సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:51:52

ట్రంక్‌లైన్‌ పనుల్లో జాప్యాన్ని సహించం

ట్రంక్‌లైన్‌ పనుల్లో జాప్యాన్ని సహించం

ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ట్రంక్‌లైన్‌ లింక్‌ను పొడిగించాలి

అధికారుల, ప్రజాప్రతినిధుల సమీక్షలోమంత్రి సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట: ట్రంక్‌లైన్‌ పనులు పూర్తయితేనే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పనుల్లో వేగం పెంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్‌పేట మున్సిపల్‌ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. అనంతరం ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ అధికారులు, మేయర్‌, కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ట్రంక్‌లైన్‌ను ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో అని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులతో చర్చించారు. పై నుంచి వస్తున్న వరదనీరు కాలనీల్లోకి చేరకుండా నేరుగా ట్రంక్‌లైన్‌ ద్వారా బయటకు వెళ్లే విధంగా ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు తయారు చేసిన ట్రంక్‌లైన్‌ మ్యాప్‌ డిజైన్‌ను మార్చి పొడిగించాలన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా కాలనీలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. అధికారులు,క్రాంటాక్టర్లు మాటలు చెప్పకుండా పనులు చేసి చూపించాలన్నారు. ట్రంక్‌లైన్‌ పనులకు ఎలాంటి ఆటంకాలు కలిగినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ట్రంక్‌లైన్‌ పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో మీర్‌పేట మేయర్‌ దుర్గాదీప్‌లాల్‌ చౌహన్‌, బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, డిఫ్యూటీ మేయర్‌ విక్రంరెడ్డి, ఇబ్రంశేఖర్‌, కార్పొరేటర్లు లావణ్య బీరప్ప, రామంద్రం, రాజేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బీరప్ప, మాధవిసాయినాథ్‌రెడ్డి, కమిషనర్‌ సుమన్‌రావు, హెచ్‌ఎండీఏ సీఈఓ బీ.ఎల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మీన, వెంకట్‌రెడ్డి, కామేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.