సోమవారం 03 ఆగస్టు 2020
Rangareddy - Jul 08, 2020 , 00:35:43

ఆదర్శం మన పథకాలు

ఆదర్శం మన పథకాలు

కేంద్రంతో పాటు అనేక రాష్ర్టాల్లో తెలంగాణ కార్యక్రమాలు అమలు 

అందరి భాగస్వామ్యంతో హరితహారం 

నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలి 

మొక్కలు నాటిన మంత్రులు తలసాని, సబితాఇంద్రారెడ్డి

సిటీబ్యూరో/తుక్కుగూడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని మామిడిపల్లిలో షీప్‌ బ్రీడింగ్‌ ఫామ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రజలందరి భాగస్వామ్యంతో హరిత కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలు ఆమలు చేయడం  గర్వకారణమన్నారు. తెలంగాణకు ప్రధానమైన కార్యక్రమం  హరితహారమని పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నమన్నారు. ఇంతగొప్ప కార్యానికి సీఎం కేసీఆర్‌ బీజం వేశారన్నారు. పట్టణాలు, గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి.. నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డా. లక్ష్మారెడ్డి, తెలంగాణ పశుగణాభివృద్ధి శాఖ సీఈవో డా.మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. విజయకుమార్‌రెడ్డి, మహేశ్వరం తహసీల్దార్‌ జ్యోతి,  తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకర్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, కౌన్సిలర్లు సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్‌, రెడ్డిగళ్ల సుమన్‌, బూడిద తేజశ్వినీశ్రీకాంత్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ సురేశ్‌,  మాజీ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, రాకేశ్‌ గౌడ్‌, ఆయా శాఖల అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పశుగ్రాస వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు .

నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు... మంత్రి సబితాఇంద్రారెడ్డి 

భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను కూడా సమకూర్చామన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని, నాటిన మొక్కలను సంరక్షించేలా చూడాలని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.


logo