు చేస్తున్నారా అని సర్పంచ్‌ రాము, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ విజేందర్‌రెడ్డిలను ప్రశ్నించారు. శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించకుండా వెదురు మొక్కలను నాటాలని సూచించారు. అగర్‌మియగూడలో శ్మశాన వాటికను  కొంత మంది కబ్జా చేస్తున్నారని  సర్పంచ్‌ భూపాల్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గపూర్‌నగర్‌లో మొక్కల పెంపకం సక్రమంగా లేదని మండిపడ్డారు. 

 నర్సరీల్లో పెద్ద ఎత్తున.. 

నర్సరీల్లో  పెద్ద ఎత్తున మొక్కలను పెంచాలని  కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ సూచించారు. గతేడాది హరితహారంలో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉందని, ప్రస్తుతం 70 శాతం మెరుగు పరుచుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇక మీదట వారంలో రెండు సార్లు ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ప్రజలకు సూచించారు. ఉపాధి   కూలీలకు జాబ్‌కార్డులను ఇచ్చి పనులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ ప్రశాంత్‌కుమార్‌, ఈఈ సురేశ్‌చంద్రారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, డీపీవో పద్మజారాణి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సురుసాని సురేందర్‌రెడ్డి,   సత్యనారాయణ, మండల కృష్ణ, డైరెక్టర్‌ పొట్టి ఆనంద్‌, కృష్ణాగౌడ్‌, ఎంపీటీసీలు మంచాల యాదయ్య, బొక్క జ్యోతినర్సింహారెడ్డి, సర్పంచ్‌లు రాము, ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, వసంతాకృష్ణగౌడ్‌, ఎంపీడీవో కృష్ణకుమారి, విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

మొక్క నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

బడంగ్‌పేట : ప్రతి ఇంట్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించ వలసిన అవసరం ఉందని రంగారెడ్డిజిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా టీకేఆర్‌ కళాశాలలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కేక్‌ కట్‌ చేసి తీగలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

హరితహారాన్ని విజయవంతం చేయాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం ద్వారా లక్షల మొక్కలు నాటించడమే  లక్ష్యంగా పెట్టుకున్నారని  జడ్పీ చైర్‌పర్సన్‌  అన్నారు. కరోనా నేపథ్యంలో  మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.  నిబంధనలు పాటించి కరోనా  నియంత్రణకు  సహకరించాలని కోరారు. సీజనల్‌ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి   ఆయన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తీగల అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీటీసీ కె.చంద్రయ్య, భవానీవెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, కర్రె కృష్ణ, మది కర్ణాకర్‌రెడ్డి, పెద్దబావి నాగనందీశ్వర్‌రెడ్డి, సాయి, సుధాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.