ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 23:29:10

ఫార్మా బస్సు అతివేగానికి ఇద్దరు కూలీలు బలి

ఫార్మా బస్సు అతివేగానికి ఇద్దరు కూలీలు బలి

బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తుండగా ఢీకొన్న బస్సు

ఘటనా స్థలంలోనే దంపతులు మృతి

కండ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన కూతురు

బండ్లగూడ : ఓ ఫార్మా బస్సు ఇద్దరు కూలీలను బలితీసుకున్నది. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన పనులు చేస్తున్న దంపతులను బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో వారు అక్కడి కక్కడే మృతి చెందారు. తన కండ్ల ముందే తల్లిదండ్రులు చనిపో వడంతో కూతురు రోదనలు మిన్నంటాయి.  ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై సమరంరెడ్డి వివరాల ప్రకారం ... మహబూబ్‌నగర్‌ జిల్లా, అడ్డకల్‌ మం డలం, రాచర్ల గ్రామానికి చెందిన శేఖర్‌(45), శాంతమ్మ (40) దంపతులు నగరానికి వలస వచ్చి శంషాబాద్‌ హుడాకాలనీలో నివాసం ఉంటూ... ఆరాంఘర్‌లో జరుగుతున్న ఫ్లైఓవర్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నారు. వారికి కూతురు శిరీష ఉంది. సోమవారం బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా  తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు ముందు కూతురుతో కలిసి దంపతులు రోడ్డు పక్కన పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఎంఎస్‌ఎన్‌ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు (టీఎస్‌ 07యూహెచ్‌ 2166) అతివేగంగా వచ్చి ఆ దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటన కూతురు శిరీష కండ్ల ముందు జరగడంతో ఆమె రోదనలు స్థానికులను కలచి వేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.