e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home రంగారెడ్డి ప్రగతికి కేరాఫ్ కెరెళ్లి..

ప్రగతికి కేరాఫ్ కెరెళ్లి..

ప్రగతికి కేరాఫ్ కెరెళ్లి..
  • నిత్యం పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
  • రూ.1.50 కోట్లతో సీసీ రోడ్లు, పల్లెంతా అండర్‌ డ్రైనేజీ నిర్మాణం
  • వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు,రైతువేదిక, పల్లె ప్రకృతి వనం నిర్మాణం
  • ‘మన ఊరు బాగు’ కోసం దాతలు ముందుకు..
  • రూ.4లకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌
  • ప్రతి నెలా రూ.3 లక్షలకుపైగా ప్రభుత్వ నిధులు
  • ‘పల్లె ప్రగతి’తో అద్భుతంగా మారిన పల్లె
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

వికారాబాద్‌, జూలై 13, (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు గ్రామమంతా బురదమయం.. దోమలు, పందులు, తేళ్లు, పాములు సంచరించేవి.. తాగునీటికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కెరెళ్లి గ్రామం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించడంతో పాటు విద్యుత్‌ దీపాలను వేశారు. గ్రామ సర్పంచ్‌ కొత్తపల్లి నర్సింహారెడ్డి ఇక్రిశాట్‌లో సీనియర్‌ రిసోర్స్‌ మేనేజర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. గ్రామంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను నిర్మించారు. ప్రభుత్వ నిధులకు తోడుగా దాతలు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి సాధ్యమైంది. గ్రామానికి చెందిన దాదాపు 300 మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. 50 మందికి పైగా టీచర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరంతా ‘మన ఊరు బాగు’ కోసం ముందుకొచ్చారు. గ్రామస్తుల కోసం 1000 లీటర్ల సామర్థ్యం గల మినరల్‌ వాటర్‌ ట్యాంక్‌, పాఠశాల విద్యార్థులకు 100 లీటర్ల మినరల్‌ వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. ఏటీఎం కార్డు మాదిరిగా స్వైప్‌ చేస్తే రూ.4లకే 20 లీటర్ల వాటర్‌ వస్తుంది. 24/7 మినరల్‌ వాటర్‌ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌ గ్రూప్‌లను సర్పంచ్‌ క్రియేట్‌ చేసి అభివృద్ధి కోసం చర్చించుకోవడానికి వేదికగా మార్చుకున్నారు. గ్రామంలో కంది, పత్తి, చామంతి, పసుపు, జొన్నలు, కూరగాయాల పంటల సాగు చేస్తారు. గ్రామ ఖాళీ స్థలాల్లో రైతు బజారు ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.

పల్లె ప్రగతితో అభివృద్ధిలో ముందుకు..
పల్లె ప్రగతితో కెరెళ్లి గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నది. సర్పంచ్‌ కొత్తపల్లి నర్సింహారెడ్డి ప్రత్యేక చొరవతో పాటు ఆయనకున్న విజన్‌తో అభివృద్ధిలో తన ముద్రను వేసుకుంటున్నారు. రెండేండ్లలోనే ప్రగతి పనులను పూర్తి చేసి సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజా ప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యులు, గ్రామస్తులతో పాటు అధికారులు ఉత్సాహంగా అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను చేపడుతున్నారు. గ్రామ ముఖద్వారం నుంచే రోడ్డుకు ఇరువైపులా పచ్చని హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతాయి. గ్రామ వీధుల్లో రూ.1.50 కోట్లతో అద్దం మెరిసే సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను నిర్మించారు. రాత్రి వేళల్లో జిగేలుమనే విద్యుత్‌ దీపాలతో కెరెళ్లి కొత్త శోభను సంతరించుకున్నది. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పంచాయతీ భవనాన్ని తీర్చిదిద్దారు. డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టు షెడ్డు, రైతు వేదిక, మిషన్‌భగీరథతో ఇంటింటికీ తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను నిర్మించారు. రూ.11.86 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించగా, రూ.2.5 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు. పంట ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కల్లాలను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా పంచాయతీకి రూ.3లక్షలకు పైగా ప్రభుత్వ నిధులు మంజూరవుతున్నాయి.

- Advertisement -

ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు..
గ్రామంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు, గతంలో మంచినీటి కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవారు.. మంచినీళ్లు కావాలంటే పంట పొలాల నుంచి తెచ్చుకునే వారు, గత మూడు సంవత్సరాల నుంచి మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామంలోనే నూతనంగా ట్యాంక్‌ నిర్మాణం చేపట్టి స్వచ్చమైన తాగునీటిని అందిస్తున్నారు.

వినియోగంలోకి రైతు వేదిక..
రైతుల సమస్యలు పరిష్కరించేందుకు క్లస్టర్‌ స్థాయిలో మూడు, నాలుగు గ్రామాలను చేర్చి రైతు వేదికను ఏర్పాటు చేశారు. కెరెళ్లి క్లస్టర్‌ పరిధిలో కెరెళ్లి, ఎబ్బనూర్‌, అల్లీపూర్‌, హరిదాస్‌పల్లి, చింతకుంట గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రైతు వేదిక వినియోగంలోకి రాగా, వ్యవసాయ శాఖ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు చేస్తున్నారు.

ఇంటింటికీ తులసి మొక్కలు పంపిణీ…
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తులసి మొక్కలను పంపిణీ చేశారు. అనుబంధ గ్రామాలు కొండాపూర్‌ఖుర్దు, బాచారంలోనూ తులసి మొక్కలను అందజేశారు.

దాతల పూర్తి సహకారం..
గ్రామాభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారు. గ్రామంలో స్ట్రీట్‌ లైట్‌ నుంచి మొదలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. కెరెళ్లి గ్రామంలో ట్రీ గార్డు, ప్లాస్టిక్‌ బుట్టలను దాతలు అందించారు. హనుమాన్‌ టెంపుల్‌కు సైతం దాతలు గ్రానైట్‌, ఫ్లోరింగ్‌ డోర్స్‌, గ్రిల్స్‌ నిర్మాణానికి సహకరించారు. రూ.20 లక్షలకు పైగా గుడి పునఃనిర్మాణం కోసం అందించారు.

వాట్సాప్‌ గ్రూప్‌లివే..
పచ్చదనం, పారిశుధ్యం, జీపీ ఆఫీస్‌, అగ్రికల్చర్‌, ఎడ్యుకేషన్‌, వాటర్‌ సప్లయ్‌, ఉపాధి హామీ, టెంపుల్స్‌, స్కీమ్స్‌, డ్రైనేజీ లైన్స్‌, రైతు వేదిక, స్ట్రీట్‌ లైట్లు, హెల్త్‌, మరుగుదొడ్లు, మీటింగ్స్‌, నేషనల్‌ పెస్టివల్స్‌, సైన్‌టిస్ట్‌ తదితర గ్రూప్‌లను రన్‌ చేస్తున్నారు. గ్రామంలో ఉత్తమ రైతు అవార్డులనూ అందజేస్తున్నారు. కంది సాగులో ఉత్తమ రైతు అవార్డు రూ.11వేలు, ఉత్తమ వార్డు సభ్యుల అవార్డు, వ్యవసాయ పొలాల దగ్గరకు ఫీల్డ్‌విజిట్‌ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

1965లోనే ఉత్తమ పంచాయతీగా కెరెళ్లి..
1965 సంవత్సరంలోనే కెరెళ్లి గ్రామం ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నది. రూ.15వేలను నగదు పురస్కారం రావడంతో అప్పటి సర్పంచ్‌ కొత్తపల్లి గాల్‌రెడ్డి గ్రామానికి విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా నమోదు చేసుకున్నది. ఆ తర్వాత రెండో సారి సైతం 1966లో కూడా రూ.15వేల అవార్డు రావడంతో గ్రామంలో వాటర్‌ సప్లయ్‌ ఏర్పాటు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రగతికి కేరాఫ్ కెరెళ్లి..
ప్రగతికి కేరాఫ్ కెరెళ్లి..
ప్రగతికి కేరాఫ్ కెరెళ్లి..

ట్రెండింగ్‌

Advertisement