శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rangareddy - Sep 19, 2020 , 00:31:17

చేనేతకు ఈ మార్కెటింగ్‌

చేనేతకు ఈ మార్కెటింగ్‌

‘జెమ్‌'లో నమోదుకు అవకాశం ఇచ్చిన కేంద్రం 

కొవిడ్‌ వేళ నేతన్నలను ఆదుకునే యత్నం 

హైదరాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏడీ ఆఫీసు ఏర్పాటు.. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: కరోనా కారణంగా చేనేత రంగం ఆరు నెలలుగా తీవ్ర సంక్షోభంలో పడింది. తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. చేనేత ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఈ-మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించాయి. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులకు ఆదేశాలు రావడంతో కార్మికుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

నాలుగు జిల్లాల పరిధిలో ..

నాలుగు (రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, మేడ్చల్‌) జిల్లాల పరిధిలో దాదాపుగా 600 జియోట్యాగ్‌ మగ్గాలు ఉన్నాయి. మగ్గాలనే నమ్ముకుని 600లకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మార్చిలో కొవిడ్‌-19 కారణంగా చేనేత రంగం పూర్తిగా స్తంభించిపోయింది. వస్త్ర దుకాణాలు మూతపడటం, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో ..కార్మికులు తయారు చేసిన పట్టు, కాటన్‌, సీడో, జరీ చీరలు, టవళ్లు, దుప్పట్లు తదితర లక్షల రూపాయల విలువ చేసే వస్ర్తాల నిల్వలు పేరుకుపోయాయి. కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా అల్లాడుతున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియతో మిగతా రంగాలు మెల్లగా కుదుటపడుతున్నప్పటికీ, చేనేత రంగం కోలుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ-మార్కెటింగ్‌ అవకాశంతో కొంత మేర ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 500, వికారాబాద్‌ పరిధిలో 10, హైదరాబాద్‌ పరిధిలో 50, మేడ్చల్‌ పరిధిలో 30 చేనేత, జౌళి శాఖ జియో ట్యాగ్‌లు కలిగి ఉన్నాయి. వీటిపై 600 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 

ఈ-కామర్స్‌ మాదిరిగా..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలాగే కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ ప్లేస్‌ (జెమ్‌)పేరుతో యాప్‌తో పాటు జీఈఎం.జీవోవీ.ఇన్‌ పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.ఇందులో వివిధ సంస్థలు నమోదు చేసుకుని తమ ఉత్పత్తుల (బ్రాండ్ల)ను అమ్ముకోవచ్చు. ప్రభుత్వ సంస్థలు అవసరమైన వస్తువులను ఎక్కువగా ఈ యాప్‌ ద్వారానే కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో చేనేతకు కూడా అవకాశం కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన చేనేత సర్వీస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో వివిధ డిజైన్లతో నేసిన చీరలను పొందు పరుస్తే సంస్థలు, పెద్ద వస్ర్త దుకాణాల వారితో  పాటు ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంది. జియో ట్యాగ్‌ నంబర్‌, అడ్రస్‌, తయారు చేసే చీరల వివరాలు జిల్లా చేనేత జౌళిశాఖ కార్యాలయంలో లేకపోతే సంబంధిత  అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని చేనేత సర్వీస్‌ సెంటర్‌కు సిఫార్సు చేస్తారు. వారు అందులో పూర్తి వివరాలు నమోదు చేసి  కార్మికుడికి ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేస్తారు. 

2016లో జిల్లాల విభజన సమయంలో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల జౌళిశాఖ మహబూబ్‌నగర్‌ పరిధిలోకి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలు సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. అయితే ఇటీవల మళ్లీ పాత జిల్లాల ప్రకారం చేనేత, జౌళి శాఖను విడగొట్టి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలను కలిపారు.  హైదరాబాద్‌ జిల్లా కేంద్రంగా రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలను కలిపి నూతనంగా సహాయ సంచాలకుల (జిల్లా ఏడీ) కార్యాలయాన్ని  ఏర్పాటు చేశారు. 


కార్మికుల కష్టాలు తీర్చడానికే... 

రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌,వికారాబాద్‌ జిల్లాల్లోని చేనేత కార్మికులు, కళాకారులు ఈ-మార్కెటింగ్‌లో వారి పేర్లను నమోదు చేసుకోవాలి. కొవిడ్‌-19 కారణంగా చేనేత ఉత్పతులకు సరైన మార్కెటింగ్‌ లేక నష్టపోతున్నారు. ఈ మేరకు వారిని ఆదుకునేందుకుగాను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానాన్ని ప్రవేశ పెట్టాయి. జియో ట్యాగ్‌ కలిగిన ప్రతి చేనేత కార్మికుడు వారు తయారు చేసిన ఉత్పతులను ఆన్‌లైన్‌లోనే విక్రయం చేసుకునేందుకు ప్రభుత్వం ఈ మార్కెట్‌ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు హైదరాబాద్‌లోని చేనేత సేవా కేంద్రంలో (వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌)ను సంప్రదించాలి. 

-విజియ పల్లవి బోయి,                                                         రంగారెడ్డి జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి