బుధవారం 21 అక్టోబర్ 2020
Rangareddy - Sep 26, 2020 , 01:04:41

యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య

లైంగిక వేధింపులే కారణమంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తుల నిరసన

నచ్చచెప్పి పంపించిన పోలీసులు

మొయినాబాద్‌ : కూతుర్ల పోషణ భారంగా భావించిన తండ్రి ఓ ఇంట్లో పాచి పని చేయడానికి పెట్టాడు. గురువారం రాత్రి ఇద్దరు యువతుల్లో పెద్ద అమ్మాయి అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి యజమాని లైంగిక వేధింపులకు గురి చేయడంతోనే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ శుక్రవారం పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని రహస్యంగా తరలించడంపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం మండల పరిధిలోని ఆలూరి గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పెద్ద భార్య పదేండ్ల క్రితం మృతి చెందింది. దీంతో ఇబ్రహీం మరో పెండ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టాడు. పెద్ద భార్య ఇద్దరు కూతుర్లను పనిలో పెట్టాడు. అయితే హిమాయత్‌నగర్‌ గ్రామానికి చెందిన బాత్కు మధుయాదవ్‌ ఇంట్లో ఇబ్రహీం తన కూతుళ్లను నాజియా(17), ఆఫ్రీన్‌ను ఐదేండ్ల క్రితం పనికి పెట్టాడు. ఇద్దరు యువతులు అక్కడే పని చేసుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నారు. కాగా గురువారం ఉదయం తండ్రి ఇబ్రహీం బిడ్డల వద్దకు వచ్చి వెళ్లాడు. అదే రాత్రి నాజియా(17) అనుమానాస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం నాజియా పడి ఉండడాన్ని చెల్లెలు చూసి, ఇంటి యజమానికి చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు పంపారు. పోలీసులు మృతదేహాన్ని రహస్యంగా  పోస్టుమార్టానికి తరలించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పలు అనుమానాలకు తావిచ్చింది.  కనీసం సర్పంచ్‌కి కానీ, కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మృతదేహాన్ని ఎలా తరలించారని మండిపడ్డారు. అయితే నాలుగు రోజుల నుంచి అక్కను వేధిస్తున్నాడని, ఏమైందని అడిగినా చెప్పలేదని మృతురాలి చెల్లెలు తెలిపింది. అక్క ఉరి వేసుకుని చనిపోతే  కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాలని, లేదంటే చంపేస్తానని ఇంటి యజమాని బెదిరించాడని చెల్లెలు మీడియా ముందు చెప్పింది. ఇంటి యజమాని లైంగిక వేధింపులకు గురి చేయడంతో తన కూతురు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. మధుయాదవ్‌ను అరెస్టుచేయాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు : ఇన్‌స్పెక్టర్‌ జానయ్య

కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుందని చెల్లెలు ఆఫ్రీన్‌ ఫిర్యాదులో పేర్కొన్నది. ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాకుండా కుటుంబసభ్యులు చేసిన ఆరోపణలను కూడా పరిగణలోనికి తీసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తాం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాం.


logo