e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు రైతు చెంతకే సేవలు

రైతు చెంతకే సేవలు

  • అన్నదాతలకు అండగా నిలుస్తున్న మోమిన్‌పేట్‌లోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ
  • తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు
  • విత్తనాలు, కూరగాయల నారు, ఎరువులు సరఫరా
  • కూరగాయలు, పండ్లు కొనుగోలు
  • ఇటు రైతుకు, అటు సంస్థకూ లాభం
  • జాతీయ స్థాయిలో గుర్తింపు

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు వచ్చాయి. సాగు పనులు మొదలు పంట నూర్పిడి వరకూ యంత్రాల వినియోగం పెరిగింది. దీంతో త్వరితగతిన పనులు పూర్తి కావడంతో పాటు కూలీల కొరత తీరుతున్నది. ఇందులో భాగంగా సన్న, చిన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను అందజేస్తూ వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌లోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొండంత అండగా నిలుస్తున్నది. ట్రాక్టర్‌, కల్టివేటర్‌, బొలేరో వాహనం, కలుపు తీసే యంత్రాలు, ఎరువులు వేసే యంత్రం, నూర్పిడి యంత్రం, స్ప్రేయర్లు, పెద్ద నాగళ్లు తదితర పరికరాల కోసం ఫోన్‌ చేసి బుకింగ్‌ చేసుకుంటే చాలు పొలం వద్దకే పంపిస్తూ సేవలందిస్తున్నది. అంతేకాకుండా విత్తనాలు, కూరగాయల నార్లు, ఎరువులను అందజేయడంతో పాటు పండించిన కూరగాయలు, పండ్లను కొనుగోలు చేసి తోడ్పాటును అందిస్తున్నది. దీంతో ఇటు రైతుకు, అటు సంస్థకూ లాభం చేకూరుతున్నది. ఈ నేపథ్యంలో మహిళలు విజయవంతంగా నడిపిస్తున్న మోమిన్‌పేట్‌లోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గమనార్హం.

పరిగి, సెప్టెంబర్‌ 20: చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సాయం చేయడం కోసం ఏర్పాటు చేసిందే అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ. రైతులకు వివిధ రకాల సేవలు అందించడమే సంస్థ లక్ష్యం. తక్కువ ధరకు సాగు పరికరాలు అద్దెకు ఇవ్వడం, విత్తనాలు, కూరగాయల నార్లు, ఎరువులు అందజేయడం, కూరగాయలు, పండ్లు కొనడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు ఆ సంస్థ తోడ్పాటునందిస్తున్నది. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ద్వారా ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీల ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద మహిళలు విజయవంతంగా నడిపిస్తున్న వాటిలో దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు ఎంపిక చేశారు. అందులో వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి విలేజ్‌ లెవల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్‌కూ స్థానం దక్కింది.

- Advertisement -

1,468 మందితో కొనసాగుతున్న సంస్థ

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌లో అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థను 2019 సెప్టెంబర్‌ 6న స్థాపించారు. ఇందులో మోమిన్‌పేట్‌ మండలంలో ఉన్న 44 రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లోని 600 మంది మహిళా సభ్యులతో ఈ సంస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొత్తం 97 సంఘాల్లోని 1,468 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. మోమిన్‌పేట్‌ మండలంలో 83 సంఘాలు, మర్పల్లి మండలంలో 5 సంఘాలు, నవాబుపేట్‌ మండలంలో 9 సంఘాల సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరు రూ.600 మెంబర్‌షిప్‌ ఫీజు, షేర్‌ క్యాపిటల్‌ చెల్లించి సభ్యులుగా కొనసాగుతున్నారు. పది మంది బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లను ఎన్నుకుని, ప్రతినెలా 9వ తేదీన చైర్‌పర్సన్‌ అధ్యక్షతన సమావేశాలు నిర్వహిస్తారు. సంబంధిత నెలలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్నది నిర్ణయించి అమలు చేస్తారు.

తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలు

అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్‌ కంటే తక్కువ ధరకు వ్యవసాయ యంత్రాలు అద్దెకు ఇస్తారు. సీహెచ్‌సీలో కలుపు తీసే యంత్రం, విత్తనాలు, ఎరువులు వేసే యంత్రం, భూమి చదును చేసే యంత్రం, ట్రాక్టర్‌ స్ప్రేయర్‌, వివిధ పంటల నూర్పిడి, మిని ట్రాక్టర్‌, ట్రాలీ, పెద్ద ట్రాక్టర్‌ ట్రాలీ, విషెస్‌ బ్లేడ్‌, 7 నాగళ్లు, పెద్ద నాగళ్లు, బొలేరో వాహనం ఉన్నాయి. ఈ యంత్ర పరికరాలను మార్కెట్‌ ధర కంటే 10శాతం తక్కువ అద్దెకు సభ్యులకు ఇస్తారు. ఇందుకు ఒక నెల ముందు నుంచి ఆయా గ్రామాల్లోని సీసీల ద్వారా బుకింగ్‌ చేసుకుంటారు. సంబంధిత తేదీ కంటే ముందు రోజు సదరు రైతుకు ఫోన్‌ చేసి మీరు బుక్‌ చేసుకున్న యంత్రం మరుసటి రోజు ఫలానా సమయానికి వస్తుందని తెలుపుతారు. ముందుగానే సమాచారం అందడంతో ఆ రైతు సూచించిన వ్యవసాయ పనులు చేసుకోవడం సులభమవుతుంది. బుకింగ్‌ ఆధారంగానే వ్యవసాయ పరికరాలు పంపిస్తారు. ఈ పరికరాల కొనుగోలుకు సెర్ప్‌ రూ.27 లక్షలు గ్రాంటు ఇచ్చింది. రూ.10 లక్షలతో కలెక్టర్‌ షెడ్డు నిర్మించారు.

కూరగాయల నార్లు, ఎరువులు సరఫరా

ఈ సంస్థ ద్వారా తమ సభ్యులకు విత్తనాలు, కూరగాయల నార్లు కూడా మార్కెట్‌ కంటే 10శాతం వరకు తక్కువ ధరకు అందజేస్తారు. టమాట, క్యాలీఫ్లవర్‌, మిరప, వంకాయ తదితర విత్తనాలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చి నర్సరీలో పెంచేలా చర్యలు చేపట్టారు. విత్తనాలు వేసి మొక్కల పెంపకానికి ఒక మొక్కకు 20 పైసలు అందజేస్తారు. ఈసారి 2.97 లక్షల మొక్కలు పెంచేందుకు అవసరమైన సభ్యులకు సంస్థ అందజేయనున్నది. గతేడాది ఆగ్రా నుంచి ఆలుగడ్డ విత్తనాలు 880 బస్తాలు (ఒక బస్తా 50 కిలోలు) తెప్పించి రూ.2,200 క్వింటాలు చొప్పున రైతులకు అందజేశారు. విత్తన ఆలుగడ్డ ధరలో 50శాతం డబ్బులు రైతు చెల్లిస్తారు. గతేడాది రూ.17.63 లక్షలు వెచ్చించి ఆలుగడ్డ విత్తనాలు తీసుకొచ్చారు. ఇవి విక్రయించగా రూ.1.72 లక్షల లాభం వచ్చింది. విత్తనాలు, నార్లు అందజేయడమే కాకుండా కూరగాయలు, పండ్లు సైతం సంస్థ కొనుగోలు చేస్తుంది. క్యారెట్‌, కాకరకాయ, టమాట, వంకాయ, అల్లం, బీరకాయ, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్‌, మొక్కజొన్న (స్వీట్‌కాన్‌) 1,476 మెట్రిక్‌ టన్నులను రూ.1.81 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 70 మంది నుంచి 119 మెట్రిక్‌ టన్నుల ఆలుగడ్డ కొనుగోలు చేశా రు. రూ.1.14 కోట్లు విలువైన 97.61 మెట్రిక్‌ టన్నుల మామిడికాయలు కొనుగోలు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు 48 గంటల్లోపు డబ్బు చెల్లిస్తారు.

కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌…హైటెక్‌ నర్సరీ

ఈ సంస్థ లావాదేవీలు పెరుగుతున్నందున కూరగాయలు స్టాకు పెట్టడానికి కోల్డ్‌ స్టోరేజీ సెంటర్‌ మంజూరైంది. దీని నిర్మాణం కోసం ఇటీవల స్థలాన్ని పరిశీలించారు. సంస్థలోని ఒక సభ్యురాలితో హైటెక్‌ నర్సరీ ఏర్పాటు చేస్తున్నారు. సంస్థ తరఫున రైతు సేవా కార్డు తయారుచేశారు. ఇందులో రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. భవిష్యత్తులో సంస్థకు వచ్చే లాభాలు సభ్యులకు బోనస్‌గా ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉంది.

సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు

వికారాబాద్‌ రైతు ఉత్పత్తిదారుల సంస్థతో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఒకదాంట్లో స్వల్పంగా లాభాలు వచ్చినా, మరోసారి అధిక లాభాలు రావడంతో సంస్థ మనుగడ కొనసాగుతున్నది. ఈ సంస్థను ఆశ్రయిస్తే అన్ని రకాల వ్యవసాయ సేవలు అందుతాయనే నమ్మకం ఏర్పడేలా సంస్థలోని సభ్యులం పనిచేన్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల అమలుకు త్వరలోనే రూపకల్పన చేయనున్నాం.

  • డి.శివయ్య, ఏపీఎం(సాల్‌)

రైతులకు మేలు చేసే పనులకే ప్రాధాన్యం

సీహెచ్‌సీతో చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూర్చే పనులు చేపడుతున్నాం. విత్తనాల సరఫరా నుంచి ఉత్పత్తుల కొనుగోలు వరకు రైతులకు సంస్థ అండగా నిలుస్తున్నది. రెండేండ్లలో పలు కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ప్రాంతంలో రైతులకు అనే క రకాల సేవలు అందజేస్తున్నాం. వ్యవసాయ పరికరాలు, యంత్రాలు తక్కువ అద్దెకు అందజేస్తుండడంతో రైతులకు మేలు జరుగుతున్నది. ఈ సంస్థ మనది అనే భావన రైతుల్లో ఏర్పడుతున్నది.

  • మీనాక్షి, సీఈవో, ఏఎఫ్‌పీసీ

రైతులకు సేవలందించేందుకే..

రైతులకు సేవలందించడానికి సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వ్యవసాయ, ఉద్యానవన అధికారుల సూచనలు, సలహాలు, సెర్ప్‌ అధికారుల సమన్వయంతో సంస్థ మరింత పురోభివృద్ధి సాధిస్తున్నది. సంస్థలోని ప్రతి రైతుకు ఆర్థికంగా లాభం చేకూరేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. సంస్థ ద్వారా చేపట్టిన పనులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం సంతోషం. ప్రభుత్వ సహకారంతోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం.

  • కొత్తగడి లక్ష్మీ, చైర్‌పర్సన్‌, ఏఎఫ్‌పీసీ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement