శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 06, 2020 , 00:44:51

వేదం.. అణువణువున నాదం

వేదం.. అణువణువున నాదం

సనాతన ధర్మం.. సంస్కృతి పదిలమిక్కడ..

కులమతాలకతీతంగా వేదాంత విద్యా గురుకులం

శ్రీరామనగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయం

శంషాబాద్‌: క్రమక్రమంగా తరిగిపోతున్న సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సనాతన ధర్మం, వేద విజ్ఞానాన్ని పెంచేందుకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం చినజీయర్‌ స్వామి ఆశ్రమం నడుం బిగించింది. ఇందులోభాగంగా వివిధ ప్రాంతాల్లో వేద పాఠశాలలు నెలకొల్పి బోధన, ఉచిత వసతి అందిస్తున్నది. వేదాలతో పాటు ఆగమ శాస్ర్తాలు నేర్పుతూ సమాజానికి అవసరమైన వేదపండితులను తయారు చేస్తున్నది. వేదవాజ్ఞయ పరిరక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తి చేయడంతో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌లోని వేద విశ్వవిద్యాలయంపై ప్రత్యేక కథనం..

శ్రీరామనగరంలో..

ప్రతి పౌరుడు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడితే.. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు దేశం సుభిక్షంగా ఉంటుందన్న సదుద్దేశంతో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి జీవా గురుకులాన్ని నెలకొల్పారు. పెద్ద జీయర్‌ స్వామి శతాబ్ది చిహ్నంగా 2009 జూన్‌ 9న శ్రీరామనగరంలో జీయర్‌ ఇంటిగ్రేటెడ్‌ అకాడమీని (జీవా) స్థాపించారు. వేదంలోని విజ్ఞానాన్ని ప్రతిఒక్కరికీ అందించాలన్నది స్వామిజీ ఆశయం. అవగాహనారాహిత్యంతో వేదం అంటే నాటు మంత్రాలు చదవడం, నాలుగు డబ్బులు సంపాదించడం అనుకునే వారు చాలా మంది ప్రస్తుత సమాజంలో ఉన్నారు. అందుకు భిన్నంగా సమస్త జగత్తు, సృష్టి, స్థితి రహస్యాలను ఇముడ్చుకున్న విజ్ఞాన భాండాగారం వేదమని తెలియజేయాలని సంకల్పించుకొని విద్యార్థులకు చతుర్వేదాలను నేర్పిస్తున్నారు.

పటిష్ట శిక్షణ.. 

జీవాలో బోధన నియమ నిష్టలతో సాగుతుంది. ప్రతి సంవత్సరం అన్ని వర్గాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. కనిష్ట వయో పరిమితి 8 ఏండ్లు. ప్రస్తుతం 215 మంది విద్యార్థులు ఉన్నారు. మన రాష్ట్రంతో పాటు  కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఇక్కడ ఉన్నారు. 12 ఏండ్ల పాటు వేద విద్యను అభ్యసిస్తారు. ప్రవేశం పొందిన మొదటి రెండేండ్లు ఫౌండేషన్‌ తరగతులు ఉంటాయి. ఆ తర్వాత జ్యోతిష్యం, శాస్త్రం, వ్యాకరణం, చతుర్వేదాలను బోధిస్తారు. వేద విద్యతో పాటు ఆలయాల్లో క్రతువులు చేయడం నేర్పిస్తారు. ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించి స్థాయిని నిర్ధారిస్తారు. స్టేట్‌ సిలబస్‌ను కూడా బోధిస్తారు. ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు వేద పండితులు దేశ, విదేశాలలో ఉన్నారు. ప్రధాన ఆలయాల్లో అర్చకులుగా పని చేస్తున్నారు. 

వేకువ జామున వేదఘోషతో..

వేకువజామునే వేదఘోషతో శ్రీరామనగరం మార్మోగుతుంది. బుడిబుడి అడుగులతో అమ్మఒడిలో ఉండాల్సిన చిన్నారులు చలి, వాన లెక్క చేయరు.  నాలుగు గంటలకే దినచర్య ప్రారంభిస్తారు. ఐదు గంటల వరకు యోగా, వ్యాయామం చేస్తారు. అనంతరం కాలకృత్యాలు తీర్చుకొని ఉదయం ఎనిమిది గంటలకు తరగతులకు హాజరవుతారు. సాయంత్రం క్రీడలు, పారాయణాలు, పఠనం, సాయం సంధ్యావందనాలు, రాత్రి 9 గంటలకు భోజనంతో దినచర్య ముగుస్తుంది. కఠోర సాధన.. నిష్ణాతులైన ఆచార్యుల శిక్షణలో విద్యార్థులు సంస్కృత, వేదవాజ్ఞయం, ధార్మిక సేవలో తమకు తామే సాటని నిరూపించుకుంటున్నారు.

సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా ..

భారతీయ వేద వాజ్ఞయ, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే జీవా గురుకుల ధ్యేయం. వేదాల సారాన్ని అనుసరిస్తే జీవన విధానంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనే మనోైస్థెర్యం, సామరస్య ధోరణి అలవడుతాయి. అనుభవజ్ఞులైన పండితుల మార్గదర్శనంలో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

- త్రిదండి చినజీయర్‌ స్వామి

వేదవాజ్ఞయ పరిరక్షణలో

మా వంతు సహకారం..

చినజీయర్‌ స్వామి సత్సంకల్పంలో అత్యుత్తమమైనది వేదవాజ్ఞయ పరిరక్షణ. వారి సంకల్పానికి మా వంతు సహకారం అందించే భాగ్యం లభించడం పూర్వ జన్మ సుకృతం. జీవా అకాడమీలో ఎందరో వేదపండితులు తయారు అవుతున్నారు.

- రామేశ్వరరావు, మైహోం కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అధినేత

విశ్వవిఖ్యాతం.. 

కేవలం వేదవాజ్ఞయ బోధనే కాకుండా ఇక్కడ దేశ, విదేశాల్లోని వేదపండితులతో సదస్సులు నిర్వహిస్తున్నారు. వేదవిశ్వవిద్యాలయం భవిష్యత్‌ తరాలకు ఉజ్జల భవిష్యత్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు. గురుకుల ఖ్యాతి విశ్వవ్యాప్తం.

- జగపతిరావు, మైహోం ఎండీ