శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 30, 2020 , 23:17:12

మొక్కలను సంరక్షించాలి

మొక్కలను  సంరక్షించాలి

  కాలనీల సమస్యలు పరిష్కరిస్తా

  మొక్కలు నాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

  బడంగ్‌పేట, ఆగస్టు30 :  నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని 17 వ వార్డులోని వివేకానగర్‌లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం న్యూవివేకానగర్‌ కాలనీలో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   మొక్కలు  నాటి కాపాడాలని, కాలనీలను  గ్రీనరీగా మార్చాలన్నారు.  ఇంటింటికీ ఆరు మొక్కలను నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలనీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.  మీర్‌పేట పరిధిలోని  అవుట్‌ లెట్‌ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ట్రంక్‌ లైన్‌ పనులు పూర్తి అయితే కాలనీలో నీటి సమస్య ఉండదన్నారు. సందచెరువును సుందరీకరణ చేయిస్తున్నామని వెల్లడించారు. 

మీర్‌పేట కార్పొరేషన్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా సురేశ్‌ యాదవ్‌ మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ చేరారు. మంత్రి ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు.  అందరూ సమన్వయంతో పనిచేసి  పార్టీని తిరుగు లేని శక్తిగా మార్చాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్స్‌ సిద్దాల లావణ్య బీరప్ప, గజ్జల రాంచందర్‌, అనిల్‌ కుమార్‌, అర్కల భూపాల్‌రెడ్డి, పోరెడ్డి పద్మ భాస్కర్‌రెడ్డి, సిద్దాల పద్మ, బొక్క రాజేందర్‌రెడ్డి, ముద్ద పవన్‌ కుమార్‌, నవీన్‌ గౌడ్‌, తీగల మాధవి సాయినాథ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


   కొత్తగూడను అభివృద్ధి చేస్తా ..

  కందుకూరు : కొత్తగూడ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సామ ప్రకాశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, పార్టీ అధ్యక్షుడు రాయిచెట్టు యాదయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ బొక్క దీక్షిత్‌రెడ్డి, లక్ష్మాణాచారి, వెంకటేశ్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి  ఆదివారం మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు.  అదే విధంగా కొత్తగూడ, కొత్తూరు గ్రామాల మధ్యగల వాగుపై బ్రిడ్జిని  ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు శేఖర్‌, యాదయ్య, లక్ష్మయ్య, శంకరయ్య, గట్టు కృష్ణారెడ్డి ఉన్నారు.